తమ్ముడు సంతోషంగా..అన్నయ్య టెన్షన్ లో!
లెజెండరీ కమెడియన్ రాజబాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందించిన సేవల గురించి చెప్పాల్సిన పని లేదు.
By: Srikanth Kontham | 23 Sept 2025 12:00 AM ISTలెజెండరీ కమెడియన్ రాజబాబు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అందించిన సేవల గురించి చెప్పాల్సిన పని లేదు. రెండు దశాబ్దాల ప్రయాణంలో ఎన్నో పాత్రలతో హాస్యానికే వన్నే తీసుకొచ్చిన మహా నటుడు. రాజబాబు సినిమాలో ఉంటే? హీరో ఇమేజ్ తో పని లేకుండా అప్పట్లో చిత్రాలు ఆడేసేవి. రాజబాబు కామెడీ కోసమే సినిమా కెళ్లేవారు. సినిమాలో ఎంత పెద్ద స్టార్ అయినా రాజబాబు తెరపైకి వచ్చారంటే? ప్రేక్షకుల నోట నవ్వులు పువ్వులు పూయాల్సిందే. అతని ముఖంలోనే హాస్యం ఉట్టిపడేది. అలా ఇండియన్ చార్లీ చాప్లిన్ గా రాజబాబు ప్రసిద్ది చెందారు.
తెలుగు సినిమాకు చెరగని సంతకంగా ఖ్యాతికెక్కారు. అంతటి లెజెండరీ నటుడు డబ్బు లేనంత కాలం సంతోషంగా ఉన్నారు. కానీ డబ్బు సంపాదించిన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి తాను కూడా గూర్కాలా మారాడని రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. రాజబాబు జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడ న్నారు. `సర్కార్ ఎక్స్ ప్రెస్ ` సినిమాతో రాజబాబు ఓ రేంజ్ మారిపోయిందన్నారు. `అప్పుడే సొంతంగా ఓ ఇల్లు కొన్నాడు. ఆ తర్వాత బంగ్లా కొన్నాడు. దానిపై కొన్ని గదులు అదనంగా కట్టించాడన్నారు.
`అనంతరం కారు కూడా కొన్నాడు. బంగారు కొనడం మొదలు పెట్టాడు. ఆదాయం పెరగడంతో ఆస్తులు కూడ బెట్టాడు. వాటిని కాపాడుకోవడానికి ఓ కాపాలా కుక్కని తెచ్చాడు. ఇంటికి భద్రతగా ఓ గూర్కాను పెట్టాడు. కానీ అప్పటి నుంచే అన్నయ్య సరిగ్గా నిద్ర పట్టడం మానేసింది. రాత్రి సమయంలో రూమ్ కి వచ్చి నిద్ర పట్టడం లేదురా? అనేవాడు. గూర్కా ఉన్నాడా? లేడా? అని చూడటం కోసం తాను గూర్కాలా మారాడన్నారు.
`దీంతో అతడి ఆందోళన నాకు అర్దమైంది. నాకు ఆస్తులు లేవు. అద్దె ఇంట్లో ఉన్నంతలో సంతోషంగా ఉండేవాడిని. కానీ అన్ని ఉన్నా? అన్నయ్యలో మాత్రం డబ్బు వచ్చిన తర్వాత సంతోషం కనిపించలేదు. అప్పుడప్పుడు డబ్బుతో సుఖం దూరమైందని వాపోయేవాడు. డబ్బుతో అన్ని ఇబ్బందులే అని రాజబాబు వేగంగానే గుర్తించాడన్నారు. మొత్తానికి డబ్బు ఉంటే టెన్షన్ ఉంటుంది? అన్న మాట రాజబాబు విషయంలో కూడా ప్రూవ్ అయిందన్న మాట.
