Begin typing your search above and press return to search.

రాజాసాబ్ అందుకేనా అంత వ‌ర‌కూ!

`రాజాసాబ్` అస‌లు రంగు ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతుందా? రిలీజ్ విష‌యంలో ఇంత‌కాలం జ‌రిగిందంతా ఓ దోబూచులాటేనా? అంటే అవున‌నే అనాలేమో.

By:  Srikanth Kontham   |   15 Sept 2025 2:00 PM IST
రాజాసాబ్ అందుకేనా అంత వ‌ర‌కూ!
X

`రాజాసాబ్` అస‌లు రంగు ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతుందా? రిలీజ్ విష‌యంలో ఇంత‌కాలం జ‌రిగిందంతా ఓ దోబూచులాటేనా? అంటే అవున‌నే అనాలేమో. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్రతిష్టాత్మ‌కంగా `ది రాజాసాబ్` ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ విష‌యంలో గ‌త ఏడాది జ‌రిగిన ప్ర‌చారం ప‌క్క‌న బెడితే? 2025 లో ఏ రేంజ్ లో ప్ర‌చారం జ‌రిగిందో తెలిసిందే. జ‌న‌వ‌రి నుంచి సినిమా రిలీజ్ అవుతుంది? అనే ప్ర‌చారం మొద‌లైంది. సంక్రాంతి సీజ‌న్ పోయిన త‌ర్వాత మార్చి రిలీజ్ అన్నారు. అక్క‌డ నుంచి ఏప్రిల్ , మే నెల‌లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి.

ఖండించ‌క‌పోవ‌డం ఓ ర‌క‌మైన గేమ్:

ఇదంతా చూసి చిత్రీక‌ర‌ణ పూర్త‌యినా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జాప్యం కారణంగానే రిలీజ్ వాయిదా ప‌డుతుంద‌న్న‌ది జ‌నాల్లోకి వెళ్లిపోయింది. అందుకు త‌గ్గ‌ట్టు యూనిట్ కూడా అంతే తెలివిగా వ్య‌వ‌హ రించింది. సినిమాపై బ‌జ్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా జ‌రిగిన ప్ర‌చారాన్ని అలాగే వ‌దిలేసారు. ఏనాడు రిలీజ్ ప్ర‌చారాన్ని ఖండించ‌లేదు. సినిమా గురించి రాస్తే ఆదో ప్ర‌చారంగా భావించారు. జ‌నాల్లో న‌లుగుతోన్న ప్ర‌చారాన్ని ఖండించి ఆపేయ‌డం ఎందుకు అనుకున్నారో? ఏమో గానీ రిలీజ్ ప్ర‌చారాన్ని ఏనాడు ఖండించ‌లేదు.

అదిగో పులి ఇదిగో తోక అన్న‌ట్లే:

ఆ త‌ర్వాత ఆగ‌స్టు..ద‌స‌రా అంటూ తెర‌పైకి రాగా? ఈసారి మాత్రం డిసెంబ‌ర్ లో రిలీజ్ ప‌క్కా అని అధికా రికంగా ప్ర‌క‌ట‌నిచ్చారు. కానీ కొన్ని రోజుల‌కే డిసెంబ‌ర్ లో క‌ష్ట‌మంటూ తేల్చేసారు. కొత్త‌గా జ‌న‌వ‌రి రిలీజ్ అంటూ మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో మ‌రోసారి షూటింగ్ డిలే కార‌ణ‌మే తెర‌పైకి వ‌స్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ఈనెల 18 నుంచి కేర‌ళ‌లో మొద‌ల‌వుతుంది. అక్క‌డ ప్ర‌భాస్ పై ఓ పాట చిత్రీక‌రించ‌నున్నారు. దీంతో షూటింగ్ పూర్త‌వుతుందనుకుంటున్నారా? అబ్బే అదేం కాదు.

అనంత‌రం గ్రీస్ లో మ‌రో షెడ్యూల్ నిర్వ‌హిస్తారు. ఈ రెండు స‌న్నివేశాల్ని బ‌ట్టి అర్ద‌మైంది ఏంటంటే? సినిమా షూటింగ్ చాలా నెమ్మ‌దిగానే జ‌రుగుతోంద‌ని క్లారిటీ వ‌స్తోంది. అయితే మ‌ధ్య‌లో కార్మికుల స‌మ్మె కార‌ణంగా షూటింగ్ కొన్ని రోజుల పాటు షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేప‌థ్యంలో కొంత జాప్యం జ‌రిగింది. ఆ కార‌ణంగానే జ‌న‌వ‌రి కి రిలీజ్ వాయిదా ప‌డింద‌న్న మాట అంతే బ‌లంగా వినిపిస్తోంది.