Begin typing your search above and press return to search.

46 కోట్ల మోసం.. రాధ ఫిర్యాదుతో అంబిక‌ క‌న్నీరు మున్నీరు!

సీనియర్ నటీమణులు, 1980ల నాటి అగ్ర కథానాయికలు రాధ, అంబికల మధ్య కుటుంబ వివాదం ప్రస్తుతం సినిమా వర్గాలలో సంచలనంగా మారింది.

By:  Sivaji Kontham   |   24 Sept 2026 1:01 AM IST
46 కోట్ల మోసం.. రాధ ఫిర్యాదుతో అంబిక‌ క‌న్నీరు మున్నీరు!
X

సీనియర్ నటీమణులు, 1980ల నాటి అగ్ర కథానాయికలు రాధ, అంబికల మధ్య కుటుంబ వివాదం ప్రస్తుతం సినిమా వర్గాలలో సంచలనంగా మారింది. ఇటీవల రాధ తన సోదరి అంబిక మరియు సోదరుడు మల్లికార్జున కుంజున్ నాయర్‌లపై చెక్ ఫ్రాడ్ (చెక్ మోసం) ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన చెన్నై నివాసంలో ఉంచిన సంతకం చేసిన ఖాళీ చెక్కులను తన ప్రమేయం లేకుండా తీసుకుని, సుమారు రూ. 46 కోట్ల దావా వేసేందుకు ప్రయత్నించారని రాధ ఆరోపించారు.

ఈ ఆరోపణలపై అంబిక మీడియా ముందుకు వచ్చి కన్నీటిపర్యంతమవుతూ తన వాదనను వినిపించారు. స్వయానా చెల్లెలే తనను ఒక `దొంగ`లా చిత్రీకరించడం తన హృదయాన్ని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాధ తన హ్యాండ్‌బ్యాగ్‌కు సైతం ప్రత్యేక నంబర్ లాక్ వేసుకునేంత అత్యంత జాగ్రత్తపరురాలని.. అలాంటి వ్యక్తి సంతకం చేసిన ఖాళీ చెక్కులను ఇంట్లో నిర్లక్ష్యంగా వదిలేశానని చెప్పడం నమ్మశక్యంగా లేదని అంబిక అన్నారు.

ఇక ఆస్తుల విషయానికి వస్తే.. అంబిక - రాధ కలిసి ఎంతో కష్టపడి నిర్మించుకున్న `ఏఆర్ఎస్ గార్డెన్ స్టూడియో` పేరును ఎలాంటి సమాచారం లేకుండా మార్చేయడం తనను తీవ్రంగా బాధిస్తోందని వాపోయారు. `ఏఆర్ఎస్ గార్డెన్` బోర్డును తొలగించి వేరే బోర్డు పెట్టడం నేను చూడలేకపోయాను. ఆ పేరులో ఉన్న A (అంబిక) అక్షరం మాయమైంది. నేనేమైనా చనిపోయానా? నాకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదా? అంటూ కంటతడి పెట్టుకున్నారు.

అలాగే కుటుంబంలో ఆస్తులు- బంగారు ఆభరణాల పంపకాలపై కూడా అంబిక స్పందించారు. తనకు రావాల్సిన బంగారం ఇప్పటికీ రాధ వద్దే ఉందని.. దాని గురించి అడిగితే ఆమె కనీసం ఫోన్ కూడా ఎత్తరని ఆరోపించారు. తమ తల్లి బతికి ఉన్నప్పుడే ఆస్తులను సమానంగా పంచుకోవాలని నిర్ణయించామని.. కానీ రాధ మాత్రం ముందు ఒకలా మాట్లాడి తర్వాత మాట మారుస్తుంటారని వారి సోదరుడు మల్లికార్జున కూడా అంబిక వాదనను సమర్ధించారు.

తాము కష్టకాలంలో ఉన్నప్పుడు కుటుంబాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించానని.. కానీ నేడు బంధాలకు విలువ లేకుండా పోయిందని అంబిక ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 46 కోట్ల మేర త‌న అనుమ‌తి లేకుండా చెక్కుల‌ను డ్రా చేసుకునేందుకు అంబిక ప్ర‌య‌త్నించార‌ని రాధ ఆరోపించ‌గా, ఇప్పుడు దానికి అంబిక కౌంట‌ర్ వేసారు. ఒకే కాలంలో సౌత్ ఇండియన్ చిత్రసీమని ఏలిన ఈ ప్రముఖ అక్కచెల్లెళ్ల మధ్య ఆస్తుల వివాదం తారస్థాయికి చేరడం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.