దొంగ నోట్ల వ్యాపారంపై డీటెయిలింగ్.. అదే ఈ సిరీస్ ప్రత్యేకత!
రాశి ఖన్నా 'ఫర్జీ 2' షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించడంతో ఈ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
By: Sivaji Kontham | 14 Aug 2026 3:09 PM ISTరాశి ఖన్నా `ఫర్జీ 2` షూటింగ్‌ను అధికారికంగా ప్రారంభించడంతో ఈ బ్లాక్‌బస్టర్ క్రైమ్ థ్రిల్లర్ సీక్వెల్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. రాజ్ నిడిమోరు- కృష్ణ డికే దర్శకత్వంలో వచ్చిన `ఫర్జీ` మొదటి సీజన్ 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై గొప్ప ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండవ సీజన్ కోసం చిత్రబృందం మళ్లీ రంగంలోకి దిగింది. ఈ రెండవ సీజన్‌లో రాశి ఖన్నా తిరిగి ఆర్‌బిఐ అధికారిణి మేఘా వ్యాస్ పాత్రలో అలరించనున్నారు. గురువారం రోజున షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాశీ అభిమానులతో పంచుకున్నారు. తన మేకప్ రూమ్ విశేషాలతో పాటు, సిరీస్ నేపథ్యానికి సంబంధించి రూ. 500 నోటును చేతిలో పట్టుకున్న ఫోటోను షేర్ చేస్తూ తిరిగి ఫర్జీ 2 కోసం వస్తున్నాను అంటూ ధృవీకరించారు.
ఈ సిరీస్ కథానాయకుడు షాహిద్ కపూర్ (సన్నీ) ఈ ఏడాది మార్చి నెలలోనే `ఫర్జీ 2` షూటింగ్‌ను ప్రారంభించారు. అప్పట్లో దర్శకులు రాజ్ అండ్ డికేలతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఒకటోరోజు ఫర్జీ 2 చిత్రీకరణ జరిగిందని షాహిద్ ప్రకటించారు. మొదటి భాగంలో దొంగ నోట్ల తయారీతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన సన్నీ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మొదటి సీజన్‌లో షాహిద్ కపూర్, రాశి ఖన్నాతో పాటు విజయ్ సేతుపతి, కే కే మీనన్, భువన్ అరోరా, రెజినా కాసాండ్రా, అమోల్ పాలేకర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు. ఎనిమిది ఎపిసోడ్లుగా వచ్చిన మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ కథ ఎలా ఉండబోతోందనే ఉత్సుకత అందరిలోనూ నెలకొంది.
ప్రస్తుతం షాహిద్ కపూర్ - రాశి ఖన్నా ఇద్దరూ షూటింగ్‌లో పాల్గొంటుండటంతో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేకర్స్ ఇంకా కథాంశం వివరాలను లేదా అధికారిక విడుదల తేదీని వెల్లడించకపోయినా.. `ఫర్జీ 2` మరింత థ్రిల్లింగ్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది.
ఫర్జీ కథాంశంలో గమ్మత్తు:
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విశేష ఆదరణ పొందిన `ఫర్జీ` సిరీస్ ఆర్టిస్ట్ అయిన సన్నీ (షాహిద్ కపూర్) అనే యువకుడు తన తాత నిర్వహించే సాంప్రదాయ ప్రింటింగ్ ప్రెస్‌ను అప్పుల నుండి కాపాడుకోవడానికి తన అద్భుతమైన చిత్రకళా నైపుణ్యంతో దొంగ నోట్ల తయారీ వైపు ఎలా అడుగులు వేశాడు? అతడిని పట్టుకోవడానికి మైఖేల్ (విజయ్ సేతుపతి) అనే ఐఏఎఫ్ అధికారి నేతృత్వంలోని ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఎలా శోధించింది అనే అంశాల చుట్టూ తిరిగే ఉత్కంఠభరితమైన క్రిమినల్ థ్రిల్లర్. ఈ సిరీస్‌లో దొంగ నోట్ల ముద్రణకు సంబంధించిన సాంకేతిక వివరాలను (డీటెయిలింగ్) అత్యంత నిశితంగా ఆవిష్కరించారు. సాధారణ నకిలీ నోట్లకు.. అసలు నోట్లకు ఉండే తేడాలు.. ఆర్బీఐ ఉపయోగించే ప్రత్యేకమైన కాగితం- కాటన్ పేపర్ నాణ్యత.. కలర్ మ్యాచింగ్ .. వాటర్‌మార్క్.. సెక్యూరిటీ థ్రెడ్ (భద్రతా దారం) అమరిక.... మైక్రో లెటరింగ్.. సూర్యకాంతిలో మెరిసే ఇంక్ సాంకేతికతను ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఎలా రీ-క్రియేట్ చేశారో క్షుణ్ణంగా చూపిస్తూ వీక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుంది.
