దేవరకొండకు.. ఇది 'కాంతార' లాంటి కిక్కిస్తుందా?
"విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు!".. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ 'డ్యూడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అన్న ఈ ఒక్క మాట, ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.
By: M Prashanth | 16 Oct 2025 12:34 PM IST"విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు!".. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ 'డ్యూడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అన్న ఈ ఒక్క మాట, ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం సినిమాపై హైప్ పెంచడానికి వాడిన పదంలా కాకుండా, దాని వెనుక ఒక లోతైన అర్థం ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. ముఖ్యంగా, విజయ్ దేవరకొండ కెరీర్ గ్రాఫ్‌ను, రాహుల్ సంకృత్యన్ గత చిత్రాల స్టైల్ మేకింగ్ ని గమనిస్తున్న వారికి, ఈ 'విశ్వరూపం' అనే మాటలో ఒక 'కాంతార' లాంటి ప్రాజెక్ట్ దాగి ఉందేమో అనే ఆసక్తి మొదలైంది.
రాహుల్ సంకృత్యన్ ఒక విలక్షణమైన దర్శకుడు. అతని మొదటి చిత్రం 'ట్యాక్సీవాలా'లో 'ఆత్మ' అనే శక్తిని, రెండో చిత్రం 'శ్యామ్ సింగ రాయ్'లో 'పూర్వజన్మ' అనే ఆధ్యాత్మిక కాన్సెప్ట్‌ను కథలో కీలక అంశాలుగా మార్చారు. ఇప్పుడు మూడో సినిమాకు ఏకంగా 'విశ్వరూపం' అనే పదం వాడారంటే, ఈసారి కేవలం ఆత్మలనో, పునర్జన్మలనో కాకుండా, అంతకు మించిన ఒక దైవిక శక్తిని కథలో చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌కు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.
విజయ్ దేవరకొండకు మాస్, క్లాస్ ప్రేక్షకుల్లో స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది. కానీ, గత కొంతకాలంగా ఆయన చేసిన కమర్షియల్ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఒక నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుని, తనలోని అసలైన నటనను బయటకు తీయాలనే ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్ కోసం విజయ్ ఎదురుచూస్తున్నాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఈ పీరియాడికల్ డ్రామా అతని కెరీర్‌ను మలుపు తిప్పే ఆయుధంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సినిమా కథ 1854ల మధ్య కాలంలో రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఒక నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో చారిత్రక అంశాలతో పాటు, దైవత్వం అనే కీలకమైన పాయింట్ కూడా ఉంటుందని టాక్. ఇక్కడే ఈ సినిమాకు 'కాంతార'తో పోలిక వస్తోంది. 'కాంతార' చిత్రం రిషబ్ శెట్టిని ఒక నటుడిగా మరో స్థాయిలో నిలబెట్టింది. అందులోని దైవత్వం, స్థానిక సంస్కృతి, క్లైమాక్స్‌లో రిషబ్ నటన దేశవ్యాప్తంగా ప్రేక్షకులను కట్టిపడేశాయి.
'కాంతార' ఫ్రీక్వెల్ 'చాప్టర్ 1' ఏకంగా 700 కోట్లను టచ్ చేసి సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు రాహుల్ సంకృత్యన్ కూడా అలాంటి ఒక రా, రస్టిక్, దైవిక అంశాలతో కూడిన కథను విజయ్‌తో చేస్తున్నాడని టాక్. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే విజయ్ 'విశ్వరూపం'కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా. అలాగే విజయ్ దేవరకొండకు నటుడిగా గుర్తింపును తెచ్చిపెడుతుంది. 'కాంతార' రిషబ్ శెట్టికి ఎలాగైతే ఒక మరపురాని కిక్ ఇచ్చిందో, ఈ సినిమా కూడా విజయ్‌కు అలాంటి ఒక కిక్ ఇస్తుందో లేదో చూడాలి.
