Begin typing your search above and press return to search.

`ఈగ-2` లేదా మ‌రో కీట‌కం వైపు ద‌ర్శ‌క‌శిఖ‌రం చూడాల్సిందే!

ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో `బాహుబలి`, `ఆర్.ఆర్.ఆర్` చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి.

By:  Srikanth Kontham   |   12 Oct 2026 3:16 PM IST
`ఈగ-2`  లేదా మ‌రో కీట‌కం వైపు ద‌ర్శ‌క‌శిఖ‌రం చూడాల్సిందే!
X

ద‌ర్శ‌క‌శిఖ‌రం రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో `బాహుబలి`, `ఆర్.ఆర్.ఆర్` చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. వందల కోట్ల బడ్జెట్, భారీ తారాగణం, విజువల్ వండర్స్‌తో ఈ సినిమాలు ఆయన్ను గ్లోబల్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. అయితే టెక్నికల్ పరంగా, కంటెంట్ పరంగా రాజమౌళి తన కెరీర్‌లో అత్యంత గర్వంగా, ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా మాత్రం కచ్చితంగా `ఈగ` అనే చెప్పాలి. ఎలాంటి స్టార్ ఇమేజ్ లేని చిన్న కీటకాన్ని హీరోగా పెట్టి సాధారణ ప్రతీకార కథను అద్భుతమైన విజువల్ గ్రాఫిక్స్‌తో జ‌క్క‌న్న‌ తెరకెక్కించిన తీరు భారతీయ సినిమా చరిత్రలోనే ఓ అద్భుత సృష్టిగా నిలిచింది.

`ఈగ` చిత్రం విడుదలై దశాబ్దకాలం దాటినా? ఆ సినిమా అందించిన థ్రిల్, ఎమోషన్ ప్రేక్షకులను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. విలన్‌ను ఒక చిన్న పురుగు ఎలా ముప్పుతిప్పలు పెట్టిందనే కాన్సప్ట్ అప్పట్లో అందరినీ విస్మయానికి గురిచేసింది. సాధారణంగా కీటకాలను చిన్నచూపు చూస్తాం. కానీ వాటి కోణంలో ఆలోచిస్తే ఎలా ఉంటుందనే పాయింట్‌ను రాజమౌళి ఎంచుకున్న విధానం ఆయన జీనియస్‌కు నిదర్శనం. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి రాజమౌళిలోని సృజనాత్మకతకు అసలైన పరీక్షగా నిలిచింది.

అందుకేనేమో `బాహుబలి`, `ఆర్.ఆర్.ఆర్` వంటి భారీ చిత్రాలు చేసినా? ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ `ఈగ` మ్యాజిక్‌ను మళ్లీ చూడాలని కోరుకుంటూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చ జరిగినా `ఈగ-2` ప్రాజెక్ట్ గురించి అభిమానులు ఆసక్తిగా మాట్లాడుతుంటారు. అంతర్జాతీయ స్థాయిలో గ్రాఫిక్స్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో రాజమౌళి మళ్ళీ ఇలాంటి ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడితే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం నమోదవుతుందడంలో సందేహం లేదు.

సీక్వెల్ మాత్రమే కాకుండా ఈసారి `ఈగ`ను మించిన మరో కీటకం లేదా జీవి ఆధారంగా సినిమా చేస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా ఫ్యాన్స్ మధ్య జోరుగా సాగుతోంది. ప్రకృతిలో ఎన్నో విభిన్నమైన కీటకాలు, వాటి ప్రత్యేక జీవన విధానాలు ఉంటాయి. వాటిలో ఏదో ఒక ఆసక్తికరమైన కీటకాన్ని ఎంచుకుని, దాని చుట్టూ ఒక పవర్‌ఫుల్ డ్రామాను అల్లుకుంటే స్క్రీన్ మీద మాయ చేయడం రాజమౌళికి మాత్రమే చెల్లుతుంది. ఈ తరహా ఆలోచనలు ఆయన బ్రెయిన్ నుంచి వస్తే హాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయేలా ఉంటుంది.

ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో గ్లోబల్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత జ‌క్క‌న్న‌ ఏ ప్రాజెక్ట్ చేస్తారనే? దానిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఒకవేళ రాజ‌మౌళి భవిష్యత్తులో మళ్లీ రూట్ మార్చి.. తనలోని ఒరిజినల్ క్రియేటివిటీని బయటికి తీయాలనుకుంటే `ఈగ-2` లేదా మరో కీటకం నేపథ్య కథే సరైన ఎంపిక అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే? భారీ బడ్జెట్ చిత్రాలు ఎంత పేరు తెచ్చినా? ఇలాంటి ఎక్స్‌పరిమెంట్స్ ఇచ్చే కిక్కే వేరుగా ఉంటుంది.