Begin typing your search above and press return to search.

రెహమాన్ మ్యూజిక్‌ పై రివ్యూ.. మేకర్స్ ది తప్పా? రైటా?

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణం కోసం ఇద్దరు ప్రపంచ స్థాయి సంగీత దిగ్గజాలు కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   6 May 2026 11:28 AM IST
రెహమాన్ మ్యూజిక్‌ పై రివ్యూ.. మేకర్స్ ది తప్పా? రైటా?
X

భారతీయ సినీ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పేరు వినగానే ప్రత్యేకమైన మ్యూజికల్ మ్యాజిక్ గుర్తుకు వస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీతగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆయన, ప్రతి ప్రాజెక్ట్‌ లో కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మ్యూజిక్‌ పైనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణం కోసం ఇద్దరు ప్రపంచ స్థాయి సంగీత దిగ్గజాలు కలిసి పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు రెహమాన్, మరోవైపు హాలీవుడ్ స్టార్ కంపోజర్ హ్యాన్స్ జిమ్మర్ కలిసి పనిచేయడం అంటే మ్యూజిక్ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ కచ్చితంగా భారీ రేంజ్ లో ఉంటాయి.

దర్శకుడు నితేష్ తివారీ రూపొందిస్తున్న ఆ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే అందులో జిమ్మర్ స్టైల్‌ కు ఎక్కువ ప్రాధాన్యం కనిపించిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, మేకర్స్ రెహమాన్ చేసిన మ్యూజిక్‌ ను మళ్లీ సమీక్షిస్తున్నారని టాక్.

టీజర్‌ కు వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి, జిమ్మర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. అందుకే రెహమాన్ కంపోజ్ చేసిన కొన్ని భాగాలను మాత్రమే ఫైనల్ వెర్షన్‌ లో ఉంచే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. అయితే ఆ వార్తల్లో నిజమెంత అనేది అధికారికంగా ఇంకా స్పష్టత లేదు. కానీ ఇలాంటి పరిస్థితిలో మేకర్స్ నిర్ణయం సరైనదా కాదా అనే చర్చ హాట్ టాపిక్‌ గా మారింది.

కొందరు మ్యూజిక్ లవర్స్.. రెహమాన్ లాంటి లెజెండ్ మ్యూజిక్‌ ను ఇలా పక్కన పెట్టడం సరికాదని భావిస్తున్నారు. ఆయన టాలెంట్ ను పూర్తిగా వినియోగించుకోవాలని అంటున్నారు. మరోవైపు, సినిమా రేంజ్ దృష్ట్యా బెస్ట్ అవుట్‌ పుట్ కోసం మేకర్స్ తీసుకునే నిర్ణయాలు సమర్థించాల్సిందేనని ఇంకొందరు చెబుతున్నారు. వాస్తవానికి భారీ బడ్జెట్ చిత్రాల్లో ప్రతి విషయం బెస్ట్ గా ఉండాలని నిర్మాతలు కోరుకోవడం సహజం.

ప్రేక్షకుల అంచనాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఎవరి వర్క్ లో అయినా అవసరమైతే మార్పులు చేయడం కొత్త విషయం కాదు. అయితే రెహమాన్ వంటి గ్లోబల్ ఐకాన్ విషయంలో అలాంటి వార్తలు రావడం సహజంగానే చర్చకు దారితీస్తోంది. ఇక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు.

అలాగే సన్నీ డియోల్ హనుమంతుడిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఆ భారీ చిత్రం ఫస్ట్ పార్ట్ 2026 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా చూస్తే, రెహమాన్ మ్యూజిక్‌ పై వస్తున్న రివ్యూ వార్తలు ఎంతవరకు నిజమో తెలియకపోయినా.. సినిమా మీద ఉన్న అంచనాలను మాత్రం మరింత పెంచుతున్నాయి.