ఆ విషయంలో వెనుకంజలో ఉన్న రాజా సాబ్
ఓవైపు పోటీలో ఉన్న సినిమాలు ఇప్పటికే తమ సినిమాల్లోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసుకుని ప్రమోషన్స్ ను మొదలుపెడితే రాజా సాబ్ మాత్రం ఇంకా సాంగ్ రిలీజ్ చేయకుండా
By: Sravani Lakshmi Srungarapu | 9 Nov 2025 6:00 PM ISTసంక్రాంతి పండగ అంటే ఎన్నో సెలవులుంటాయి. ఆ సీజన్ లో సినిమాలు రిలీజ్ చేస్తే మామలూ రోజుల్లో ఒకటి లేదా రెండు టికెట్లు తెగితే సంక్రాంతి సీజన్ లో మాత్రం ఫ్యామిలీ మొత్తం టికెట్లు తెగుతాయి. అందుకే ఎంతోమంది దర్శకనిర్మాతలు, హీరోలు తమ సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంటూ ఉంటారు. దాని కోసం పోటీకి కూడా రెడీ అవుతారు.
2026 సంక్రాంతికి భారీ పోటీ
ఎప్పటిలానే ఈ సంక్రాంతికి కూడా పోటీ భారీగా నెలకొంది. ఈసారి సంక్రాంతి రేసులో ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారు, జన నాయగన్ లాంటి భారీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాస్తవానికి రాజా సాబ్ డిసెంబర్ లో రావాల్సింది కానీ సంక్రాంతికి రిలీజ్ చేస్తే తమ సినిమా ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయడంతో పాటూ మంచి కలెక్షన్లను రాబట్టుకోవచ్చని రిలీజ్ ను సంక్రాంతికి మార్చుకున్నారు మేకర్స్.
చిరూ మూవీ నుంచి మీసాల పిల్ల భారీ హిట్
ఇక చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు అందరి కంటే ముందుగా తమ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. చెప్పినట్టుగానే అనిల్ తన సినిమాను సంక్రాంతికి దింపడానికి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మూవీ నుంచి మీసాల పిల్ల అనే ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేసి దాన్ని భారీ హిట్ ను చేశారు.
ఇంకా మొదలవని రాజా సాబ్ ప్రమోషన్స్
దళపతి విజయ్ హీరోగా వస్తోన్న ఆఖరి సినిమా జననాయగన్ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుండగా, ఇప్పటికే మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. కానీ ప్రభాస్- మారుతి కాంబినేషన్ లో వస్తోన్న రాజా సాబ్ నుంచి మాత్రం మేకర్స్ ఇంకా ఎలాంటి సాంగ్ ను రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేద్దామని రెండు మూడు సార్లు ప్లాన్ చేసినప్పటికీ అది కుదరలేదు.
ఓవైపు పోటీలో ఉన్న సినిమాలు ఇప్పటికే తమ సినిమాల్లోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసుకుని ప్రమోషన్స్ ను మొదలుపెడితే రాజా సాబ్ మాత్రం ఇంకా సాంగ్ రిలీజ్ చేయకుండా, ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయకుండా ఉన్నారు. ఈ విషయంపై ఫ్యాన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ రాజా సాబ్ నుంచి ట్రైలరే వచ్చిందని, సాంగ్స్ కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయని, వాటన్నింటినీ ఓ ప్లాన్ ప్రకారం రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని కొందరంటుంటే, మరికొందరు మాత్రం రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేయకపోవడమేంటని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూసుకున్నా ఇప్పటికైతే సంక్రాంతి రేసులో ఉన్న సినిమాలతో పోలిస్తే రాజా సాబ్ స్పీడు పెంచాల్సిన అవసరం ఉందనిపిస్తుంది.
