రాజా సాబ్ ...హిందీ బెల్ట్ సంగతేంటి?
డార్లింగ్ ప్రభాస్ నటించిన `ది రాజా సాబ్` తెలుగు, తమిళం సహా హిందీలోను అత్యంత భారీగా విడుదలకు సిద్ధమవుతోంది.
By: Sivaji Kontham | 30 Dec 2025 10:17 AM ISTడార్లింగ్ ప్రభాస్ నటించిన `ది రాజా సాబ్` తెలుగు, తమిళం సహా హిందీలోను అత్యంత భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా పతాకంపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విజువల్స్ ఇప్పటికే కాకలు పుట్టిస్తున్నాయి. మారుతి లాంటి మిడ్ రేంజ్ దర్శకుడు ఈ స్థాయి భారీ స్కేల్ ఉన్న సినిమాని తెరకెక్కించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు హారర్ థ్రిల్లర్ కథాంశాన్ని అద్భుతమైన హ్యూమర్ , థ్రిల్స్ తో రక్తి కట్టించాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లు గొప్ప హైప్ ని క్రియేట్ చేసాయి. ప్రభాస్ ఈ సినిమాలో మునుపటి కంటే ఛామింగ్ గా కనిపిస్తున్నాడు.
ప్రచారం పరంగా చూస్తే, ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో కావాల్సినంత హైప్ క్రియేటైంది. కానీ హిందీ బెల్ట్ సంగతేంటి? అన్నది ఆసక్తిగా మారింది. ది రాజా సాబ్ ప్రమోషన్స్ అన్నీ లోకల్ గానే.. కానీ ఉత్తరాది ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రభాస్ కానీ, రాజాసాబ్ బృందం కానీ ఏం చేస్తోందో అర్థం కావడం లేదు. ఇందులో సంజయ్ దత్, జరీనా వహబ్ లాంటి సీనియర్ బాలీవుడ్ స్టార్లు నటించారు. వారితో ప్రచార కార్యక్రమాలు కూడా కనిపించడం లేదు. ఈ సినిమా రిలీజ్ కి మరో 10రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ పది రోజుల్లో డార్లింగ్ ప్రభాస్ తన సినిమాకి ఉత్తరాది బెల్ట్ లోను హైప్ క్రియేట్ చేయాల్సి ఉన్నా, ఎందుకని సైలెంట్ గా ఉన్నాడు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
అయితే ప్రభాస్ సినిమా అనగానే ఉత్తరాదిన మాస్ లో పూనకాలు పుట్టుకొస్తాయి. ప్రభాస్ నటించిన చాలా సినిమాలకు దక్షిణాది ఓపెనింగ్స్ కి మించి డబుల్ ట్రిపుల్ వసూళ్లు ఉత్తరాదిన సాధ్యమయ్యాయి. అలాంటి క్రేజ్ ప్రభాస్ కి ఉంది. ముఖ్యంగా ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ చిత్రం `సాహో` ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా, ఉత్తరాదిన భారీ వసూళ్లను సాధించింది. నార్త్ బెల్ట్ లో మాస్ ని ఒక ఊపు ఊపడమే గాక, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుని కూడా ఉత్తరాదిన తొలి మూడు రోజులు చెప్పుకోదగ్గ ఓపెనింగులు తెచ్చింది.
అందుకే ఇప్పుడు ఉత్తరాది ఆడియెన్ అమితంగా ఇష్టపడే జానర్ హారర్ థ్రిల్లర్ సినిమాని ఎందుకు సరిగా ప్రమోట్ చేయడం లేదు? అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నార్త్ లో ముంజ్యా, స్త్రీ, స్త్రీ 2, భూల్ భులయా, భూల్ భులయా 2, భూల్ భులయా 3 ఇవన్నీ పెద్ద విజయాలు సాధించాయి. ది రాజా సాబ్ కంటెంట్ కూడా వాటన్నిటికీ తగ్గని విధంగా కనిపిస్తోంది. వీఎఫ్ఎక్స్ పరంగాను హై క్వాలిటీ విజువల్స్ ని క్రియేట్ చేసారని ట్రైలర్ చెబుతోంది. అందువల్ల ది రాజా సాబ్ నార్త్ బెల్ట్ లోను భారీ వసూళ్లను సాధించేందుకు ఆస్కారం ఉంది. అయితే అక్కడ సరైన ప్రమోషన్స్ అవసరమని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
ఇప్పటికి మిగిలి ఉన్న వారం పాటు ప్రభాస్- సంజయ్ దత్- జరీనా వహబ్ బృందాలు నార్త్ లో కూడా ప్రచారం సాగిస్తే మంచి ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో నటించిన ముగ్గురు గ్లామరస్ భామలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కూడా ప్రచారం సాగిస్తే అది కూడా అదనపు బూస్ట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే దక్షిణాదిన రాజా సాబ్ కి కావాల్సినంత ప్రచారం కుదిరింది. సినిమాకి మంచి హైప్ ఉంది. మారుతి కూడా తన సినిమా బిగ్గెస్ట్ హిట్ సాధిస్తుందన్న ధీమా ఉంది. ఇలాంటి సమయంలో నార్త్ బెల్ట్ లో భారీ ప్రమోషన్స్ తో మంచి ఓపెనింగులను సాధించడానికి దూకుడు పెంచాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
