రాహుల్ ప్లాన్... వెబ్ సిరీస్ మాదిరి మ్యూజిక్ సిరీస్!
ఇప్పుడు మరోసారి ప్రైవేట్ సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేయడానికి రాహుల్ రెడీ అవుతున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. ఈసారి ఒక ప్రయోగంతో రాహుల్ రాబోతున్నాడట.
By: Ramesh Palla | 24 Sept 2026 4:13 PM ISTయూట్యూబర్ స్థాయి నుంచి ఆస్కార్ అవార్డ్ వేదిక వరకు వెళ్లిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్. తనదైన శైలి కారణంగా చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడుతూ స్టార్ ప్లే బ్యాక్ సింగర్‌గా నిలిచిన విషయం తెల్సిందే. రాహుల్ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా మ్యూజిక్ ఆల్బంలతోనూ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఆయన నుంచి వచ్చే ప్రతి మ్యూజిక్ ఆల్బం సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా ఆయన క్రేజ్‌ను మరింతగా పెంచుతూ వస్తున్నాయి. తెలంగాణ యాసలో ఆయన పాడితే ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే. అందుకే ఆయన పాటలకు ఎప్పటికప్పుడు మంచి స్పందన వస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి ప్రైవేట్ సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేయడానికి రాహుల్ రెడీ అవుతున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. ఈసారి ఒక ప్రయోగంతో రాహుల్ రాబోతున్నాడట.
సింగర్ రాహుల్ సిప్లిగంజ్...
ఇటీవల రాహుల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మ్యూజిక్ ఆల్బమ్స్ ను ఇంతగా ఆధరిస్తున్న ప్రేక్షకుల కోసం ఇంకా ప్రత్యేకంగా ఏమైనా తీసుకు రావాలనే ఉద్దేశంతో మ్యూజిక్ సిరీస్‌ను తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఒక మ్యూజిక్ ఆల్బమ్‌లో కథను చూపించడం జరుగుతుంది. అలాగే మ్యూజిక్ సిరీస్‌లో నాలుగు లేదా అయిదు పాటలు పెట్టి, అందులో కథను కంటిన్యూ చేస్తారన్న మాట. తెలుగులో ఇలాంటి ప్రయోగం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇతర భాషల్లో ముఖ్యంగా విదేశాల్లో ఇలాంటి మ్యూజిక్ సిరీస్‌లు ఉన్నాయి. అందుకే రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు కొత్తగా ఈ మ్యూజిక్ సిరీస్‌ను తీసుకు వచ్చే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. కేవలం సినిమాల్లో పాటలు పాడటంపైనే దృష్టి పెట్టకుండా ఇలా మ్యూజిక్ లవర్స్ కోసం సిరీస్ ను ప్లాన్ చేయడం ఆయనకే చెల్లింది.
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో...
ఒకవైపు వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ ఉన్న ఈ యువ గాయకుడు మ్యూజిక్ సిరీస్ కోసం రెడీ అవుతున్నాడట. ఐదు పాటలతో మ్యూజిక్ సిరీస్‌ను రెడీ చేస్తున్నాడు. ఈ సిరీస్ రాహుల్ ఆధ్వర్యంలో రూపొందబోతుంది. కేవలం ఆ సిరీస్‌కి గాత్రం మాత్రమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను సైతం రాహుల్ స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. గతంలో రాహుల్ పాడటంతో పాటు, మ్యూజిక్ ఆల్బమ్స్ కి దర్శకత్వం చేశాడు. అందుకే ఈ మ్యూజిక్ ఆల్బమ్ కి సైతం ఆయన కచ్చితంగా దర్శకత్వం వహించి సక్సెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయిదు పాటల కోసం డాన్సర్స్, ఇంకా ఇతర ఎంపిక చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త ప్రయోగాలను సక్సెస్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈసారి కూడా రాహుల్ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని ఆయన అభిమానులు నమ్ముతున్నారు.
రాహుల్ మ్యూజిక్ సిరీస్‌తో ఎంట్రీ...
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ స్టేజ్ ఎక్కిన రాహుల్ సిప్లిగంజ్‌కి కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. అందుకే ఈ ఫార్మట్ ఇక్కడ హిట్ కొడితే కచ్చితంగా ఇతర భాషల్లోనూ మ్యూజిక్ సిరీస్‌ను రాహుల్ ప్లాన్ చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు. సినిమాల్లో తన గాత్రంతో సక్సెస్‌లను దక్కించుకునే సింగర్స్ సాధారణంగా ఇలా ప్రైవేట్ సాంగ్స్ పాడేందుకు ఆసక్తి చూపించరు. కానీ రాహుల్ తనకు గుర్తింపు తెచ్చి పెట్టిన గల్లీ పాటలను, ప్రైవేట్ పాటలను వదిలి పెట్టేది లేదు అని మ్యూజిక్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. వెబ్ సిరీస్ మాదిరిగా మ్యూజిక్ సిరీస్ ఉండబోతుంది. వరుసగా వచ్చే అయిదు పాటలతో ఒక మంచి కథను ప్రేక్షకులకు చెప్పనున్నారు. కనుక వెబ్ సిరీస్‌ల మాదిరిగానే మ్యూజిక్ సిరీస్ కూడా విజయం సాధిస్తుందేమో చూడాలి.
