82 కోట్ల గిఫ్ట్ నుంచి 16000 కోట్ల వరకు!
అప్పట్లో ఈ ఫ్రాంచైజీ మొత్తం విలువ 700 కోట్లుగా మాత్రమే ఉండేదని అయితే కాలక్రమేణా ఐపీఎల్ బ్రాండ్ విలువ అద్భుతంగా పెరిగిందని రాజ్ కుంద్రా గుర్తు చేసుకున్నారు.
By: Srikanth Kontham | 23 July 2026 11:50 PM ISTబాలీవుడ్ సూపర్ జోడీ శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు వ్యాపార రంగంలో ఎంత సక్సెస్ అయ్యారో? అదే బిజినెస్ లో అంతే సంచలనంగా మారారు. తాజాగా రాజ్ కుంద్రాకు సంబంధించిన ఓ పాత ఖరీదైన బహుమతి గురించిన విశేషాలు సినీ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తొలినాళ్లలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో వాటాలను కొనుగోలు చేయడం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను రాజ్ కుంద్రా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ వాటాను కేవలం వ్యాపార దృక్పథం లోనే తన భార్యకు ఇచ్చిన `వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా అభివర్ణించడం విశేషం.
2009 సంవత్సరంలో జరిగిన లావాదేవీలో భాగంగా రాజ్ కుంద్రా దాదాపు 81.9 కోట్లు వెచ్చించి రాజస్థాన్ రాయల్స్ జట్టులో 11.7 శాతం వాటాను దక్కించుకున్నారు. ఆ సమయంలో ఐపీఎల్‌లో అతిపెద్ద సింగిల్ చెక్ పెట్టుబడిగా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ మొదటి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచిన వెంటనే శిల్పా శెట్టి బ్రాండ్ వాల్యూను దృష్టిలో ఉంచుకుని తాను ఈ పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. అప్పట్లో ఈ బహుమతి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాలెంటైన్స్ డే గిఫ్ట్‌లలో ఒకటిగా మీడియాలో పెద్ద ఎత్తున హెడ్‌లైన్స్ లో నిలిచింది.
అప్పట్లో ఈ ఫ్రాంచైజీ మొత్తం విలువ 700 కోట్లుగా మాత్రమే ఉండేదని అయితే కాలక్రమేణా ఐపీఎల్ బ్రాండ్ విలువ అద్భుతంగా పెరిగిందని రాజ్ కుంద్రా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం అదే రాజస్థాన్ రాయల్స్ జట్టు విలువ ఏకంగా 16000 కోట్లకు చేరుకుందని పేర్కొన్నారు. ఐపీఎల్ లీగ్ ప్రారంభ దశలో ఫ్రాంచైజీల నిర్వహణ, పెట్టుబడులు , రాబడికి సంబంధించి ఆయన పంచుకున్న ఆర్థిక విషయాలు క్రికెట్ ..వ్యాపార వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ జ్ఞాపకాలతో పాటు ఫ్రాంచైజీ ప్రయాణంలో ఎదురైన వివాదాలను కూడా రాజ్కుంద్రా ప్రస్తావించారు.
2013లో ఐపీఎల్‌ను కుదిపేసిన బెట్టింగ్ వివాదం కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆ తర్వాత తలెత్తిన చట్టపరమైన పరిణామాలను గుర్తు చేసుకున్నారు. ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని ఆనాటి వివాదాలు .. వ్యాపార జీవితంపై చూపిన ప్రభావాన్ని పంచుకున్నారు. కాలం మారుతున్న కొద్దీ ఐపీఎల్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన స్పోర్ట్స్ టోర్నమెంట్‌గా ఎదిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్న పెట్టుబడితో ప్రారంభమైన ప్రాజెక్ట్ నేడు వేల కోట్ల రూపాయల సామ్రాజ్యంగా మారడం వెనుక ఉన్న ఆర్థిక వ్యూహాలను రాజ్ కుంద్రా పూసగుచ్చినట్లు వివరించారు. శిల్పా శెట్టికి ఇచ్చిన ఆనాటి ఆశ్చర్యకరమైన బహుమతి నేడు బిజినెస్ పరంగా ఎంతటి భారీ లాభాలను తెచ్చిపెట్టిందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
చివరిగా ఒకప్పటి రొమాంటిక్ వాలెంటైన్స్ డే గిఫ్ట్ నేడు భారతీయ క్రికెట్ వ్యాపార చరిత్రలో మైలురాయిగా నిలవడం విశేషం. వివాదాలు, సవాళ్లు ఎన్ని ఎదురైనా? ఐపీఎల్ లీగ్ సృష్టించిన ఆర్థిక వృద్ధి అపూర్వమైనదనే చెప్పాలి.
