Begin typing your search above and press return to search.

చిత్ర నిర్మాతలపై మరోసారి మండిపడ్డ రాధిక.. మానవత్వం లేదంటూ!

వైద్య నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రముఖ హీరోయిన్ రాధిక ఆప్టే.. తొలిసారి మరాఠీ చిత్రాల ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది.

By:  Madhu Reddy   |   12 Dec 2025 11:35 AM IST
చిత్ర నిర్మాతలపై మరోసారి మండిపడ్డ రాధిక.. మానవత్వం లేదంటూ!
X

వైద్య నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రముఖ హీరోయిన్ రాధిక ఆప్టే.. తొలిసారి మరాఠీ చిత్రాల ద్వారా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత హిందీలో సినిమాలు చేయడం ప్రారంభించిన ఈమె.. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ చిన్నది.. రక్త చరిత్ర 2, లయన్, లెజెండ్, కబాలి వంటి చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో మెప్పించిన ఈమె.. నిర్మొహమాటంగా తాను చెప్పాలనుకున్న విషయాన్ని నిర్భయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెడుతూ వార్తల్లో నిలుస్తోంది.

ముఖ్యంగా సినిమా షూటింగ్ సమయాలలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చిత్ర నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేసిన ఈమె.. ఇప్పుడు మరొకసారి నిర్మాతలపై మండిపడుతూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

విషయంలోకి వెళ్తే.. గత ఏడాది రాధిక ఆప్టే ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాను ఒక హిందీ సినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు తాను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటికీ ఆ చిత్ర నిర్మాత ఏమాత్రం మానవత్వం చూపలేదని ఆవేదన వ్యక్తం చేసింది. రాధిక మాట్లాడుతూ.." నేను అప్పుడు మూడో నెల గర్భంతో ఉన్నాను. గర్భం కారణంగా శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే నేను గర్భవతిని అని తెలిసి కూడా.. ఆ నిర్మాత బిగుతైన దుస్తులు ధరించమని బలవంత పెట్టాడు. అసౌకర్యంగా ఫీల్ అయ్యాను. వాటి వల్ల నొప్పితో బాధపడుతూ.. డాక్టర్ని కలవాలని చెప్పినా వెళ్ళనివ్వలేదు. నొప్పితో బాధపడుతున్న కూడా మానవత్వం లేకుండా రాక్షసుడిలా ప్రవర్తించాడు.

వాస్తవానికి నేనెప్పుడూ కూడా ప్రత్యేకంగా సౌకర్యాలు కోరుకోలేదు. కెరియర్ , ప్రొఫెషనల్ నిబద్దతలు ఏంటో నాకు తెలుసు. అయితే మనిషిగా కొంత సానుభూతి, దయ, జాలి చూపించడం అనేది తప్పు కాదు. అలాంటి ఆనంద సమయంలో కూడా కనీస మానవత్వం లేకుండా నన్ను ఇబ్బంది పెట్టారు" అంటూ కామెంట్లు చేసింది రాధిక. అప్పట్లో ఈ కామెంట్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక అదే ఏడాది డిసెంబర్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది రాధిక.

అలాంటి ఈమె ఇప్పుడు మరొకసారి చిత్ర నిర్మాతలపై మండిపడుతూ సినిమాలలో హింస ఎక్కువవుతుంది. ఇలా హింసను ప్రేరేపించే వ్యక్తులు ఉన్న ఇలాంటి సమాజంలో నా కూతుర్ని పెంచాలంటేనే భయంగా ఉంది అంటూ చెప్పి మరొకసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఒక హాలీవుడ్ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.." ముఖ్యంగా దర్శక నిర్మాతలు కథ చెప్పే విషయంలో నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాలనుకున్నాను. ఎంటర్టైన్మెంట్ ముసుగులో హింసను ప్రేరేపిస్తూ తీస్తున్న చిత్రాలు నన్ను తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. హింసే వినోదంగా మారిన ఈ ప్రపంచంలో నా బిడ్డను నేను ఎలా పెంచాలో అర్థం కావడం లేదు. దీనిని నేను తట్టుకోలేకపోతున్నాను.

కథలో డెప్త్ కంటే తెరపై చూపించే రక్తపాతానికే మేకర్స్ ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. నేను ఒక హంతకుడు కథ చెప్పాలనుకుంటే.. వాడు మనుషులను నరకడాన్ని చేసే ఘోరమైన పనులను కళ్ళకు కట్టినట్లు చూపించాల్సిన అవసరం లేదు కదా. ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా హింస ప్రధానంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఇది నన్ను మరింత కలిచివేస్తోంది" అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఏది ఏమైనా దర్శక నిర్మాతలలో మార్పు రావాలి అని, ఇలాంటి హింసను ప్రేరేపించే చిత్రాలను ప్రోత్సహించకపోవడమే మంచిది అని కామెంట్లు చేసింది రాధిక ఆప్టే.