'వారణాసి' గ్లింప్స్: మార్వల్ సినిమాని కొట్టేలా రాజమౌళి అసాధారణ ప్రయత్నం
ఆకాశానికి తాడు వేసి ఎలాగైనా చందమామను దాటుకుని చుక్కల్లో షికార్లు చేయాలని, గ్రహాలు, నక్షత్రాలతో ఆటలాడుకోవాలని ఆశపడితే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం అంతే అసాధారణంగా ఉంది
By: Sivaji Kontham | 15 Nov 2025 10:00 PM ISTఆకాశానికి తాడు వేసి ఎలాగైనా చందమామను దాటుకుని చుక్కల్లో షికార్లు చేయాలని, గ్రహాలు, నక్షత్రాలతో ఆటలాడుకోవాలని ఆశపడితే అది ఎలా ఉంటుంది? ఇప్పుడు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం అంతే అసాధారణంగా ఉంది. ఇన్నిరోజులు మార్వల్ సినిమాటిక్స్, లైన్స్ గేట్ సినిమాలు, డిసి సినిమాలు అంటూ హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుకున్న భారతీయ ప్రజలు ఇకపై రాజమౌళి సినిమాటిక్ (గ్లోబ్ ట్రాటర్) యూనివర్శ్ గురించి మాట్లాడుకుంటే అతిశయోక్తి కాదు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాలతో అతడు భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చాడు. ఇప్పుడు మహేష్ తో గ్లోబ్ ట్రాటర్ వెనక అసలు టైటిల్ కథేమిటో రివీల్ చేసాడు.
ఇంతకుముందే లీక్డ్ వీడియోలో ఎస్.ఎస్.ఎంబి 29 టైటిల్ `వారణాసి` అని లీకైపోయింది. అధికారికంగా `వారణాసి` టైటిల్ గ్లింప్స్ నేటి సాయంత్రం రామోజీ ఫిలింసిటీలో సూపర్ ఐమ్యాక్స్ స్క్రీన్ పై రాజమౌళి బృందం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ వీక్షిస్తుంటే ఏదైనా మాయా ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నామా? అంటూ కళ్లప్పగించి చూడాల్సిందే. టైటిల్ గ్లింప్స్ ఆద్యంతం విజువల్ మాయాజాలానికి కళ్లు భైర్లు కమ్మేయాల్సిందే.
టైటిల్ గ్లింప్స్ విజువల్ లో మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, పౌరాణికం, చారిత్రక ఘటనలను కలగలిపి లార్జర్ దేన్ లైఫ్ పాత్రల ఎలివేషన్ తో రాజమౌళి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. భారతీయ తెరపై నెవ్వర్ బిఫోర్ విజువల్స్ ని అతడు తయారు చేస్తున్నాడు. ఇది ప్రపంచస్థాయి సినిమాకు ఎంతమాత్రం తీసిపోని `పాన్ వరల్డ్` సినిమా అని ఒకే ఒక్క టైటిల్ లాంచ్ తో భరోసానిచ్చాడు. ఈ టైటిల్ గ్లింప్స్ లో అంజనీపుత్రుడు ఆంజనేయుడి విశ్వరూపాన్ని, శ్రీరాముని శౌర్యాన్ని పరిచయం చేసాడు.
512 CE పురాతన వారణాసిని పునఃసృష్టించాడు జక్కన్న. శాంభవి అనే గ్రహశకలం అంటార్కిటికాను ఢీకొట్టి, మంచు కింద దాగి ఉన్న పురాతన నగరాన్ని బహిర్గతం చేసే విశ్వ సంఘటనను ట్రైలర్ లో ఆవిష్కరించిన తీరు నభూతోనభవిష్యతి. `వారణాసి` అనే టైటిల్ ఎందుకు పెట్టారో ఈ విజువల్ జస్టిఫై చేసింది.
512 CEలో పాత నగరం వారణాసిలో ఏం జరిగిందో పెద్ద తెరపై చూసి తీరాల్సిందే అనిపించేలా కోరికను రగిల్చాడు. రాజమౌలి బృందం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో అత్యంత వివరణాత్మక వారణాసి సెట్‌ను నిర్మించి ఆ సెట్ లో స్క్రీన్ పై ప్రదర్శించడానికి కారణం అర్థమైంది. చరిత్రతో పురాణాల లింకులను కలిపి, దేవుళ్లపై నమ్మకం లేదంటూనే దేవుళ్లను తెరపై చూపిస్తూ రాజమౌళి విజువల్ మాయాజాలం సృష్టించిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. భూమి వైపు దూసుకుపోతున్న మండుతున్న గ్రహశకలాలు ఒక పాత నగరాన్ని చూపించాయి. ఈ చిత్రం శాంభవి అనే ఒక నిర్దిష్ట గ్రహశకలాన్ని ప్రదర్శించింది. ఇది ఆకాశం గుండా ఊడి పడి అంటార్కిటికాలోని రాస్ ఐస్ షెల్ఫ్‌పై ల్యాండ్ అవుతుంది. ఇది మంచు కప్పు కింద దాగి ఉన్న పురాతన నగరం వారణాసిని ఆవిష్కరించింది.
అతి ప్రాచీన నగర దృశ్యాలు, చారిత్రక నాగరికతల శిథిలాల వెనక పరిమాణామాన్ని భారీ VFXలో సృష్టించిన విధానం కళ్లకు మిరుమిట్లు గొలుపుతుంది. ఒంటిని గగుర్పాటుకు గురి చేస్తుంది. విస్మయపరుస్తుంది. ఒక యాక్షన్ అడ్వెంచర్ స్టోరీలో సూపర్ స్టార్ మహేష్ ని ఏ రేంజులో ఎలివేట్ చేయాలో అదే లెంగ్త్ తో టైటిల్ విజువల్‌లో మహేష్ ని ఆవిష్కరించారు. అతడు ఒక వృషభంపై దూసుకొచ్చే విజువల్ కి ఫ్యాన్స్ గగ్గోలు పెట్టారు. విజిల్స్ తో ఆర్.ఎఫ్.సిలో హీట్ పుట్టించారు. మహేష్ నెవ్వర్ బిఫోర్ అవతార్ లో కనిపిస్తాడని, లార్జర్ దేన్ లైఫ్ పాత్రలో అతడు ఇచ్చే ట్రీట్ ప్రపంచ ఆడియెన్ కి రీచ్ అవ్వడం ఖాయమని ఈ టైటిల్ గ్లింప్స్ భరోసానిచ్చింది.
