Begin typing your search above and press return to search.

చిరంజీవి హీరోయిన్ బాల‌య్య‌కు అభిమాని!

ఇంత‌కుముందు బాలయ్య హోస్ట్ చేసిన `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోకి రాధిక వచ్చినప్పుడు ఆ ఇద్ద‌రి న‌డుమా సంభాష‌ణ‌లు, కెమిస్ట్రీ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

By:  Sivaji Kontham   |   7 Jan 2026 5:00 AM IST
చిరంజీవి హీరోయిన్ బాల‌య్య‌కు అభిమాని!
X

90ల‌లో మెగాస్టార్ చిరంజీవి- రాధిక కాంబినేష‌న్ కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఈ జంట న‌టించిన‌ చాలా సినిమాలు చ‌క్క‌ని విజ‌యాల్ని సాధించాయి. అప్ప‌ట్లో చిరు-రాధిక మ‌ధ్య కెమిస్ట్రీ గురించి చాలా చ‌ర్చ జ‌రిగేది. హిట్ పెయిర్.. జంట అంటే ఇలా ఉండాలి! అన్న ప్ర‌శంస‌లు ద‌క్కేవి. చిరు- రాధిక ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి కూడా చాలా గాసిప్పులు షికార్ చేస్తుండేవి. అయితే చిరంజీవి- రాధిక ఎప్ప‌టికీ మంచి ఫ్రెండ్స్. ఇటీవ‌ల ఎయిటీస్ క్లాస్ పేరుతో ప్ర‌తియేటా ఓ చోట నాటి మేటి తార‌లంతా క‌లుస్తూనే ఉన్నారు. ఎయిటీస్ పార్టీలో చిరుతో రాధిక డ్యాన్సుల‌కు సంబంధించిన ఫోటోలు , వీడియోలు కూడా వైర‌ల్ అయ్యాయి.

ఇక చిరంజీవి ఫేవ‌రెట్ హీరోయిన్ అయిన రాధిక న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అభిమాని కావ‌డం ఆస‌క్తిక‌రం. న‌టి రాధిక శ‌ర‌త్ కుమార్‌తో బాల‌య్య ఎంతో స్నేహంగా ఉంటారు. రాధిక చాలా సంద‌ర్భాల‌లో తాను బాల‌య్య‌కు అభిమానిని అని చెప్పారు. బాలయ్య చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. ఆయన లోపల ఒకటి, బయట ఒకటి ఉండదు. అందుకే నాకు ఆయన అంటే చాలా అభిమానం! అని అంటుంటారు. బాల‌య్య వ్య‌క్తిగ‌తంగా చాలా మంచి వాడు అని కూడా రాధిక కితాబిచ్చారు.

ఇంత‌కుముందు బాలయ్య హోస్ట్ చేసిన `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోకి రాధిక వచ్చినప్పుడు ఆ ఇద్ద‌రి న‌డుమా సంభాష‌ణ‌లు, కెమిస్ట్రీ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. షోలో బాలయ్య ఎనర్జీని చూసి ``నువ్వు నిజంగా అన్‌స్టాపబుల్ బాలయ్యా`` అంటూ రాధిక ప్ర‌శంసించారు. బాలయ్య జోకులకు ఆమె పడి పడి నవ్వడం చూస్తే వారి న‌డుమ కెమిస్ట్రీ ఏ రేంజులో వ‌ర్క‌వుట‌వుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. 80ల‌లో చిరంజీవి, బాల‌కృష్ణ‌ల‌తో క‌లిసి రాధిక ప‌లు చిత్రాల్లో న‌టించారు. ఎన్బీకే న‌టించిన నిప్పు ర‌వ్వ చిత్రంలోను రాధిక ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. నిప్పు ర‌వ్వ జ్ఞాప‌కాల‌ను కూడా రాధిక అప్పుడ‌ప్పుడు గుర్తు చేసుకుంటారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్య క్రమశిక్షణను, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావాన్ని రాధిక ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

అదంతా అటుంచితే ఇప్పుడు రాధిక ఓ సినిమాలో ఏకంగా బాల‌య్య‌కు అభిమానిగా న‌టిస్తున్నారు. ఆయ‌న‌పై ఎలాంటి అభిమానం ఉంది? అంటే `జై బాల‌య్య‌` అంటూ హెడ్ బ్యాండ్ పెట్టుకునేంత‌గా. శ్రీవిష్ణు క‌థానాయ‌కుడిగా తెరకెక్కుతున్న `కామ్రేడ్ కళ్యాణ్` చిత్రంలో రాధిక‌ బాలయ్య అభిమానిగా కనిపించనున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీలో త‌న లుక్ ని రాధిక షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. రాధిక ఒక ప‌ల్లెటూరి మాస్ యువ‌తిగా క‌నిపించ‌నుంది. బాలకృష్ణ నటించిన `టాప్ హీరో` పోస్ట‌ర్ ఒక‌టి రాధిక ఉన్న ఫ్రేమ్ లో నేప‌థ్యంలో క‌నిపిస్తోంది. మొత్తానికి రాధిక జై బాల‌య్య నినాదం ఊరూ వాడా వినిపించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.