నా జీవితంలోకి వచ్చిన దేవత.. సామ్ పై రాజ్ స్పెషల్ వర్డ్స్!
సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో అదరగొట్టేసి గట్టి కం బ్యాక్ ఇచ్చిన సమంత అప్పటినుంచి యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలకే మొగ్గు చూపుతోంది.
By: Madhu Reddy | 22 July 2026 12:24 PM ISTఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించి మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న సమంత.. పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటించి తన అద్భుతమైన నటనతో.. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో.. హోమ్లీ క్యారెక్టర్లతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక అదే సమయంలో అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈమె.. పెళ్లైన నాలుగేళ్లకే చైతూ నుంచి విడాకులు తీసుకుని విడిపోయింది. విడాకుల తర్వాత మయోసైటిస్ బారినపడి విదేశాలలో చికిత్స తీసుకున్న ఈమె.. ఇండస్ట్రీకి ఏడాది పాటు బ్రేక్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో అదరగొట్టేసి గట్టి కం బ్యాక్ ఇచ్చిన సమంత అప్పటినుంచి యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలకే మొగ్గు చూపుతోంది. ఒకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూనే.. మరొకవైపు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ ను స్థాపించి, నిర్మాతగా అవతరించింది. శుభం అనే తెలుగు సినిమాను నిర్మించి సక్సెస్ అందుకున్న ఈమె.. మళ్లీ అదే తన బ్యానర్లో మా ఇంటి బంగారం సినిమా చేసి ఏకంగా 100 కోట్ల క్లబ్లో చేరి ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా మరొకవైపు సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో గత కొంతకాలంగా చట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈమె ప్రేమలో పడి ఎట్టకేలకు వివాహం చేసుకుంది. ఇప్పుడు తాను గర్భవతి. ఈ విషయాన్ని మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్స్లో అధికారికంగా ప్రకటించింది.
ఒకవైపు తన సినిమా రూ.100 కోట్ల క్లబ్లో దూసుకుపోతుంటే.. మరొకవైపు తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుండడం ఆమెను మరింత ఉత్సాహంగా మార్చేసింది. ఇలాంటి సమయంలో ఆమె భర్త సమంతపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సమంతతో కలిసి అమ్మవారి ఆశీస్సుల కోసం టెంపుల్ కి వెళ్లిన రాజ్ నిడిమోరు ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోని పంచుకుంటూ.." ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే" అనే ఫ్లూట్ మ్యూజిక్ ని షేర్ చేస్తూ.. "నా జీవితంలోకి వచ్చిన దేవత" అంటూ తన భార్యపై ప్రశంసలు కురిపిస్తూ.. తన ప్రేమను వలకబోశారు. మొత్తానికైతే రాజ్ నిడిమోరు తొలిసారి తన భార్యపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే సమంత ప్రస్తుతం మెటర్నరీ లీవ్ లో ఉంది. కాబట్టి డెలివరీ తర్వాతే ఆమె తన ప్రాజెక్టును ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచారం. కానీ ప్రస్తుతం సోనీ లీవ్ తమిళ్ ఓటీటీతో కలిసి ఒక కొత్త స్పెషల్ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. సమంత ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ తర్వాత మెటర్నటీ బ్రేక్ తీసుకుంటూనే ఈ డిజిటల్ ప్రాజెక్టును ప్రకటించడం గమనార్హం. ఇకపోతే ఇది ఒక సెలబ్రిటీ టాక్ షో అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
