నటన కంటే ఫాలోవర్స్ ముఖ్యమా?
ప్రస్తుత డిజిటల్ యుగంలో సినిమా పరిశ్రమ సరికొత్త మార్పులకు లోనవుతోందన్నది కాదన లేని నిజం.
By: Srikanth Kontham | 21 May 2026 1:07 PM ISTప్రస్తుత డిజిటల్ యుగంలో సినిమా పరిశ్రమ సరికొత్త మార్పులకు లోనవుతోందన్నది కాదన లేని నిజం. అయితే ఈ మార్పులు ప్రతిభావంతులైన నటులకు శాపంగా మారుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు రాశుల్ టాండన్ చిత్ర పరిశ్రమలో మారుతోన్న కాస్టింగ్ ట్రెండ్స్ - సోషల్ మీడియా ఇన్‌ఫ్లు యెన్సర్ల ప్రమేయంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నటన తెలియకపోయినా? సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారనే ఒకే ఒక్క కారణంతో అవకాశాలు కల్పించి దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్న నిజమైన నటులను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డిజిటల్ క్రియేటర్లు, యూట్యూబర్లయిన సౌరభ్ ద్వివేది, కర్తవ్య లతో పాటు క్యారీమినాటి ,అనుభవ్ సింగ్ బస్సి వంటి ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రస్తావనను తీసుకొచ్చారాయన. ఈ రోజుల్లో నటీనటుల ఆడిషన్స్ కంటే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఫాలోవర్ల సంఖ్యను చూసి పాత్రలను ఖరారు చేస్తున్నారని ఆరోపించారు. ఒక క్యారెక్టర్‌కు సరిపోతాడా లేదా అనే కనీస అర్హతను పక్కన పెట్టి ప్రమోషన్లకు పనికొస్తారనే కమర్షియల్ యాంగిల్‌లో ఇండస్ట్రీ మేకర్స్ ఆలోచించడం దారుణమని దుయ్యబట్టారు. ఈ విధమైన ఇన్‌ఫ్లుయెన్సర్ కాస్టింగ్ సంస్కృతి వల్ల ఎన్నో ఏళ్లుగా థియేటర్ ఆర్ట్స్, యాక్టింగ్ స్కూల్స్ నమ్ముకుని, ప్రతిభను మాత్రమే పెట్టుబడిగా పెట్టిన ఎంతో మంది యంగ్ యాక్టర్స్ అవకాశాలు కోల్పోతున్నారని రాహుల్ వాపోయారు.
`ఒక క్రియేటర్ తన రంగంలో నెంబర్ వన్ కావొచ్చు. కానీ నటన అనేది ప్రత్యేకమైన కళ. దానికి ఎంతో సాధన అవసరం. కేవలం ఆన్‌లైన్ క్రేజ్ ఉంది కదా అని వారికి పెద్ద ప్రాజెక్టులలో లీడ్ రోల్స్ ఇస్తే అది సినిమా క్వాలిటీని దెబ్బతీయడమే కాకుండా సినిమానే నమ్ముకున్న నటుల పొట్ట కొట్టడమే అవుతుందన్నారు. ఇండస్ట్రీలోని ఈ లోపాలను ఎండగట్టడంలో భాగంగా ప్రతిభ కంటే డిజిటల్ నంబర్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సినిమా కథలోని సహజత్వం లోపిస్తోందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులు థియేటర్లలో నటనను చూడటానికి వస్తారని , స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లను పెడితే లాంగ్ రన్ లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేవని హెచ్చరించారు.
ఈ వివక్షపై కాస్టింగ్ డైరెక్టర్లు , ప్రొడక్షన్ హౌస్‌లు పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లేకపోతే ఇండస్ట్రీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాశుల్ టాండన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌తో పాటు సౌత్ సినీ సర్కిల్స్ లోనూ పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో టాలీవుడ్, కోలీవుడ్ లలో సైతం పాపులర్ యూట్యూబర్లను, రీల్స్ స్టార్లను సినిమాల్లోకి తీసుకునే ట్రెండ్ పెరిగింది. రాహుల్ వ్యాఖ్యలకు మద్దతుగా పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఆడిషన్స్ రూమ్‌లలో టాలెంట్ కంటే సోషల్ మీడియా ప్రొఫైల్స్ అడుగుతున్నారనే పచ్చి నిజాన్ని ఆయన ధైర్యంగా బయటపెట్టారని మెచ్చుకుంటున్నారు. డిజిటల్ విప్లవం వల్ల క్రియేటర్లకు అవకాశాలు రావడం మంచిదే అయినే? అది నటుల ఉనికిని ప్రశ్నార్థకం చేయకూడదనేది రాహుల్ టాండన్ ఉద్దేశం. కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీల కోసం సినిమాల్లో కాస్టింగ్ చేయడం మానుకుని కంటెంట్ కు ,నటనకు మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే చిత్ర పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందన్నారు. మరి రాహుల్ రేపిన సరికొత్త వివాదంపై ఇండస్ట్రీ పెద్దలు ,సదరు డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
