కాలేజీలో సినీ ఈవెంట్లు.. 'రాహుల్' ఒపీనియన్ తప్పా? రైటా?
సినిమా ప్రమోషన్ల కోసం కాలేజీలకు వెళ్లడం ఇప్పుడు టాలీవుడ్ లో కామన్ గా మారిపోయింది.
By: M Prashanth | 20 Oct 2026 7:00 PM ISTసినిమా ప్రమోషన్ల కోసం కాలేజీలకు వెళ్లడం ఇప్పుడు టాలీవుడ్ లో కామన్ గా మారిపోయింది. కొత్త సినిమా విడుదలవుతుందంటే చాలు.. హీరోలు, హీరోయిన్లు కాలేజీ ఈవెంట్లలో సందడి చేస్తున్నారు. స్టూడెంట్స్ తో కలిసి డ్యాన్స్‌లు, సెల్ఫీలు, కేరింతలతో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఆ హడావుడి మూవీ సక్సెస్ కు ఉపయోగపడుతోందా.. స్టూడెంట్స్ చప్పట్లు కొడితే అందరూ టికెట్లు కొంటారా.. ఇదే విషయంపై నటుడు రాహుల్ రామకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు డిబేట్ స్టార్ట్ చేశాయి.
ఆయన కామెంట్స్ లో వ్యంగ్యం ఉన్నప్పటికీ.. వాటి వెనుక ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. కాలేజీ ఈవెంట్ల విషయానికొస్తే.. మూవీ టీమ్స్ స్టూడెంట్స్ మధ్యకు వెళ్లడం తప్పు కాదు. హీరోలు తమ సినిమా గురించి చెప్పడం, యువతతో మాట్లాడటం, పాటలకు డ్యాన్స్ చేయడంలోనూ తప్పు లేదు. అయితే అక్కడ కనిపించే సందడి అంతా సినిమా టికెట్ల అమ్మకాలుగా మారుతుందా అనేది మాత్రం చెప్పలేం. అందుకే కాలేజీ ఈవెంట్లను మాత్రమే నమ్ముకుని సినిమా విజయం సాధిస్తుందని భావించడం సరైన పద్ధతి కాదు.
ఇదే విషయాన్ని రాహుల్ రామకృష్ణ ప్రస్తావించారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు, అభిమానుల మధ్య గొడవలు, ఎక్కువగా కనిపించే ప్రమోషన్స్ మాత్రమే విజయాన్ని నిర్ణయించలేవని ఆయన అభిప్రాయం. ఆన్లైన్ లో ఒక సినిమాపై ఎంత చర్చ జరిగినా.. చివరకు ప్రేక్షకులు టికెట్లు కొని థియేటర్లకు రావడం ముఖ్యమని ఆయన కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే ప్రమోషన్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. కానీ సినిమా చూడాలా వద్దా అనేది నిర్ణయించుకునే సమయంలో కంటెంట్ దే డెసిషన్.
సినిమా విడుదలైన రోజున థియేటర్ల దగ్గర సందడి లేకపోయినా.. నిర్మాణ సంస్థ కార్యాలయం దగ్గర టపాసులు కాల్చి విజయోత్సవాలు చేసుకోవడాన్ని కూడా రాహుల్ ఎద్దేవా చేశారు. బయట కనిపించే హడావుడికి, ప్రేక్షకుల స్పందనకు మధ్య తేడా ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అయితే సినిమా రిజల్ట్ ఒక్క రోజులోనే నిర్ణయించలేం. ఫస్ట్ డే వసూళ్లతో పాటు తర్వాత రోజుల్లో ప్రేక్షకుల రెస్పాన్స్, సినిమా ఎంతకాలం థియేటర్లలో ఉందనే విషయాలు కూడా మెయినే.
మరోవైపు, సినిమాల్లో డ్రోన్ షాట్లను ఎక్కువగా వాడటంపై ఆయన స్పందించారు. ఒక ఊరు, నగరం లేదా అడవిని పైనుంచి చూపించినంత మాత్రాన సినిమా ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసినట్లు కాదని అన్నారు. కేవలం అందమైన దృశ్యాలు, భారీ ఖర్చులు మాత్రమే సినిమాకు ప్రత్యేకతను తీసుకురావు. ఇక కాలేజీ ఈవెంట్లు చేయకూడదని, సోషల్ మీడియాలో ప్రచారం అవసరం లేదని రాహుల్ చెప్పినట్లు భావించాల్సిన అవసరం లేదు. ఆయన కామెంట్లలో మెయిన్ గా కనిపిస్తుంది ప్రమోషన్స్ కు, విజయానికి మధ్య ఉన్న తేడా.
ప్రమోషన్స్ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే. వారిని సినిమా చివరి వరకు కూర్చోబెట్టేది మాత్రం కంటెంట్. అందుకే కాలేజీ ఈవెంట్లు నిర్వహించాలా వద్దా అనే దానికంటే.. వాటి ద్వారా ఎంతమంది ప్రేక్షకులకు సినిమా చేరిందనేది ముఖ్యం. ఆ విషయంలో రాహుల్ అభిప్రాయాన్ని తప్పని కొట్టిపారేయలేం. అదే సమయంలో ప్రమోషన్స్ విషయంలో ఒప్పుగా చూడలేం. రెండింటి మధ్య బ్యాలెన్స్ పాటిస్తూ, మంచి సినిమాను తీసుకురావడమే మేకర్స్ ముందున్న అసలైన సవాల్.
