కోవిడ్ 19 జ్ఞాపకాలు: చరణ్‌కి రాజమౌళి ఆ సలహా ఇవ్వకపోయి ఉంటే?
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో అలజడి సృష్టించింది. కేవలం సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఆ సమయంలో తీవ్రమైన మానసిక వేదనను, ఒంటరితనాన్ని అనుభవించారు.
By: Sivaji Kontham | 27 May 2026 9:26 PM ISTకోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో అలజడి సృష్టించింది. కేవలం సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు సైతం ఆ సమయంలో తీవ్రమైన మానసిక వేదనను, ఒంటరితనాన్ని అనుభవించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన అప్ కమింగ్ మూవీ `పెద్ది` దర్శకుడు బుచ్చిబాబు సనతో జరిపిన సంభాషణలో లాక్‌డౌన్ నాటి తన చేదు అనుభవాలను.. మానసిక సంఘర్షణను మొదటిసారి బహిర్గతం చేశారు. కోవిడ్ సమయంలో శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ప్రతి ఒక్కరూ దెబ్బతిన్నారు. నేను కూడా దానికి మినహాయింపు కాదు. `ఆర్ఆర్ఆర్` (RRR) సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యాక అకస్మాత్తుగా బ్రేక్ పడింది. శారీరకంగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక్కసారిగా అంతా ఆగిపోవడంతో తీవ్ర గందరగోళానికి గురయ్యాను! అని రామ్ చరణ్ ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో ఎటు చూసినా మరణాలు.. భార్య ఉపాసన ఆసుపత్రి బాధ్యతలతో బిజీగా ఉండటం చరణ్‌ను మరింత ఒంటరితనం వైపు నెట్టాయి. ఒకే ఇంట్లో భౌతికంగా పక్కపక్కనే ఉంటున్నా ఎవరి ప్రపంచాల్లో వారు ఉండిపోవాల్సి వచ్చింది. ఉపాసన ఒక గదిలో ఉంటూ నిరంతరం ఆసుపత్రి కాల్స్ ఎటెండ్ చేస్తూ రోగులను మేనేజ్ చేస్తుంటే.. చరణ్ నెలల తరబడి మరో గదిలోని హోమ్ థియేటర్ లో ఒంటరిగా గడపాల్సి వచ్చింది. ఈ సుదీర్ఘ ఐసోలేషన్ వల్ల ఆలోచనల్లో మార్పులు వచ్చి... మానసికంగా చాలా లో అయిపోయానని చరణ్ అంగీకరించారు. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించాక షూటింగ్ ప్రారంభం కాబోతున్నా.. తనలో ఎలాంటి ఉత్సాహం కానీ.. మోటివేషన్ కానీ రాలేదని.. దాంతో కంగారుపడి దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి ఫోన్ చేసి నేరుగా కలిశానని చరణ్ తెలిపారు.
అంత పెద్ద సినిమా.. దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడితో వర్క్ చేస్తున్నా నాకెందుకు మోటివేషన్ రావడం లేదు సార్? అని చరణ్ అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఇచ్చిన సలహా ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ``పెద్దది ఏదో చేస్తేనే మోటివేట్ అవుతామని అనుకోకూడదు. అలాంటి రూల్ ఏమీ లేదు.. నాకైనా కొన్నిసార్లు జిమ్‌కు వెళ్లాలన్నా... షూటింగ్‌కు రావాలన్నా బద్ధకంగా అనిపిస్తుంది. కాబట్టి పెద్ద లక్ష్యాలను పక్కనపెట్టి.. ఉదయం నిద్ర లేవడానికి పనికొచ్చే ఏదైనా ఒక చిన్న పనితో నీ రోజును ప్రారంభించు! అని జక్కన్న హితబోధ చేశారు. లాక్‌డౌన్‌లో పని లేనప్పుడు తాను జూబ్లీహిల్స్ లోనే అత్యంత శుభ్రమైన గదిగా మార్చాలనే లక్ష్యంతో తన రూమ్ క్లీన్ చేయడం ప్రారంభించానని... ఆ తర్వాత గార్డెన్, హౌస్, ఫామ్‌హౌస్ అంటూ చిన్న చిన్న పనులతోనే తనను తాను బిజీగా ఉంచుకున్నానని తెలిపారు చరణ్. ఆరోజు రాజమౌళి చెప్పిన మాటలు చరణ్‌లో మళ్లీ కొత్త శక్తిని నింపాయి.
రాజమౌళి ఇచ్చిన ఈ `స్టార్ట్ స్మాల్` సలహా వెనుక పక్కా బిహేవియరల్ సైన్స్ (మానసిక శాస్త్రం) దాగి ఉందని సైకాలజిస్టులు విశ్లేషించారు. మనుషులు ఒకే చోట ఉన్నా ఒకరికొకరు కలవకపోతే.. మాట్లాడుకోకపోతే.. మెదడు అంతర్ముఖంగా మారిపోయి ఆలోచనలు బరువెక్కుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. లాక్‌డౌన్ వల్ల రోజువారీ దినచర్య దెబ్బతినడం వల్ల మనుషులు ఎనర్జీని కోల్పోయి ఎమోషనల్‌గా ఫ్లాట్ అయిపోతారు. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద గోల్స్ మనల్ని మరింత ఆందోళనకు గురిచేస్తాయని.. అందుకే చిన్న పనులు మెదడుపై భారం పడకుండా కాపాడతాయని వైద్యులు చెబుతున్నారు. బెడ్ సర్దుకోవడం, చిన్న వాకింగ్‌కు వెళ్లడం, రూమ్ క్లీనింగ్ వంటి చిన్న పనుల వల్ల మనపై మనకు నియంత్రణ పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. పెద్ద లక్ష్యాలు కాదు చిన్న పనుల్నే లక్ష్యంగా పెట్టుకుంటే చాలు.
