Begin typing your search above and press return to search.

తెల్లగా ఉంటేనే ఛాన్సులా.. రాధిక మాటల్లో నిజమెంత?

సౌత్ సినిమాల్లో తెల్లగా ఉండే ఉత్తరాది హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని రాధికా అభిప్రాయపడ్డారు.

By:  M Prashanth   |   29 Oct 2026 11:00 PM IST
తెల్లగా ఉంటేనే ఛాన్సులా.. రాధిక మాటల్లో నిజమెంత?
X

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు తెలుగు రాకపోవడం పెద్ద సమస్యగా ఉండేది కాదు. అందంగా కనిపిస్తే చాలు, డైలాగుల కోసం డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండేవారు. ఇప్పటికీ చాలా సినిమాల్లో ఇదే పద్ధతి కొనసాగుతోంది. అయితే ప్రేక్షకుల అభిరుచులు మారుతున్నాయి. పాత్రకు తగ్గ నటన, సహజమైన ఎమోషన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు హీరోయిన్ల విషయంలో ఇండస్ట్రీ అనుసరిస్తున్న పద్ధతిని మరోసారి గుర్తుచేశాయి.

సౌత్ సినిమాల్లో తెల్లగా ఉండే ఉత్తరాది హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని రాధికా అభిప్రాయపడ్డారు. స్థానికంగా ఎంతోమంది టాలెంట్ ఉన్న నటీమణులు ఉండగా, బయటి నుంచి హీరోయిన్లను తీసుకురావడాన్ని ప్రస్తావించారు. గతంలో బాలకృష్ణతో 'లయన్', రజనీకాంత్‌తో 'కబాలి' చేసిన ఆమెకు ఇక్కడి పరిస్థితులపై కొంత అవగాహన ఉంది. అయితే తన అభిప్రాయం తప్పు కూడా కావచ్చని పేర్కొన్నారు.

నిజానికి రాధికా మాటల్లో భాషకు సంబంధించిన అంశం మరింత ఆసక్తికరంగా ఉంది. డైలాగ్ అర్థం కాకుండా నటించడం తనకు నచ్చదని చెప్పారు. ఒక సన్నివేశంలో హీరో చెప్పే మాటకు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఆ మాట అర్థమైతే నటనలో కూడా తేడా కనిపిస్తుంది. కానీ భాష తెలియకపోతే దర్శకుడు వివరించిన దానిని బట్టి నటించాల్సి వస్తుంది. తనకు దక్షిణాది భాషలు రాకపోవడాన్ని కూడా రాధికా ప్రస్తావించారు.

అయితే రాధికా చెప్పిన రంగు విషయానికి వస్తే, టాలీవుడ్‌లో గతంలో అలాంటి అభిరుచులు కనిపించిన మాట వాస్తవమే. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ అందంగా ఉండాలనే పేరుతో తెల్లటి చర్మానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. తెలుగు రాని నటీమణులను తీసుకుని డబ్బింగ్ చెప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరోవైపు అంజలి, ఈషా రెబ్బ లాంటి తెలుగు తెలిసిన నటీమణులు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ స్టార్ హీరోల సినిమాల్లో వీరికి వచ్చిన అవకాశాలు మాత్రం పరిమితమే.

ఇక్కడ నిర్మాతల వైపు కూడా కొన్ని కమర్షియల్ లెక్కలు ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఇతర భాషలకు చెందిన హీరోయిన్‌ను తీసుకుంటే అక్కడి ప్రమోషన్లకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు ఈ ప్రయోజనం ఉంటుంది. అయితే పెద్దగా గుర్తింపు లేని కొత్త హీరోయిన్లను కూడా ఉత్తరాది నుంచి తీసుకొస్తున్న సందర్భాలున్నాయి. అప్పటికే మార్కెట్ ఉన్న హీరోయిన్‌ను తీసుకోవడం ఒక కారణమైతే, కొత్తవాళ్ల విషయంలో ఆ కారణం వర్తించదు. అందుకే రాధికా చెప్పిన రంగు ప్రాధాన్యం అంశం కూడా హైలెట్ అవుతోంది. అదే సమయంలో సమంత, సాయి పల్లవి, కీర్తి సురేశ్ లాంటి నటీమణులు గ్లామర్‌తో పాటు నటనతోనూ మంచి అవకాశాలు అందుకున్నారు.

మరోవైపు బాలీవుడ్‌లో కూడా విదేశీ నటీమణులకు అవకాశాలు ఇవ్వడాన్ని రాధికా ప్రస్తావించారు. ప్రస్తుతం ఆమె కీర్తి సురేశ్‌తో కలిసి 'అక్క' వెబ్ సిరీస్‌లో నటించారు. అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న ఈ సిరీస్‌లో ఇద్దరూ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాధికా రుద్రగా, కీర్తి భవానిగా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే రాధికా తన గత అనుభవాలను బయటపెట్టారు.