Begin typing your search above and press return to search.

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

అసలు ఈ వ్యూ ఫైండర్ ఉపయోగం ఏంటంటే షూటింగ్‌లో కెమెరా పెట్టకముందే ఒక షాట్ ఎలా కనిపిస్తుందో చూసుకోవచ్చు.

By:  M Prashanth   |   3 Nov 2026 11:08 AM IST
తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?
X

మొదటి సినిమా హిట్టయితే ఏ దర్శకుడికైనా ఆ ఆనందమే వేరు. ముఖ్యంగా అప్పటివరకు పెద్దగా సంపాదన లేని వ్యక్తికి మంచి రెమ్యునరేషన్ వస్తే తనకోసం ఏదైనా కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ రాజమౌళి మాత్రం తన తొలి సినిమా సక్సెస్ తర్వాత వచ్చిన డబ్బుతో ఓ ఖరీదైన వస్తువు కొన్నారు. అది కారు కాదు, ఇంట్లోకి కావాల్సిన వస్తువు అంతకంటే కాదు. సినిమా షూటింగ్‌లో ఉపయోగించే ఓ పరికరం. ఈ విషయాన్ని నటుడు రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

'స్టూడెంట్ నెంబర్ వన్' సూపర్ హిట్ కావడంతో రాజమౌళికి మంచి రెమ్యునరేషన్ వచ్చింది. అప్పట్లో ఇంటర్నెట్ అంతగా అందుబాటులో ఉండేది కాదు. దీంతో శ్రీనగర్ కాలనీలోని ఓ ఇంటర్నెట్ కేఫ్‌కు వెళ్లి తనకు కావాల్సిన పరికరం కోసం వెతికారట. చివరికి రూ.75 వేలు ఖర్చు చేసి ఓ వ్యూ ఫైండర్ కొనుగోలు చేశారు. దాదాపు 25 ఏళ్ల క్రితం 75 వేలు అంటే ఎంత పెద్ద మొత్తమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అసలు ఈ వ్యూ ఫైండర్ ఉపయోగం ఏంటంటే షూటింగ్‌లో కెమెరా పెట్టకముందే ఒక షాట్ ఎలా కనిపిస్తుందో చూసుకోవచ్చు. ఫ్రేమ్ ఎంతవరకు వస్తుంది, ఏ యాంగిల్‌లో తీస్తే బాగుంటుందనే విషయాలపై దర్శకుడికి అవగాహన వస్తుంది. సాధారణంగా ఇలాంటి పరికరాలను కెమెరా విభాగం చూసుకుంటుంది. కానీ రాజమౌళి మాత్రం తనకంటూ సొంతంగా ఒకటి ఉండాలని భావించి అంత ఖర్చు చేశారు. అది కూడా కెరీర్ ప్రారంభంలోనే కావడం విశేషం.

నిజానికి రాజమౌళి సినిమాల్లో ప్రతి షాట్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో తెలిసిందే. 'సై', 'విక్రమార్కుడు' నుంచి 'మగధీర', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వరకు ఆయన సినిమాల మేకింగ్‌లో వచ్చిన మార్పును చూడొచ్చు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా దాన్ని తన కథకు తగ్గట్లుగా ఉపయోగించుకోవడంలో రాజమౌళి రూటే వేరు. ఇప్పుడు వారణాసి అంతకుమించి అనేలా రాబోతోంది.

ఇదే ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు. 'ఛత్రపతి' ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ప్రభాస్ ఎలివేషన్ చూసి అప్పట్లో ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయట. ఆ సన్నివేశాన్ని రాజమౌళి తెరకెక్కించిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు. ఒకవైపు టెక్నికల్ అంశాలపై పట్టు పెంచుకుంటూనే మరోవైపు ఎమోషన్స్, హీరో ఎలివేషన్ల విషయంలోనూ ఆయన ప్రత్యేకత చూపించారు. అప్పట్లో రూ.75 వేల వ్యూ ఫైండర్ కోసం ఇంటర్నెట్ కేఫ్‌లో వెతికిన రాజమౌళి ఇప్పుడు ప్రపంచస్థాయి టెక్నీషియన్లతో సినిమాలు చేస్తున్నారు. వందల కోట్ల బడ్జెట్, భారీ సెట్స్, అత్యాధునిక కెమెరాలతో ఆయన సినిమాల స్థాయి పూర్తిగా మారిపోయింది.