జక్కన్న ప్లాన్.. మహేష్ కు గ్లోబల్ రీచ్ దక్కేనా?
తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో మహేష్ బాబు క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. కానీ నార్త్ అమెరికా, యూరప్ లోని నాన్ఇండియన్ ఆడియన్స్ కు మాత్రం మన సూపర్ స్టార్ కొత్త.
By: M Prashanth | 26 Oct 2026 9:00 PM IST'ఆర్ఆర్ఆర్' తో ఆస్కార్ వేదికను షేక్ చేసిన రాజమౌళి ఆ క్రేజ్ ను ఏమాత్రం వృధా పోనివ్వడం లేదు. సినిమా సెట్స్ లో, ఎడిటింగ్ రూమ్ లో బిజీగా ఉండాల్సిన ఈ స్టార్ డైరెక్టర్ తరచుగా విదేశీ ఈవెంట్లలో కనిపిస్తూ ఆడియన్స్ తో టచ్ లో ఉంటున్నారు. అక్కడ తనకు దక్కిన గ్లోబల్ గుర్తింపును, ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' సినిమా ఓపెనింగ్స్ కోసం వాడుకునేలా జక్కన్న భారీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో మహేష్ బాబు క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. కానీ నార్త్ అమెరికా, యూరప్ లోని నాన్ఇండియన్ ఆడియన్స్ కు మాత్రం మన సూపర్ స్టార్ కొత్త. వాళ్లను థియేటర్లకు రప్పించాలంటే కేవలం హీరో ఇమేజ్ సరిపోదు. అందుకే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో వాళ్ళకు బాగా రిజిస్టర్ అయిన తన బ్రాండ్ ఇమేజ్ ను ముందు పెట్టి, ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ కు ఇంటర్నేషనల్ మార్కెట్ ను సెట్ చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నారు.
ఇక కంటెంట్ పరంగా చూసుకుంటే 'వారణాసి' ఒక రెగ్యులర్ కమర్షియల్ బొమ్మ కాదు. పూర్తిస్థాయి ఐమాక్స్ టెక్నాలజీతో, కళ్లు చెదిరే కెమెరాలతో దీన్ని చిత్రీకరిస్తున్నారు. టైమ్ ట్రావెల్, మైథాలజీ అంశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను కలిపే కథ కావడంతో, దీనికి తగ్గట్టుగానే విదేశీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్ ను డిజైన్ చేయాల్సిన అవసరం జక్కన్నపై ఉంది.
ఈ గ్లోబల్ మిషన్ లో కాస్టింగ్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. హాలీవుడ్ మీడియాకు బాగా పరిచయం ఉన్న గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాను 'మందాకిని' పాత్ర కోసం తీసుకోవడం ఈ ప్రాజెక్ట్ కు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. విదేశీ ప్రమోషన్లలో రాజమౌళికి ఆమె తోడైతే రీచ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అటు సౌత్ మార్కెట్ ను లాక్ చేయడానికి మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఎలాగూ ఉన్నారు.
ప్రస్తుతం 'వారణాసి' షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కంప్లీట్ కాగా, ఓ వైపు ఎడిటింగ్, మరోవైపు విజువల్ ఎఫెక్ట్స్ పనులు సమాంతరంగా నడుస్తున్నాయి. 2027 ఏప్రిల్ 7న ఈ విజువల్ వండర్ ను థియేటర్లలోకి తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా లాక్ చేసేశారు. ఆ టార్గెట్ కు తగ్గట్టుగానే ఇటు షూట్, అటు ఇంటర్నేషనల్ పబ్లిసిటీ బ్యాలెన్స్ చేస్తున్నారు.
ఇప్పుడు జక్కన్న విదేశీ టూర్లు అన్నీ కేవలం 'వారణాసి' ముందస్తు అడుగులు మాత్రమే. సినిమా రిలీజ్ దగ్గర పడేకొద్దీ ఇంటర్నేషనల్ ప్రీమియర్లు, ఐమాక్స్ స్పెషల్ ప్రమోషన్లు గట్టిగానే ప్లాన్ చేస్తారు. అయితే ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ ను విదేశాల్లో డిస్ట్రిబ్యూట్ చేసే పార్ట్నర్స్ ఎవరన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఆ డీల్స్ కూడా సెట్ అయితే జక్కన్న బాక్సాఫీస్ వేట ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
