Begin typing your search above and press return to search.

ది రాజాసాబ్.. ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్?

బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే వందల కోట్ల బిజినెస్ జరగాల్సిందే.

By:  M Prashanth   |   12 Jan 2026 2:06 AM IST
ది రాజాసాబ్.. ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్?
X

బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే వందల కోట్ల బిజినెస్ జరగాల్సిందే. అందుకే నిర్మాతలు కూడా అడిగినంత ఇచ్చేందుకు వెనుకాడరు. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘ది రాజా సాబ్’ విషయంలో కూడా మేకింగ్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఖర్చు చేసినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. హారర్ కామెడీ జోనర్ కావడంతో గ్రాఫిక్స్ సెట్స్ కోసం నిర్మాతలు భారీగానే వెచ్చించారు.

సినిమా బడ్జెట్, నటీనటుల పారితోషికాల గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఒక పాన్ ఇండియా సినిమా రూపొందాలంటే కేవలం హీరో మాత్రమే కాదు, ఇతర నటీనటులు కూడా పేరున్న వారు ఉండాలి. ఈ చిత్రంలో బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ లాంటి స్టార్ ఉండటంతో ఆయనకు కూడా భారీ మొత్తమే చెల్లించినట్లు తెలుస్తోంది. అలాగే ముగ్గురు హీరోయిన్లు ఉండటంతో వారి పారితోషికాల లెక్కలు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక అసలు విషయానికి వస్తే ప్రభాస్ సాధారణంగా ఒక్కో సినిమాకు 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని ప్రచారం ఉంది. కానీ ఈ రాజా సాబ్ కోసం ఆయన కేవలం 100 కోట్లే తీసుకున్నారని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం బడ్జెట్ ఎక్కువగా అవ్వడంతో సినిమా క్వాలిటీ కోసం ప్రభాస్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం మొత్తం బడ్జెట్ దాదాపు 400 నుంచి 450 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

మిగతా వారి పారితోషికాల విషయానికి వస్తే, దర్శకుడు మారుతి 18 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. కీలక పాత్రలో నటించిన సంజయ్ దత్ కి 5 కోట్లు, హీరోయిన్లు నిధి అగర్వాల్ కు 1.5 కోట్లు, రిద్ధి కుమార్ కు 3 కోట్లు, మాళవిక మోహనన్ కు 2 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. ప్రభాస్ తన ఇమేజ్ కి తగ్గట్లుగా కాకుండా సినిమా అవుట్ పుట్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం విశేషం.

బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రెమ్యునరేషన్ లో ఇలాంటి మార్పులు రావడం సహజమే. ఒక భారీ చిత్రాన్ని తక్కువ టైమ్ లో క్వాలిటీగా తీయాలంటే బడ్జెట్ సర్దుబాటు చాలా ముఖ్యం. నిర్మాతలు హీరో మధ్య ఉన్న అవగాహన వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత గ్రాండ్ గా పట్టాలెక్కింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే ఈ ఇన్వెస్ట్ మెంట్ రికవరీ అవ్వడం కష్టమేమీ కాదనిపిస్తోంది. ఇక ప్రభాస్ తన తర్వాతి సినిమాలకు మళ్ళీ తన పాత పారితోషికాన్నే కొనసాగిస్తారా లేక ప్రాజెక్ట్ బట్టి ఇలాగే నిర్ణయాలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.