రాజమౌళి కళ్లు తెరిపించిన పల్లెటూరి ఆవిడ ఎవరు?
సౌత్ ఇండియన్ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది.
By: Sivaji Kontham | 29 Sept 2026 9:51 PM ISTసౌత్ ఇండియన్ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌లలో ఒకటైన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం హైదరాబాద్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా గురించి, చిత్ర యూనిట్ పనితీరు గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రాజమౌళి మాట్లాడిన ప్రతీ మాట ప్రస్తుతం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ నటనపై రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు. ఫాహద్ నటన చూసి తాను పూర్తిగా ఆశ్చర్యపోయానని.. అతడి సినిమాలను తాను కొంత ఆలస్యంగా డిస్కవర్ చేసినప్పటికీ ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఒక పల్లెటూరు ఆవిడ ద్వారా కూడా ఫాహద్ సినిమాలు ఎంతగా పాపులర్ అయ్యాయో తనకు అర్థమైందని రాజమౌళి చెప్పుకొచ్చారు.
`డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` సినిమా కథ పుట్టుక గురించి చెబుతూ రాజమౌళి ఆసక్తికరమైన జ్ఞాపకాలను షేర్ చేసారు. నాలుగు సంవత్సరాల క్రితం దర్శకుడు శశాంక్ తన దగ్గరకు వచ్చి కథ చెప్పడానికి మూడు గంటలు సమయం కావాలని అడిగాడని.. కానీ తాను కేవలం ఐదు నిమిషాలు మాత్రమే టైమ్ ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో `దెయ్యాన్ని కిడ్నాప్ చేసిన మనిషి` అనే ఒకే ఒక లైన్‌తో శశాంక్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాడని ప్రశంసించారు.
ఈ మూవీ ఫస్ట్ కాపీ చూసిన అనుభూతిని రాజమౌళి ప్రేక్షకులతో పంచుకున్నారు. కొద్ది నెలల క్రితం రీ-రికార్డింగ్, డబ్బింగ్ ఏమీ లేకుండానే ఫస్ట్ కాపీ చూశానని.. ఆ సినిమా చూసి చాలాసేపు నవ్వానని.. అలాగే ఎమోషనలై కన్నీళ్లు పెట్టుకున్నానని తెలిపారు. ఇది కేవలం పిల్లల సినిమా మాత్రమే కాకుండా..పెద్దల్లోని చిన్నపిల్లల కోసం తీసిన ఒక అద్భుతమైన చిత్రమని కొనియాడారు.
ఇదే వేదికపై నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ బిజినెస్ చేసే విధానాన్ని రాజమౌళి ప్రత్యేకంగా అభినందించారు. అవతలి వ్యక్తికి రూపాయి విలువ ఎంత ముఖ్యమో గుర్తించి.. తాను కూడా అంతే విలువ ఇస్తాడని.. అలాంటి అరుదైన లక్షణం తాను ఎవరిలోనూ చూడలేదని పేర్కొన్నారు. అన్ని హంగులు సంతరించుకున్న ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందని.. అందరూ థియేటర్లలో ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయాలని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు.
