Begin typing your search above and press return to search.

హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: రాజమౌళికి రాజాసింగ్ హెచ్చరిక

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

By:  M Prashanth   |   21 Nov 2025 12:49 AM IST
హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం: రాజమౌళికి రాజాసింగ్ హెచ్చరిక
X

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజమౌళికి హిందూ దేవుళ్లపై విశ్వాసం లేదని బహిరంగంగా చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. "నీకు హనుమంతుడి పైన విశ్వాసం లేకపోతే, ఆ దేవుళ్ల పేర్లతో సినిమాలు తీసి కోట్లు సంపాదించడం ఎందుకు?" అని రాజాసింగ్ సూటిగా ప్రశ్నించారు.

రాజాసింగ్ మాట్లాడుతూ, రాజమౌళి గతంలో కూడా శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని కించపరిచేలా మాట్లాడారని గుర్తు చేశారు. "బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తుకెళ్లే సీన్ పెట్టి హిట్ కొట్టావు. కానీ బయటకు వచ్చి నాకు దేవుడంటే నమ్మకం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం?" అని నిలదీశారు. హిందూ దేవుళ్లను కేవలం వ్యాపార వస్తువులుగా వాడుకుంటున్నారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన ఆరోపించారు.

రాజమౌళి కొత్త సినిమా 'వారణాసి' గురించి ప్రస్తావిస్తూ, "నీకు దేవుడి మీద నమ్మకం లేనప్పుడు వారణాసి అని టైటిల్ ఎందుకు పెట్టావు? మహేష్ బాబును పెట్టుకుని సినిమా తీస్తున్నావు. ఇది కేవలం ప్రచారం కోసమేనా లేక హిందూత్వాన్ని కించపరచడానికేనా?" అని రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు. హిందువుల నమ్మకాలతో ఆడుకోవడం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

అంతేకాకుండా, రాజమౌళిని సరైన డైరెక్టర్ కాదని సంబోధిస్తూ, ఇలాంటి వారిని హిందువులు ఎందుకు ప్రోత్సహించాలని ప్రశ్నించారు. "రాముడి కథ బోరింగ్ అని ట్వీట్ చేసిన వ్యక్తివి నువ్వు. శ్రీకృష్ణుడికి 16 వేల మంది గోపికలు ఉన్నారని తప్పుగా మాట్లాడిన వ్యక్తివి. నీలాంటి నాస్తికులు హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు" అని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందువులందరూ ఏకమై రాజమౌళి సినిమాలను బహిష్కరించాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. "మన దేవుళ్లను గౌరవించని వారి సినిమాలను మనం చూడకూడదు. అప్పుడే వారికి బుద్ధి వస్తుంది" అని అన్నారు. రాజమౌళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయనపై కేసులు పెట్టాలని హిందువులను కోరారు. జైలుకు వెళ్తే కానీ ఇలాంటి వారికి హిందూ ధర్మం విలువ తెలియదని వ్యాఖ్యానించారు. చివరగా, రాజమౌళి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సంఘాలన్నీ కలిసి ఆయనకు వ్యతిరేకంగా పోరాడతాయని స్పష్టం చేశారు.