Begin typing your search above and press return to search.

కరోనా కంటే వేగంగా తెలుగు ప్రాంతాలకు పాకింది: రాజ‌మౌళి

కొచ్చిలో జరిగిన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కేరళం` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.

By:  Sivaji Kontham   |   28 Sept 2026 11:33 PM IST
కరోనా కంటే వేగంగా తెలుగు ప్రాంతాలకు పాకింది: రాజ‌మౌళి
X

కొచ్చిలో జరిగిన `డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ కేరళం` ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కొచ్చిలో రాజమౌళికి ఊహించని రీతిలో అపూర్వ స్వాగతం లభించింది. అక్కడ ఆయన క్రేజ్ మామూలుగా లేదని చెప్పవచ్చు. ఈ వేడుకలో ఆయన మలయాళంలో తన ప్రసంగాన్ని ప్రారంభించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ కార్యక్రమంలో టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ పై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. తాను భారతదేశంలోని చాలా మందిలాగే ఫహద్ ఫాజిల్‌కు పెద్ద అభిమానినని తెలిపారు. మొదట్లో ఈ న‌టుడి సినిమాలు కేవలం ఎలైట్ (క్లాస్) ప్రేక్షకులకు మాత్రమే అనుకున్నానని. కానీ కొన్ని సంవత్సరాల క్రితం తన బంధువుల ద్వారా ఆయన సినిమాల రీచ్ ఎంతగా ఉందో తనకు అర్థమైందని పేర్కొన్నారు. ఫహద్ ప్రభావం ఎంత వేగంగా ఉందంటే... అది కరోనా కంటే కూడా వేగంగా తెలుగు ప్రాంతాలకు పాకిందని ఆయన కొనియాడారు.

ఇక ఈ సినిమా కథ పుట్టుక గురించి రాజమౌళి ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసారు. తన క‌జిన్, ఈ చిత్ర దర్శకుడు శశాంక్ తన దగ్గరకు వచ్చి మూడు గంటల సమయం అడగగా.. తాను కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో స్టోరీ చెప్పమని చెప్పానని తెలిపారు. అప్పుడు అతడు ''ఒక వ్యక్తి దెయ్యాన్ని కిడ్నాప్ చేయడం గురించి ఈ సినిమా కథ'' అని చెప్పిన ఒకే ఒక్క లైన్ తనను ఎంతగానో ఆకట్టుకుందని.. ఆ విచిత్రమైన ఐడియా నచ్చి తాను వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు.

ఈ చిత్రంలో సూరి పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ నటనపై రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఆయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను నవ్విస్తారని, ఏడిపిస్తారని, అలాగే భావోద్వేగానికి గురిచేస్తారని తెలిపారు. ఈ సినిమాలో ఫ‌హ‌ద్ నటన అత్యద్భుతంగా ఉంద‌ని వెల్లడించారు.

చివరగా కేరళతో తనకున్న అనుబంధాన్ని..మోహన్ లాల్ చేసిన సహాయాన్ని రాజమౌళి గుర్తుచేసుకున్నారు. కేరళ అంటే తనకు ఎంతో ఇష్టమని తన రెండో సినిమా `సింహాద్రి` షూటింగ్ కూడా కేరళలో జరుపుకున్నట్లు చెప్పారు. అలాగే ఈ సినిమా ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా కోరగా.. ఆ సమయంలో జార్జియాలో షూటింగ్‌లో ఉన్న మోహన్ లాల్.. ఫోన్ సిగ్నల్ లేకపోయినా 45 నిమిషాలు ప్రయాణించి మరీ వాయిస్ ఓవర్ అందించారని తెలిపారు. అప్పట్లో కేరళ సముద్ర తీరంలో వెన్నెల వెలుగులో కూర్చున్న మధుర జ్ఞాపకాలను నెరువేసుకుంటూ.. మోహన్ లాల్‌కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.