అంతర్జాతీయ మీడియాని ఆకర్షించడంలో మాస్టర్ మైండ్.. నేటి ఔత్సాహిక దర్శకులకు స్ఫూర్తి!
ఇక సినిమా కంటెంట్ విషయానికొస్తే.. ఇటీవల ఎంపైర్ ఫిల్మ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
By: Sivaji Kontham | 18 Oct 2026 5:00 AM ISTప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. డిజిటల్ సాంకేతికత విప్లవంతో ఎవరు ఏ మూలన ఉన్నా ప్రపంచానికి పరిచయం కావడం కష్టమేమీ కాదు. అయితే సినిమాల ప్రమోషన్స్ కోసం.. విదేశీ మార్కెట్ ని ఒడిసిపట్టకోవడం కోసం ప్రపంచ మీడియాకు పరిచయం కావడానికి కొన్ని ప్రత్యేకమైన వ్యూహాలు అవసరం. ఇలాంటి వ్యూహాలు ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇవన్నీ నేటితరం ఫిలింమేకర్స్ కి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. పూర్తి కథనంలోకి వెళితే...
భారతీయ సినిమాను ప్రపంచ స్థాయి వేదికలపై నిలబెట్టడంలో జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి అనుసరించే వ్యూహాలు అత్యంత ప్రత్యేకమైనవి. అంతర్జాతీయ మీడియా దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో ఆయన శైలి అపూర్వం. గతంలో బాహుబలి, బాహుబలి 2 చిత్రాల ప్రచారం కోసం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌ను ఎంచుకుని ఆర్కా మీడియా బృందంతో కలిసి రాజమౌళి గ్లోబల్ ప్రమోషన్లు నిర్వహించారు. ఆ తర్వాత అదే సఫలీకృత వ్యూహాన్ని `ఆర్ఆర్ఆర్` విషయంలోనూ కొనసాగించి..ఆస్కార్ స్థాయి వరకు తీసుకెళ్లారు. అంతర్జాతీయ వేదికలపై విదేశీ మీడియా- ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ద్వారా సినిమా మార్కెట్‌ను ప్రపంచవ్యాప్తంగా పెంచుకోవడం సులువని ఆయన రుజువు చేశారు. ప్రతిష్ఠాత్మక ఆస్కార్స్ లో, హాలీవుడ్ ఫిలింక్రిటిక్స్ లో, గోల్డెన్ గ్లోబ్స్ లో తన ప్రభ ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించారు. అంతర్జాతీయ పురస్కారాలలో ఒక వెలుగు వెలిగారు.
ఇప్పుడు ఆ ప్రమోషన్ల వ్యూహాన్ని రాజమౌళి మరో మైలురాయికి తీసుకెళ్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో కె.ఎల్. నారాయణ, కార్తికేయ నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కాబోతుండగా.. ఇంకా 7-8 నెలల సమయం ఉండగానే అంతర్జాతీయంగా గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ముఖ్యంగా వెస్ట్రన్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ కోసం ఇటీవల కాలిఫోర్నియాలోని ఒక ఫిలిం అండ్ మీడియా ఆర్ట్స్ కాలేజీలో స్టూడెంట్స్‌తో ముఖాముఖి నిర్వహించారు. అక్కడి గ్లోబల్ మీడియా నుండి ఆయనకు విశేష ఆదరణ లభించింది. ఇదే క్రమంలో అమెరికాలో సైమన్ కోవెల్ రూపకల్పనలో టెర్రీ క్రూస్ హోస్టింగ్‌లో నడిచే సైమన్, హెడీ క్లమ్, సోఫియా వెర్గారా, హౌవీ మాండెల్ వంటి జడ్జిలతో కూడిన పాపులర్ రియాలిటీ షో `అమెరికాస్ గాట్ టాలెంట్` వేదికపై కూడా `వారణాసి`ని ప్రమోట్ చేస్తే మైలేజ్ అద్భుతంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
ఇక సినిమా కంటెంట్ విషయానికొస్తే.. ఇటీవల ఎంపైర్ ఫిల్మ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు వెండితెరపై తెరకెక్కిన రామాయణ, మహాభారత ఇతిహాసాల అడాప్టేషన్స్పై తనకు ఎప్పుడూ పూర్తిగా సంతృప్తి కలగలేదని.. ఈ భారతీయ పురాణ కథలను మరింత గ్రాండ్‌గా, సరికొత్త కోణంలో గ్లోబల్ ఆడియన్స్‌కు చూపించాలనేది తన చిరకాల కోరిక అని చెప్పారు. ఆ దిశగానే `వారణాసి` చిత్రంలో రామాయణం ఆధారంగా రూపొందించిన ఒక అత్యంత కీలకమైన ఎపిసోడ్ ద్వారా తన విజన్‌ను ఆవిష్కరించబోతున్నారు.
ఈ రామాయణ ఆధారిత ప్రత్యేక సీక్వెన్స్ అద్భుతమైన విజువల్స్ తో పాటు ఘాఢమైన భావోద్వేగాలతో కూడి ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో రాముడి గెటప్‌లో ఉన్న మహేష్ బాబును చూసినప్పుడు తనకు స్వయంగా గూస్బంప్స్ వచ్చాయని రాజమౌళి పేర్కొన్నారు. కేవలం ఈ ఒక్క ప్రత్యేకమైన సీన్‌ను చిత్రీకరించడానికే దర్శకనిర్మాతలకు దాదాపు 60 రోజుల సమయం పట్టిందంటే దీని స్కేల్ ఎంత భారీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే `వారణాసి` చిత్రం పూర్తిగా రామాయణ కథ కాదని.. కథలో భాగంగా వచ్చే ఒక ప్రభావవంతమైన ఘట్టం మాత్రమేనని రాజమౌళి స్పష్టం చేశారు. మన ఇతిహాసాల గురించి ముందస్తు అవగాహన లేని అంతర్జాతీయ ప్రేక్షకులు సైతం సీన్లోని భావోద్వేగాలను సులభంగా అర్థం చేసుకుని లీనమయ్యేలా ఈ ఎపిసోడ్‌ను డిజైన్ చేశారు. సరికొత్త ప్లానింగ్, వినూత్న అంతర్జాతీయ ప్రమోషన్లతో రూపుదిద్దుకుంటున్న `వారణాసి` ప్రపంచ సినిమా వేదికపై కొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
