వారాణసి: ఆడియెన్స్ దీనికి కూడా డబ్బులు ఇవ్వాలా?
తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆలోచనలు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాయి.
By: M Prashanth | 6 May 2026 11:48 AM ISTతెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆలోచనలు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటాయి. సినిమాను ఎలా తీయాలో మాత్రమే కాదు, దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ప్రస్తుతం మహేష్ బాబుతో ఆయన చేస్తున్న అడ్వెంచర్ డ్రామా 'వారణాసి'పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పరంగా కీలక దశకు చేరుకుంది.
అయితే సినిమా రిలీజ్‌కు ముందే ఒక టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఇది విన్న సినీ ప్రియులు కొంత ఆశ్చర్యానికి, మరికొంత ఆందోళనకు గురవుతున్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ మేకింగ్ వీడియోలు, తెర వెనుక దృశ్యాలను వారణాసి BTS అంటూ వీడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ లో ఉన్నారట. అయితే చూడటానికి మేకర్స్ ఒక సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను ప్రవేశపెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
సుమారు 199 రూపాయలు చెల్లిస్తేనే ఆ కంటెంట్ చూసే అవకాశం ఉంటుందట. సాధారణంగా మేకింగ్ వీడియోలు అంటే సినిమాపై హైప్ పెంచడానికి ఉచితంగా వదిలే ప్రమోషనల్ స్టఫ్. కానీ రాజమౌళి లాంటి పెద్ద దర్శకుడు ఇలా మేకింగ్ వీడియోలకూ డబ్బులు వసూలు చేయాలని చూడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది నిజంగా జక్కన్న స్ట్రాటజీయేనా లేక కేవలం పుకారా అనేది ఇంకా తేలాల్సి ఉంది.
ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రియాక్షన్ వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే టికెట్ రేట్ల పెంపుతో సామాన్య ప్రేక్షకుడు థియేటర్‌కు రావాలంటేనే ఆలోచిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో కేవలం మేకింగ్ వీడియోల కోసం కూడా డబ్బులు అడగటం అనేది కొంత కరెక్ట్ కాదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. "సినిమా టికెట్‌కు ఎలాగూ పే చేస్తాం, కానీ షూటింగ్ వీడియోలకూ డబ్బులేంటని" సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఒకవేళ బడ్జెట్ రికవరీ కోసమే ఇలా చేస్తున్నారనుకున్నా, ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది అనుమానమే.
ప్రస్తుతం ఈ సినిమా కోసం జక్కన్న హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని వాడుతున్నారు. మహేష్ బాబును గతంలో ఎన్నడూ చూడని స్టైల్ లో చూపిస్తూ, ప్రియాంక చోప్రా వంటి గ్లోబల్ స్టార్లను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం చేశారు. అంతా బాగానే ఉంది కానీ, ఇలాంటి వినూత్నమైన మార్కెటింగ్ ప్రయత్నాలు బెడిసికొడితే సినిమా ఇమేజ్‌పై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
ఇప్పటికే ఈ సబ్‌స్క్రిప్షన్ వార్తలపై మీమ్స్ రచ్చ మొదలైంది. అసలు విషయం ఏంటనేది చిత్ర యూనిట్ అధికారికంగా క్లారిటీ ఇస్తే తప్ప ఈ గందరగోళం ముగిసేలా లేదు. ఇక రాజమౌళి సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద సునామీ ఖాయం. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో నెగిటివిటీ రాకుండా చూసుకోవడం మేకర్స్ బాధ్యత. బహుశా హాలీవుడ్ సినిమాలకు ఉండే పర్సనల్ యాప్ లేదా క్లబ్ మెంబర్‌షిప్ తరహాలో ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి.
