నెలకు రూ.50 లక్షలు వడ్డీ.. ఆఫీస్ కూడా అమ్మేశాడు.. పూరీ పై రఘుకుంచే షాకింగ్ కామెంట్స్!
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే టాలీవుడ్‌లో ఒక బ్రాండ్. ఆయన సినిమాలతోనే కాకుండా, వ్యక్తిత్వంతో కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.
By: Madhu Reddy | 27 July 2026 6:00 AM ISTడైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంటే టాలీవుడ్‌లో ఒక బ్రాండ్. ఆయన సినిమాలతోనే కాకుండా, వ్యక్తిత్వంతో కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. అయితే, ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, మనుషులను నమ్మి మోసపోయిన తీరుపై ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె సంచలన విషయాలను బయటపెట్టారు. పూరీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన ఎదుర్కొన్న కష్టాలు, నెలనెలా కట్టిన భారీ వడ్డీల గురించి స్పందించిన విషయాలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి.
పూరీతో అనుబంధం.. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ స్పందన:
తనను సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రోత్సహించిన పూరీ జగన్నాథ్‌తో రఘు కుంచెకు ఎంతో అనుబంధం ఉంది. బాచి, ఇడియట్, దేశముదురు, నేనింతే వంటి హిట్ చిత్రాలకు కలసి పనిచేసిన వీరికి వ్యక్తిగతంగానూ మంచి స్నేహం ఉంది. ఇక సినీ పరిశ్రమలో అందరూ ఫ్రెండ్సే అయినప్పటికీ, ఎవరినీ అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదనేది తన సిద్ధాంతమని రఘు కుంచె తెలిపారు. అయితే పూరీ జగన్నాథ్ విషయంలో మాత్రం పర్సనల్‌గా వెళ్లేంత చనువు తనకు ఉందని, ఆయన తప్పులు చేసినప్పుడు ముఖం మీదే ధైర్యంగా చెప్పానని వివరించారు.
మనుషులను అతిగా నమ్మడమే కొంపముంచింది:
పూరీ జగన్నాథ్ జీవితంలో అతి పెద్ద బలహీనత మనుషులను గుడ్డిగా నమ్మడమేనని రఘు కుంచె వ్యాఖ్యానించారు. కొందరిని అతిగా నమ్మి, వారిపై డిపెండ్ అవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. "నువ్వు తప్పు చేస్తున్నావ్, జాగ్రత్తపడు" అని తను పూరీకి ధైర్యంగా చెప్పేసరికే జరగాల్సిన పెద్ద నష్టం జరిగిపోయిందని, జాగ్రత్త పడాల్సిన సమయం దాటిపోయి పూరీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని రఘు కుంచె గుర్తు చేసుకున్నారు. ఇక మనుషులను ఈజీగా నమ్మే ఆ వీక్నెస్ ఆయనను ఇప్పటికీ వదల్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నెలకు రూ.50 లక్షల వడ్డీ.. ఆఫీస్ అమ్మేసిన వైనం:
'ఏక్ నిరంజన్', 'బంపరాఫర్' సినిమాల సమయంలో పూరీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని రఘు కుంచె తెలిపారు. ఆ టైమ్‌లో అప్పుల భారం పెరిగిపోయి, ఏకంగా నెలకు రూ.50 లక్షల వరకు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందట. దాంతో వేరే దారి లేక పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లే దారిలో ఎంతో ఇష్టపడి, బ్యూటిఫుల్‌గా నిర్మించుకున్న తన సొంత ఆఫీస్ భవనాన్ని అమ్మేసి అప్పులు తీర్చేశారట. ఇక ఆ తర్వాత మళ్లీ అద్దె ఆఫీసులో ప్రయాణం ప్రారంభించి, హిట్లు కొట్టి తిరిగి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని చెప్పారు.
హిట్, ఫ్లాప్‌లకు అతీతమైన నిగ్రహం:
ఇదే సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా, పడటం లేవడం పూరీకి కొత్త కాదని రఘు కుంచె కొనియాడారు. ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా ఆయన ఎప్పుడూ డిజప్పాయింట్ అవ్వలేదన్నారు. 'ఇడియట్', 'పోకిరి' లాంటి ఇండస్ట్రీ హిట్లు వచ్చినా.. లేక అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినా పూరీ రియాక్షన్ ఒకేలా ఉంటుందని తెలిపారు. ఆయన క్రమం తప్పకుండా చదివే పుస్తకాల వల్లే అలాంటి నిగ్రహశక్తి వచ్చిందేమోనని, ఏదో తపస్సు చేస్తే తప్ప అలాంటి మానసిక పరిణితి రాదని పూరీ మనస్తత్వాన్ని అభినందించారు.
పూరీ పోరాట పటిమకు జోహార్లు:
ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిచినా మళ్లీ ఫినిక్స్ పక్షిలా లేచి నిలబడటం పూరీ జగన్నాథ్ ప్రత్యేకత. ఇక రఘు కుంచె బయటపెట్టిన ఈ విషయాలు పూరీ జీవితంలోని మరో కోణాన్ని, ఆయన అనుభవించిన నరకాన్ని కళ్లకు కట్టాయి. ఇప్పటికీ అలాంటి వైఫల్యాలను తట్టుకుని నిలబడిన పూరీ జగన్నాథ్ ధైర్యాన్ని, ఆయన రీ-ఎంట్రీ పోరాటాన్ని టాలీవుడ్ ఎప్పటికీ మరచిపోలేదు.
