ప్రముఖ నిర్మాత 150 కోట్ల బిట్ కాయిన్ స్కామ్
ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ ఏ) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.
By: Sivaji Kontham | 27 Sept 2025 3:38 PM ISTనీలి చిత్రాల యాప్‌ల వ్యాపారంతో పాటు, కోట్లాది రూపాయల స్కామ్‌లలో ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, నిర్మాత రాజ్ కుంద్రా పేరు హెడ్ లైన్స్ లోకొస్తోంది. ఇటీవల అతడిపై ఈడీ దర్యాప్తు సాగుతోంది. ఈ దర్యాప్తులో అతడి మోసాల కథల్ని ఈడీ బయటపెడుతోంది. తాజాగా బిట్‌కాయిన్ స్కామ్‌లో వ్యాపారవేత్త రాజ్ కుంద్రాపై మనీలాండరింగ్ ఆరోపణ చర్చగా మారింది. ఆయన వద్ద రూ.150.47 కోట్ల విలువైన 285 బిట్‌కాయిన్లు ఉన్నాయని ఈడీ అధికారులు ఆరోపించారు. కుంద్రా ఈ కాయిన్‌లను కొన్న యజమాని అని ఈడీ వాదిస్తుంటే, ఈ లావాదేవీలలో కేవలం మధ్యవర్తిని మాత్రమేనని ఆయన వాదిస్తున్నారు. తాజా సమాచారం మేరకు కుంద్రా వాదనకు విరుద్ధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలు చేసింది.
ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ ఏ) కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసారని జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ప్రముఖ క్రిప్టో స్కామ్ సూత్రధారి, దివంగత అమిత్ భరద్వాజ్ నుండి 285 బిట్‌కాయిన్‌లను రాజ్ కుంద్రా అందుకున్నారని కూడా ఈడీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. కుంద్రా ఉద్దేశపూర్వకంగా బిట్‌కాయిన్ వాలెట్ చిరునామాలు సహా కీలకమైన ఆధారాలను దాచిపెట్టాడని, భరద్వాజ్ నుండి అందుకున్న బిట్‌కాయిన్‌లను అప్పగించకుండా దాచాడని ఈడీ పేర్కొంది.
రాజ్ కుంద్రా నేర కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధుల గురించి బయటపెట్టడం లేదని ఈడీ ఆరోపిస్తోంది. తన భార్య శిల్పాశెట్టితో కలిసి లావాదేవీలు నడిపించాడని కూడా ఈడీ పేర్కొనడం కొసమెరుపు. తాను కళంకితుడు కాదు అని నిరూపించేందుకు అతడు ప్రయత్నించాడని కూడా ఈడీ ఆరోపించింది. దివంగత భరద్వాజ్ కుటుంబానికి చెందిన పలు కంపెనీలపై మహారాష్ట్ర పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఎఫ్.ఐ.ఆర్‌లు దాఖలు చేసిన తర్వాత కుంద్రాపై మనీలాండరింగ్ కేసు నమోదైంది. సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి కుంద్రా ఉద్ధేశపూర్వకంగా తన ఐఫోన్ ని నాశనం చేసాడని కూడా ఈడీ ఆరోపించింది. ఏడేళ్లలో పలు దశల్లో బిట్ కాయిన్లు అందుకున్నా కానీ ఆధారాలను సమర్పించలేదని కూడా పేర్కొంది.
రాజ్ కుంద్రా - శిల్పా శెట్టి మరో రూ.60 కోట్ల మోసం కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. మీడియా సహా పలు రంగాల్లో పెట్టుబడులు పేరుతో ఆర్థిక నేరానికి పాల్పడ్డారని ఆరోపణలు వీరిపై ఉన్నాయి. లోన్-కమ్-ఇన్వెస్ట్‌మెంట్ డీల్‌లో ఒక వ్యాపారవేత్తను రూ.60.4 కోట్లకు మోసం చేశారనే కేసులో ఆర్థిక నేర విభాగం ఈ జంటతో పాటు ఇతరులను విచారిస్తోంది.
