రాజా సాబ్ రెడీ.. ఈ రిస్కీ రన్ టైమ్ వర్కవుట్ అవుతుందా?
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజా సాబ్ సెన్సార్ కాపీ నిడివి ఏకంగా 3 గంటల 15 నిమిషాలుగా ఉందట.
By: M Prashanth | 16 Dec 2025 1:26 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాజా సాబ్ సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ వస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది. క్రిస్మస్ లోగా అన్ని భాషల్లోనూ సెన్సార్ పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో హీరో ప్రభాస్ చాలా సంతృప్తిగా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఫైనల్ వెర్షన్ చూసుకున్న తర్వాత ఆయన ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారట. సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఈసారి ప్రమోషన్లలో కూడా ఆయన ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. సాధారణంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే ప్రభాస్, ఈ సినిమా కోసం బయటకు వస్తున్నారంటే సినిమాలో ఏదో స్పెషల్ మ్యాజిక్ ఉండే ఉంటుందని అంతా భావిస్తున్నారు.
అయితే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అసలు విషయం సినిమా రన్ టైమ్. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజా సాబ్ సెన్సార్ కాపీ నిడివి ఏకంగా 3 గంటల 15 నిమిషాలుగా ఉందట. ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఎంత క్రిస్ప్ గా కట్ చేసినా, ఫైనల్ రన్ టైమ్ మాత్రం దాదాపు 3 గంటల వరకు ఉండే అవకాశం కనిపిస్తోందని ఇన్ సైడ్ టాక్. సరిగ్గా ఇక్కడే సినిమాపై ఆసక్తితో పాటు చిన్న సందేహం కూడా మొదలవుతోంది.
సాధారణంగా హారర్ కామెడీ సినిమాలకు రన్ టైమ్ తక్కువగా ఉంటేనే ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. ప్రేక్షకులను చివరి వరకు సీట్లో కూర్చోబెట్టాలంటే కథనం చాలా వేగంగా సాగాలి. అలాంటిది మూడు గంటల నిడివి అంటే అది కచ్చితంగా సాహసమే. కథలో కామెడీ టైమింగ్, హారర్ ఎలిమెంట్స్ ఏమాత్రం తగ్గినా, నిడివి ఎక్కువైందనే భావన ప్రేక్షకులకు కలిగే ప్రమాదం ఉంది. కేవలం భారీ యాక్షన్ డ్రామాలకు మాత్రమే చెల్లుబాటు అయ్యే ఈ రన్ టైమ్, ఒక ఎంటర్టైనర్ కు వర్కవుట్ అవుతుందా అనేది చూడాలి.
గతంలో బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్ లాంటి భారీ యాక్షన్ సినిమాలకు మాత్రమే ఇంత నిడివిని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు. రీసెంట్ గా వచ్చిన దురందర్ అయితే అంతకుమించిన రన్ టైమ్ తో వచ్చింది. ఇప్పుడు రాజా సాబ్ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ కు కూడా అదే స్థాయి రన్ టైమ్ లాక్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. అంటే దర్శకుడు మారుతి రాసుకున్న కథలో అంత విషయం ఉండి ఉండాలి. ఎక్కడా బోర్ కొట్టకుండా, లాగ్ లేకుండా మూడు గంటల పాటు నవ్వించడం, భయపెట్టడం అనేది దర్శకుడికి నిజంగా ఒక పెద్ద సవాలు.
ఏదేమైనా రాజా సాబ్ టీమ్ మాత్రం కంటెంట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తోంది. నిడివి ఎంత ఉన్నా, ఎంగేజింగ్ గా ఉంటే ప్రేక్షకులు టైమ్ మర్చిపోతారు. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, మారుతి మార్క్ కామెడీ వర్కవుట్ అయితే ఈ రన్ టైమ్ పెద్ద సమస్య కాకపోవచ్చు. మరి ఈ 3 గంటల వినోదం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
