నూతన ఆరంభం.. కాబోయే భార్యతో నిశ్చితార్థ ఫోటోలు షేర్ చేసిన రాహుల్!
రాహుల్ సిప్లిగంజ్.. గల్లీ టు ఆస్కార్ లెవెల్ వరకు ఎదిగిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అంటే ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు.
By: Madhu Reddy | 19 Aug 2025 2:59 PM ISTరాహుల్ సిప్లిగంజ్.. గల్లీ టు ఆస్కార్ లెవెల్ వరకు ఎదిగిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అంటే ఒకప్పుడు ఎవరికి తెలిసేది కాదు. ఏదో చిన్న చిన్న ప్రైవేట్ పాటలు.. జానపద పాటలు పాడుకుంటూ ఇండస్ట్రీలో పేరు సంపాదించారు. అయితే అలాంటి రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం ఆస్కార్ లెవెల్ కి వెళ్ళిపోయారు. ఆయన పాడిన "నాటు నాటు" పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. అలాంటి రాహుల్ తాజాగా తన ప్రేయసి హరిణ్యా రెడ్డిని ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో మరోసారి నెట్టింట్లో ట్రెండింగ్ లో నిలిచారు.
కొత్త ఆరంభం అంటూ ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసిన రాహుల్..
తనకు ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని స్వయంగా ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ.. కాబోయే భార్యతో జరుపుకున్న నిశ్చితార్థ ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలతో పాటూ "కొత్త ఆరంభం" అంటూ క్యాప్షన్ కూడా జోడించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన అభిమానులు, నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
రాజకీయ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబానికి అల్లుడుగా..
తన ప్రియురాలు హరిణ్యా రెడ్డితో హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు రావడంతో చాలామంది రాహుల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి ? అంటూ తెగ సెర్చ్ చేశారు. చివరికి హరిణ్యా రెడ్డి టీడీపీ నేత నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్న కూతురని సమాచారం.అలా రాజకీయ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబంలోకి రాహుల్ అల్లుడుగా వెళ్లబోతున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ కెరియర్..
రాహుల్ సిప్లిగంజ్ విషయానికి వస్తే.. ప్రైవేట్ పాటలు పాడి తన కెరీర్ ని మొదలుపెట్టారు. అలా గల్లీ కా గణేష్, ఓ మంగమ్మా, మాకికిరికిరి, మగ జాతి, పూర్ బాయ్, జై భజరంగ్ వంటి ఎన్నో పాటలను స్వయంగా పాడి అందులో కనిపించాడు. ఫైనల్ గా 2009లో నాగచైతన్య హీరోగా చేసిన 'జోష్' మూవీతో టాలీవుడ్లోకి సింగర్ గా అడుగు పెట్టారు. ఈ మూవీలో "కాలేజ్ బుల్లోడా" అనే పాట పాడారు. ఆ తర్వాత చాలామంది హీరోల సినిమాల్లో పాడారు. అలా రంగస్థలం, దమ్ము, రచ్చ, ప్రేమ కథా చిత్రమ్, కెమరామెన్ గంగతో రాంబాబు, ఇస్మార్ట్ శంకర్,దసరా, ఆర్ఆర్ఆర్ ఇలా ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో కాల భైరవతో కలిసి పాడిన "నాటు నాటు" పాట చాలా ఫేమస్ అయింది.
గల్లీ నుండి ఆస్కార్ వరకు..
ఈ పాట రచించిన రచయిత చంద్రబోస్ కి,మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణికి ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచ వ్యాప్తంగా రాహుల్ సిప్లిగంజ్ పేరు మార్మోగిపోయింది. అంతే కాదు రీసెంట్ గా గద్దర్ అవార్డ్స్ ఇచ్చిన టైంలో రేవంత్ రెడ్డి కూడా మెచ్చుకున్నారు. అలా గల్లి నుండి ఆస్కార్ వరకు ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తాజాగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.
