అన్నపూర్ణలో కొత్త టెక్నాలజీ.. ఇకపై ఫారిన్ వెళ్లక్కర్లేదు..
ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏ అండ్ ఎం మోక్యాప్ ల్యాబ్ పేరుతో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ల్యాబ్ ఏర్పాటు చేశారు. దాన్ని డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ప్రారంభించారు.
By: M Prashanth | 25 Feb 2026 10:17 PM ISTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో కీలకమైన సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. భారీ విజువల్స్, యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్ బేస్డ్ స్టోరీలకు అవసరమైన అత్యాధునిక మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఉంది. దీంతో దర్శకులు, నిర్మాతలు ఫారిన్ కు వెళ్లకుండా ఇక్కడే ప్రపంచ స్థాయి సినిమాలు రూపొందించే అవకాశం లభించింది.
ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏ అండ్ ఎం మోక్యాప్ ల్యాబ్ పేరుతో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ల్యాబ్ ఏర్పాటు చేశారు. దాన్ని డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ప్రారంభించారు. కింగ్ అక్కినేని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్, నిర్మాత శోభు యార్లగడ్డ స్థాపించిన మిహిరా విజువల్ ల్యాబ్స్, హాలీవుడ్ టెక్నాలజీ సంస్థ యానిమేట్రిక్ ఫిల్మ్ డిజైన్ కలిసి ఆ ప్రాజెక్ట్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాయి.
మోషన్ క్యాప్చర్ అంటే క్యాస్టింగ్ మూవ్మెంట్స్, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ ను స్పెషల్ కెమెరాల ద్వారా రికార్డు చేసి, వాటిని కంప్యూటర్ గ్రాఫిక్స్ గా మార్చడం. దీని సహాయంతో యాక్షన్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, యానిమేషన్ తరహా సీన్స్ ను న్యాచురల్ గా, అద్భుతంగా చూపించవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి సదుపాయాల కోసం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఫారిన్ స్టూడియోలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు అదే టెక్నాలజీ హైదరాబాద్ లో అందుబాటులో ఉండడం విశేషం.
ఓపెనింగ్ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, "మన దేశంలో మంచి టాలెంట్ ఉంది. కానీ అత్యాధునిక టెక్నాలజీ మాత్రం అందుబాటులో ఉండేది కాదు. గతంలో నేను తీసిన భారీ చిత్రాల సమయంలో ఆ సదుపాయం ఉంటే మరింత బాగా తీసేవాడిని. ఇప్పుడు ఆ లోటు తీరింది" అని అన్నారు. తన లేటెస్ట్ మూవీలోని వారణాసిలో కొన్ని కీలక సన్నివేశాలను ఈ ల్యాబ్ లోనే చిత్రీకరించామని వెల్లడించారు. టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందని చెప్పారు.
నాగార్జున మాట్లాడుతూ, "ప్రపంచ స్థాయి కథలను చెప్పాలంటే సాంకేతికత కూడా అదే స్థాయిలో ఉండాలి. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలను తీసుకురావడమే మా లక్ష్యం. ఈ ల్యాబ్ ఫ్యూచర్ జనరేషన్ల దర్శకులకు చాలా ఉపయోగపడుతుంది" అన్నారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ప్రొడక్షన్ పాయింట్ గా మార్చాలనేది తమ ఆశయమని తెలిపారు.
శోభు యార్లగడ్డ మాట్లాడుతూ, భారతీయ సినిమాలు గ్లోబల్ స్థాయిలో పోటీ పడాలంటే ఇలాంటి సదుపాయాలు దేశంలో ఉండాలని చెప్పారు. సినిమాలతో పాటు గేమింగ్, యానిమేషన్, వెబ్ కంటెంట్ రంగాలకు కూడా కొత్త సదుపాయం యూజ్ అవుతుందని పేర్కొన్నారు. అయితే ల్యాబ్ లో క్యాప్చర్ స్పేస్, హై క్వాలిటీ కెమెరాలు, రియల్ టైమ్ ట్రాకింగ్ సిస్టమ్, ఫేషియల్ క్యాప్చర్ సదుపాయాలు ఉన్నాయి. ఏదేమైనా 50 ఏళ్ల సినీ జర్నీ పూర్తి చేసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్ లో మోషన్ క్యాప్చర్ ల్యాబ్ ఏర్పాటు అవ్వడం మరో మైల్ స్టోన్ గా నిలిచింది.
