తమిళనాడు పొలిటికల్ సినిమా: లారెన్స్ మాస్టార్ సిద్ధమే కానీ.. త్రిష సంగతేంటి?
మరోవైపు లారెన్స్ ప్రకటనతో పాటే స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీపై కూడా తమిళనాట గుసగుసలు వినబడుతున్నాయి.
By: Sivaji Kontham | 12 Jun 2026 12:26 PM ISTతమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్)కు- రాజకీయాలకు దశాబ్దాలుగా విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి కాలం నుండి మొన్నటి విజయ్ కాంత్, నేటి దళపతి విజయ్ వరకు ఎంతో మంది సినీ స్టార్లు రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు. ఇప్పుడు ఇదే బాటలో మరికొందరు అగ్ర తారలు రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నటుడు, దర్శకుడు, సామాజిక సేవాకర్త రాఘవ లారెన్స్ తన పొలిటికల్ ఎంట్రీపై అధికారికంగా మనసులోని మాటను బయటపెట్టగా.. అదే సమయంలో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష రాజకీయ ప్రవేశంపై కూడా కోలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా రాజకీయాల్లోకి వచ్చే ముందు అంతర్గతంగా ప్రణాళికలు రచిస్తారు. కానీ రాఘవ లారెన్స్ మాత్రం ఎవరూ ఊహించని విధంగా సరికొత్త పంథాను ఎంచుకుని... తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయాన్ని నేరుగా ప్రజల చేతుల్లోనే పెట్టారు. ఆయన తన `ఎక్స్` (ట్విట్టర్) లో ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేసారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా బాధ్యతను నమ్మకంగా నిలబెట్టాలంటూ నెటిజన్లను, తన అభిమానులను సలహా కోరారు. ప్రజలు కనుక వద్దు అని చెబితే తాను రాజకీయాల్లోకి రాకుండా తన ట్రస్ట్ ద్వారా సమాజ సేవకే పరిమితమవుతానని... ఒకవేళ ప్రజలు రమ్మని (ఎస్) చెబితే మాత్రం తాను రాజకీయాల్లోకి రావడానికి పూర్తిగా సిద్ధమని ఆయన ప్రకటించారు. త్వరలోనే ఎప్పుడు ఎవరితో కలిసి ప్రయాణం ప్రారంభించబోయేది కూడా వెల్లడిస్తానని లారెన్స్ స్పష్టం చేశారు.
మరోవైపు లారెన్స్ ప్రకటనతో పాటే స్టార్ హీరోయిన్ త్రిష పొలిటికల్ ఎంట్రీపై కూడా తమిళనాట గుసగుసలు వినబడుతున్నాయి. దీనిపై త్రిష నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ... ఆమె రాజకీయ రంగప్రవేశానికి వేదిక సిద్ధమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి తెరతీసిన `తమిళగ వెట్రి కళగం` (టీవీకే) అధినేత, తన సహనటుడు దళపతి విజయ్ వెంటే త్రిష నిలుస్తుండటం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. విజయ్ రాజకీయంగా విజయం సాధించాలని బలంగా కోరుకుంటున్న తొలి వ్యక్తి త్రిషనే కావడంతో భవిష్యత్తులో విజయ్ పార్టీ `టీవీకే`లో త్రిష చేరడం ఖాయమని.. అందులో ఆమెకు అత్యున్నత ప్రాధాన్యత కలిగిన పదవి దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో రాఘవ లారెన్స్... దళపతి విజయ్‌ల మధ్య ఉన్న సత్సంబంధాలు కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌ను విమర్శించిన వారిని సముదాయించే ప్రయత్నం లారెన్స్ చేశారు. ముఖ్యంగా యాక్టర్ విశాల్.. దళపతి విజయ్‌ను ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు లారెన్స్ స్పందిస్తూ అందరూ సంయమనం పాటించాలని కోరారు. విజయ్ రాజకీయ ప్రస్థానానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్న లారెన్స్... ఇప్పుడు తన అభిమానుల... ప్రజల అభిప్రాయాన్ని కోరుతుండటం చూస్తుంటే అతడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచినా లేదా ఆ పార్టీలో భాగమైనా ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి కోలీవుడ్ స్టార్లు ఒకరి తర్వాత ఒకరు రాజకీయాల వైపు అడుగులు వేస్తుండటం తమిళ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తోంది. రాఘవ లారెన్స్ ప్రజల నుండి లభించే స్పందన ఆధారంగా తన పొలిటికల్ రూట్ మ్యాప్‌ను ప్రకటించడానికి సిద్ధమవుతుండగా... త్రిష ఎంట్రీపై వస్తున్న వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవేళ ప్రజల మద్దతుతో లారెన్స్... విజయ్ అండతో త్రిష ఇద్దరూ గనుక రాజకీయ రంగు పూసుకుంటే.. రానున్న కాలంలో తమిళనాడు అసెంబ్లీ వేదికగా సరికొత్త పొలిటికల్ సినిమా కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
