Begin typing your search above and press return to search.

అవేవీ నా క్యారెక్ట‌ర్ ను డిసైడ్ చేయ‌లేవు

ప్ర‌ముఖ ఆధ్మాత్మిక గురువు ప్రేమానంద్ మ‌హారాజ్ గురించి అంద‌రికీ తెలుసు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆయ‌న చాలా పాపుల‌ర్.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Aug 2025 11:01 AM IST
అవేవీ నా క్యారెక్ట‌ర్ ను డిసైడ్ చేయ‌లేవు
X

ప్ర‌ముఖ ఆధ్మాత్మిక గురువు ప్రేమానంద్ మ‌హారాజ్ గురించి అంద‌రికీ తెలుసు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఆయ‌న చాలా పాపుల‌ర్. అందుకే ఎన్నో రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు రెగ్యుల‌ర్ గా ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్తుంటారు. అలా వెళ్లే వారిలో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు కూడా ఒక‌రు. అయితే స్వామీజీ రెండు కిడ్నీలు చెడిపోవ‌డంతో గ‌త ప‌దేళ్లుగా ఆయ‌న డ‌యాల‌సిస్ చేయించుకుంటూ వ‌స్తున్నారు.

స్వామిజీకి కిడ్నీ ఇస్తాన‌న్న రాజ్ కుంద్రా

తాజాగా శిల్పాశెట్టి, త‌న భర్త రాజ్ కుంద్రాతో క‌లిపి మ‌ధురాలోని ప్రేమానంద్ మ‌హారాజ్ ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించిన త‌ర్వాత స్వామీజీకి రాజ్ కుంద్రా కిడ్నీ దానం చేస్తాన‌ని చెప్ప‌డంతో ఆ వీడియో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. రాజ్ కుంద్రా వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు నెటిజ‌న్లు ట్రోల్స్ చేయ‌గా తాజాగా ఆ విమ‌ర్శ‌ల‌పై రాజ్ కుంద్రా రెస్పాండ్ అయ్యారు.

విమ‌ర్శ‌ల‌కు చెక్ పెడుతూ క్లారిటీ

ఒక‌రి ప్రాణాలు కాపాడటానికి తాను చెప్పిన మాటల్ని జ‌నాలు ఎగ‌తాళి చేస్తున్నారంటే మ‌నం ఎలాంటి వింత ప్రపంచంలో ఉన్నామో అర్థ‌మ‌వుతుంద‌ని, దీన్ని కూడా పీఆర్ స్టంట్ అని ట్రోల్ చేస్తున్నార‌ని, ఒక‌వేళ మీ దృష్టిలో ఇది ఓ ప‌బ్లిసిటీ స్టంట్ అయితే అలానే అనుకోండ‌ని, మాన‌వ‌త్వాన్ని కూడా వ్యూహంగా చెప్తున్నార‌ని, ఈ విష‌యంలో ఎవ‌రెన్ని అన్నా తానేం బాధ‌ప‌డ‌న‌ని, మీరు చేసే వ్యాఖ్య‌లు నా వ్య‌క్తిత్వాన్ని డిసైడ్ చేయ‌లేవ‌ని రాజ్ కుంద్రా అన్నారు.

ఎవ‌రి దృష్టినీ ఆక‌ర్షించ‌డానికి తాను అలా మాట్లాడ‌లేద‌ని, ఎదుటివారి గురించి కుదిరినంత త‌క్కువగా మాట్లాడ‌మ‌ని, ఎక్కువ ప్రేమ‌ను పంచ‌మ‌ని, అప్పుడే మ‌రొక‌రి జీవితాల్లో మీరు వెలుగులు నింప‌గ‌ల‌ర‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే గ‌త కొన్నాళ్లుగా రూ.60 కోట్ల పెట్టుబ‌డి స్కామ్ లో శిల్పా- రాజ్ కుంద్రా దంప‌తులు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో వాటిని క‌వ‌ర్ చేయ‌డానికే రాజ్ కుంద్రా స్వామీజీకి కిడ్నీ ఇస్తాన‌ని అన్నార‌ని విమ‌ర్శ‌లు చేయ‌గా, రాజ్ కుంద్రా ఆ రూమ‌ర్ల‌పై రియాక్ట్ అయి వాటికి చెక్ పెట్టేశారు.