Begin typing your search above and press return to search.

తెలుగు హీరోల‌కు రాజ్ రాస్తాడా?

ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ పరిధి రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఉత్తరాది మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగానూ తెలుగు హీరోల క్రేజ్ స్కై-హై రేంజ్‌కు చేరుకుంది.

By:  Srikanth Kontham   |   26 Jun 2026 6:56 PM IST
తెలుగు హీరోల‌కు రాజ్ రాస్తాడా?
X

చలనచిత్ర రంగంలో సరికొత్త కథనాలతో, విలక్షణమైన సిరీస్‌లతో తనదైన ముద్ర వేసిన దర్శక రచయిత రాజ్ నిడిమోరు (రాజ్ & డికె ద్వయంలో ఒకరు). తాజాగా టాలీవుడ్ వైపు మునుపెన్నడూ లేనంత సీరియస్‌గా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోల కోసం ఆయన ప్రత్యేకంగా కథలను సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. నేడు తెలుగు సినిమా గ్లోబల్ స్థాయిలో పాన్ ఇండియా మార్కెట్‌ను శాసిస్తుం బ‌డటంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు రాజ్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

గతంలోనూ కొన్ని సినిమాల‌కు రాజ్ నిడిమోరు తెలుగు సినిమాలకు కథలు అందించినప్పటికీ ఈసారి ఆయన వ్యూహం పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని సమాచారం. ఇటీవల భార్య సమంత ప్రధాన పాత్రలో నటించిన `మా ఇంటి బంగారం` చిత్రానికి కథను అందించిన సంగ‌తి తెలిసిందే. అది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో రాజ్ శైలిపై టాలీవుడ్‌లో మరింత నమ్మకం పెరిగింది. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్‌తో ఓటీటీ కంటెంట్‌కే పరిమితం కాకుండా తెలుగులోని అగ్ర హీరోల ఇమేజ్‌కు సరిపోయేలా విభిన్నమైన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన సబ్జెక్టులను సిద్ధం చేస్తున్నట్లు టాక్.

ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ పరిధి రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ఉత్తరాది మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగానూ తెలుగు హీరోల క్రేజ్ స్కై-హై రేంజ్‌కు చేరుకుంది. రాజ్ నిడిమోరుకు బాలీవుడ్‌తో పాటు గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఉన్న పట్టు అక్కడి ప్రేక్షకుల పల్స్ గురించిన అవగాహన అపారం. ఈ నేపథ్యంలో ఆయన రాసే కథలు తెలుగు హీరోల మాస్ ఇమేజ్‌ను మరింత ఎలివేట్ చేస్తూనే బాలీవుడ్ - ఇతర భాషల ప్రేక్షకులను సైతం సులభంగా ఆకట్టుకునేలా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్‌తో ఉండబోతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజ్ నిడిమోరు మాతృభాష తెలుగు కావడం ఇక్కడి సంస్కృతి, ప్రేక్షకుల అభిరుచులపై ఆయనకు మొదటి నుంచీ అవగాహన ఉండటం ఇక్కడ అదనపు అనుకూల అంశం. `ది ఫ్యామిలీ మ్యాన్`, `ఫర్జీ` వంటి సంచలన హిట్స్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తెలుగు సినిమా మేకింగ్ స్టైల్‌ను తన మార్క్ నార్త్ అండ్ గ్లోబల్ ట్రెండ్స్‌తో మిక్స్ చేస్తే వచ్చే అవుట్‌పుట్ క్రేజీగా ఉంటుంది. అందుకే టాలీవుడ్ లోని పలువురు అగ్ర నిర్మాతలు సైతం ఆయనతో క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టేందుకు చర్చలు జరుపుతున్నట్లు వినికిడి.

టాలీవుడ్ పాన్ ఇండియా మార్కెట్‌ను పూర్తి స్థాయిలో ఎన్‌క్యాష్ చేసుకోవాలనే లక్ష్యంతోనే ఈసారి రాజ్ నిడిమోరు సీరియస్‌గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ డ్రామాలు మాత్రమే కాకుండా మైండ్ గేమ్‌లు, డార్క్ కామెడీ, హై-కాన్సెప్ట్ థ్రిల్లర్ జోనర్లలో టాలీవుడ్ స్టార్ హీరోల బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా స్క్రిప్ట్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి కనుక కార్యరూపం దాల్చితే తెలుగు సినిమా విభిన్నమైన జోనర్లలోకి మరింత బలంగా దూసుకువెళ్లే అవకాశం ఉంది.