నేను కూడా రెక్కలు చాచి `డ్రాగన్` కోసం ఎదురు చూస్తున్నా: రాజమౌళి
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.
By: Sivaji Kontham | 29 Sept 2026 10:36 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మిత్రుడు రాజమౌళి కోసం `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్` ప్రీ-రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అతిథిగా విచ్చేయడంతో కోలాహాలం పీక్స్ కి చేరుకుంది. అయితే ఇదే వేదికపై ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `డ్రాగన్` గురించిన చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వేదికపై లెజెండరీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి . మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేశాయి. ముఖ్యంగా రాజమౌళి మాట్లాడుతూ తాను కూడా రెక్కలు చాచి, నోట్లో నుంచి మంటలు చిమ్ముతున్న `డ్రాగన్` కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానని తెలపడం అభిమానుల్లో జోష్ నింపింది.
`కేజీఎఫ్`, `సలార్` వంటి సంచలన చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటమే దీనిపై హైప్ ఏర్పడటానికి ప్రధాన కారణం. మాస్ సినిమాలను అత్యున్నత దృశ్యకావ్యాలుగా మలచడంలో ప్రశాంత్ నీల్ చూపించే ప్రతిభపై ప్రేక్షకుల్లో విపరీతమైన నమ్మకం ఉంది. ఆయన సినిమాల్లోని ఇంటెన్స్ యాక్షన్, ఎలివేషన్స్ .. ఎమోషనల్ డెప్త్ ఈ ప్రాజెక్ట్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయని అంచనా వేస్తున్నారు.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్.. అతడి పాత్ర తీరు అత్యంత భీకరంగా ఉండబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. పాన్ వరల్డ్ లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ పవర్-ప్యాక్డ్ యాక్షన్ రోల్స్‌లో ఏ విధంగా చెలరేగుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ తొలిసారిగా కలుస్తుండటంతో.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డులను సృష్టించే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇది నిలవనుందనే అంచనాలున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌కు అదనపు బలంగా నిలుస్తున్న మరో అంశం దీని భారీ స్కేల్ .. ప్రొడక్షన్ వాల్యూస్. మైత్రీ మూవీ మేకర్స్ - ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సెట్స్, రవి బస్రూర్ సంగీతం.. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల భాగస్వామ్యం ఈ సినిమాను ఒక పాన్-ఇండియా విజువల్ వండర్‌గా మలచనున్నాయి.
రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడే స్వయంగా ఈ సినిమా కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పడం..ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచేసింది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్న ఈ `డ్రాగన్` విడుదల కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ అత్యంత ఆతృతగా వేచి చూస్తున్నారు.
