వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!
సినీ రంగంలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే గాక క్రీడా మైదానంలోనూ దేశం గర్వించదగ్గ రీతిలో రాణించిన నటుడు రాహుల్ బోస్ జీవిత విశేషాలను పుస్తక రూపంలోకి తీసుకురానున్నారు.
By: Srikanth Kontham | 2 Nov 2026 3:30 PM ISTసినీ రంగంలో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరించడమే గాక క్రీడా మైదానంలోనూ దేశం గర్వించదగ్గ రీతిలో రాణించిన నటుడు రాహుల్ బోస్ జీవిత విశేషాలను పుస్తక రూపంలోకి తీసుకురానున్నారు. మూడు దశాబ్దాలకు పైగా సినిమా ప్రయాణం.. అంతర్జాతీయ వేదికలపై రగ్బీ ఆటగాడిగా దేశానికి ప్రాతినిధ్యం వహించిన అరుదైన అనుభవాలను ఆటోబయోగ్రఫీలో పొందుపరచనున్నారు. వచ్చే సంవత్సరం ఈ పుస్తకం పాఠకుల ముందుకు రానుండటంతో ఆసక్తి నెలకొంది.
పుస్తకానికి సంబంధించిన విశేషాలను రాహుల్ బోస్ వెల్లడించారు. జీవితంలో ప్రతీ ఉన్నత శిఖరాన్ని, ఎదురైన ఒడిదుడుకులను ఈ పుస్తకం ద్వారా పంచుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని, ఇప్పటికే రెండు ప్రముఖ పబ్లిషింగ్ హౌస్‌లతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాదే ఈ పుస్తకం అధికారికంగా విడుదల కానుంది.
1980వ దశకంలో రగ్బీ యూనియన్.. బాక్సింగ్ , క్రికెట్ వంటి క్రీడలతో క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించిన రాహుల్ బోస్.. కాలక్రమేణా భారత జాతీయ రగ్బీ యూనియన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ప్రస్తుతం ఆయన రగ్బీ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ క్రీడాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. ఒకవైపు క్రీడారంగంలో అంకితభావం... మరోవైపు `చమేలీ`, `ఝంకార బీట్స్` వంటి విభిన్న చిత్రాలతో నటుడిగా సాగించిన ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకం.
తాజాగా `ఉడ్తా తీర్` చిత్రంలో కనిపించి మరోసారి తన నైపుణ్యాన్ని చాటుకున్నారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా మార్చురీ సన్నివేశంలో ఊహించని విధంగా జరిగిన కొన్ని పరిణామాలు మేకింగ్‌లో అసలైన అందాన్ని తెలియజేస్తాయని అభిప్రాయపడ్డారు. ప్లాన్ చేయని కొన్ని క్షణాలు సెట్లో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయని అనుభవపూర్వకంగా తెలిపారు.
ఇలా ఒక నటుడిగానే కాకుండా ఇంటర్నేషనల్ రగ్బీ ప్లేయర్‌గా, నాయకుడిగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఈ పుస్తకంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సాధారణ విజయాలకే పరిమితం కాకుండా తెర వెనుక ఎదుర్కొన్న కష్టాలు, సంతోషాలను సూక్ష్మ వివరాలతో పుస్తకంలో రాయనున్నట్లు స్పష్టం చేశారు. జీవితం అంటే ఒక్క రంగానికి పరిమితం కాదని నిరూపించిన రాహుల్ బోస్ జ్ఞాపకాల పుస్తకం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
