Begin typing your search above and press return to search.

రష్యా వీధుల్లో ఇండియ‌న్ స్టార్ క్రేజ్!

రాజ్ కపూర్ నటించిన `ఆవారా`, `శ్రీ 420` వంటి చిత్రాలలోని పాటలు రష్యాలో ఎంత పాపులర్ అయ్యాయో ? ఆ డ్రైవర్ నిఖిల్ నందాకు వివరించాడు.

By:  Srikanth Kontham   |   11 Jun 2026 12:52 PM IST
రష్యా వీధుల్లో ఇండియ‌న్ స్టార్ క్రేజ్!
X

భారతీయ చలనచిత్ర రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహానటుడు ,షోమ్యాన్ రాజ్ కపూర్. ముఖ్యంగా రష్యా దేశంలో ఆయనకున్న ప్రజాదరణ, క్రేజ్ అంతా ఇంతా కాదు. దశాబ్దాలు గడిచినా రష్యా ప్రజల హృదయాల్లో ఆయన స్థానం ఏమాత్రం తగ్గలేదని నిరూపించే అద్భుతమైన సంఘటనను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇటీవల తన బ్లాగ్ ద్వారా మ‌రోసారి గుర్తు చేసారు. రాజ్ కపూర్ మనవడు , అమితాబ్ బచ్చన్ అల్లుడు అయిన ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ నందాకు రష్యా పర్యటనలో ఎదురైన ఓ హృదయపూర్వక అనుభవాన్ని ఆయ‌న‌ పంచుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నిఖిల్ నందా వ్యాపార పనిమీద రష్యా రాజధాని మాస్కోకు వెళ్లారు.

అక్కడ ఒక రోజు రాత్రి ఆయన ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి తీవ్రమైన మంచు తుఫాను మొదలైంది. రష్యన్ శీతాకాలపు చలి, దానికి తోడు భారీగా కురుస్తున్న మంచు వల్ల రోడ్లన్నీ నిర్జనంగా మారిపోయాయి. ఆ గడ్డకట్టే చలిలో ముందుకు వెళ్లడం కష్టంగా మారిన తరుణంలో నిఖిల్ నందా ఎట్టకేలకు లోకల్ క్యాబ్‌ను పట్టుకోగలిగారు. ఆ క్లిష్ట పరిస్థితిలో క్యాబ్ దొరకడం ఆయనకు పెద్ద ఊరటనిచ్చింది. ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఆ రష్యన్ క్యాబ్ డ్రైవర్ నిఖిల్ నందాతో మాటలు కలిపారు. మాటల మధ్యలో నిఖిల్ భారతదేశానికి చెందిన వ్యక్తి అని తెలుసుకున్న ఆ డ్రైవర్ ముఖంలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. ఆ డ్రైవర్ తనకు భారతీయ సినిమాలు, ముఖ్యంగా రాజ్ కపూర్ అంటే ఎంత ఇష్టమో ఎంతో ఉత్సాహంగా చెప్పడం ప్రారంభించాడు.

రాజ్ కపూర్ నటించిన `ఆవారా`, `శ్రీ 420` వంటి చిత్రాలలోని పాటలు రష్యాలో ఎంత పాపులర్ అయ్యాయో ? ఆ డ్రైవర్ నిఖిల్ నందాకు వివరించాడు. తన తాతగారి గురించి ఒక విదేశీయుడు అంత గొప్పగా చెబుతుంటే నిఖిల్ ఎంతో గర్వంగా భావించారు.సరిగ్గా అదే సమయంలో నిఖిల్ నందా ఆ డ్రైవర్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తను మరెవరో కాదు. ఆ క్యాబ్ డ్రైవర్ ఎంతో అభిమానించే రాజ్ కపూర్ స్వయానా తన తాతగారే (రాజ్ కపూర్ కుమార్తె రీతూ నందా కుమారుడు నిఖిల్) అని చెప్పారు. ఆ మాట వినగానే ఆ రష్యన్ డ్రైవర్ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. తన కళ్లముందే ఉన్న వ్యక్తి అంతటి మహానటుడి మనవడు అనే విషయాన్ని నమ్మడానికి అతనికి కొంచెం సమయం పట్టింది. ఆ క్షణం నుండి ఆ డ్రైవర్ నిఖిల్‌ను ఒక ప్రయాణికుడిలా కాకుండా తమ దేశానికి వచ్చిన ఒక ప్రత్యేక అతిథిలా చూడటం ప్రారంభించాడు.

గమ్యస్థానం చేరుకున్న తర్వాత నిఖిల్ నందా క్యాబ్ ఛార్జీ కోసం తన పర్సు తీసి డబ్బులు ఇవ్వబోయారు. అయితే ఆ డ్రైవర్ ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించాడు. మంచు తుఫానులో అంత కష్టపడి డ్రైవ్ చేసినందుకు డబ్బులు తీసుకోవాలని నిఖిల్ ఎంత పట్టుబట్టినా? అతను ఒప్పుకోలేదు. `మీరు నా ఆరాధ్య నటుడు రాజ్ కపూర్ మనవడు. నా అభిమాన నటుడి కుటుంబ సభ్యుడిని నా కారులో కూర్చోబెట్టుకుని ప్రయాణించే భాగ్యం దక్కడం నాకు లభించిన అతిపెద్ద బహుమతి. మీ దగ్గర నేను డబ్బులు తీసుకోలేను` అని ఆ డ్రైవర్ ఎంతో భావోద్వేగంతో సమాధానమిచ్చాడు.

ఈ ఉదంతాన్ని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో రాస్తూ కళలకు, కళాకారులకు దేశ సరిహద్దులు ఉండవని చెప్పడానికి ఇదే నిదర్శనమని కొనియాడారు. రాజ్ కపూర్ వంటి గొప్ప నటులు విదేశాలలో సృష్టించిన సాంస్కృతిక బంధం తరాలు మారినా ఎంత బలంగా ఉందో? ఈ ఘటన నిరూపిస్తోందన్నారు. ఒక రష్యన్ డ్రైవర్ చూపించిన ఆ నిస్వార్థమైన ప్రేమ, గౌరవం నిఖిల్ నందా జీవితంలో మరువలేని జ్ఞాపకంగా నిలిచిపోయాయని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు.