ప్రచారంలో తడబడితే ఎలా రాజా సాబ్?
డార్లింగ్ ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటివరకూ ట్రై చేయని కొత్త జానర్ ని ప్రయత్నిస్తున్నాడు. మారుతి మొదటిసారి ఒక అగ్ర కథానాయకుడిని డీల్ చేసాడు.
By: Sivaji Kontham | 4 Nov 2025 11:21 PM ISTడార్లింగ్ ప్రభాస్ తన కెరీర్ లో ఇప్పటివరకూ ట్రై చేయని కొత్త జానర్ ని ప్రయత్నిస్తున్నాడు. మారుతి మొదటిసారి ఒక అగ్ర కథానాయకుడిని డీల్ చేసాడు. పీపుల్స్ మీడియా పతాకంపై నిర్మించిన `రాజా సాబ్` హారర్ జానర్ లో సరికొత్త పంథాలో అలరించనుంది. ఈ చిత్రం ప్రభాస్- మారుతి కెరీర్ కి అత్యంత కీలకం కానుంది. ప్రభాస్ కొన్ని వరుస పాన్ ఇండియా హిట్లతో దూకుడుమీదున్న సమయంలో `రాజా సాబ్` ఎలాంటి ఫలితాన్ని అందించబోతోందో చూడాలన్న ఉత్కంఠ ట్రేడ్ లో ఉంది. ఫ్లాప్ తీసాక కూడా మారుతికి రాజా సాబ్ రూపంలో మంచి అవకాశం లభించింది. అందువల్ల అతడు నిరూపించాల్సి ఉంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో వెనకబాటు అభిమానులను నిరాశపరుస్తోంది. ఉత్తర భారతదేశం సహా ఓవర్సీస్ లో ప్రభాస్ కి గొప్ప ఇమేజ్ ఉంది. కానీ దానిని ఎన్ క్యాష్ చేయాలంటే ప్రమోషన్స్ లో వేగం పెంచాల్సి ఉంది. ఇప్పటివరకూ మారుతి టీమ్ ప్రమోషన్స్ లో వీక్ గా ఉందన్న నిరాశ డార్లింగ్ ఫ్యాన్స్ లో ఉంది. సంక్రాంతి బరిలో సినిమా రిలీజవుతోంది గనుక ఇప్పటి నుంచే రాజా సాబ్ కి భారీ ప్రమోషన్స్ అవసరం.
ఇటు దక్షిణాదితో పాటు, ఉత్తరాదినా ఈ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున విడుదల చేయనున్నారు కాబట్టి, దానికి తగ్గట్టుగా ప్రచారపు ఎత్తుగడలను అనుసరించాల్సి ఉంటుంది. ప్రభాస్ అమెరికా ప్రమోషన్స్ కోసం ఉత్సాహంగా ఉన్నాడు. కానీ ఇతర ఏరియాల్లోను ఈసారి భారీగా ప్రమోషన్స్ కి అతడు అటెండ్ కావాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా ఇంటర్వ్యూలతోను మీడియాకు టచ్ లో ఉండాలి. ఇప్పటికే ప్రమోషనల్ విజువల్స్ జనాల్లోకి వెళ్లాయి. ప్రీరిలీజ్ వేడుకల పేరుతో మరింత ఉత్సాహం పెంచేందుకు అవకాశం ఉంది. డిసెంబర్ లో పాటలు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఓపెనింగులు చాలా అవసరం. అందుకే ఈ సినిమాకి ప్రభాస్, మాళవిక మోహనన్ ప్రచార కార్యక్రమాలతో హుషారు పెంచాల్సి ఉంటుంది. ప్రభాస్ ని ఒక హారర్ సినిమాలో చూడాలని భావించే అభిమానులు ఉన్నారు. యాక్షన్ సినిమాల కంటే భిన్నంగా అతడు హారర్ చిత్రంలో ఎలా కనిపిస్తాడో చూడాలన్న ఉత్సాహం ఉంది.
అయితే ఇటీవల ఉత్తరాదిన హారర్ చిత్రాలు భారీ బ్లాక్ బస్టర్లుగా మారాయి. భూల్ భులయా 2, స్త్రీ 2, ముంజ్య వంటి హారర్ చిత్రాల విజయాల నేపథ్యంలో రాజా సాబ్ కి పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుందని ఆశిస్తున్నారు. అయితే హారర్ జానర్ తో మొహం మొత్తేసిన ప్రజల్ని ప్రభాస్ తన ఛరిష్మాతో థియేటర్ల వైపునకు లాక్కుని రావాల్సి ఉంటుంది. ఉత్తరాది బెల్ట్ సహా ఓవర్సీస్ నుంచి భారీ ఓపెనింగులను సాధిస్తే, కచ్ఛితంగా రాజా సాబ్ లాభాల బాటలో ప్రయాణిస్తుందని అంచనా.
