సూపర్‌స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' స్టోరి డీకోడ్ అయిందిలా!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం `ధర్మన్` టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.
By: Sivaji Kontham | 25 Jun 2026 5:31 PM ISTసూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం `ధర్మన్` టైటిల్ అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇటీవలి టైటిల్ లాంచ్ వేడుకలో దర్శకుడు అశ్వత్ మారిముత్తు సినిమా కథకు సంబంధించి ఒక కీలకమైన లీక్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా `ధర్మన్` కథ ఏమై ఉంటుందనే దానిపై నెటిజన్లు, అభిమానుల మధ్య బోలెడంత ఆసక్తికరమైన డిబేట్ సాగుతోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ సరికొత్తగా ఒక డాక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు దర్శకుడి మాటలతో అధికారికంగా ఖరారైంది.
మీడియా సమావేశంలో దర్శకుడు అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ.. రజనీకాంత్ పోషిస్తున్న డాక్టర్ పాత్ర ఎలా ఉండబోతుందో కొన్ని ఆసక్తికరమైన హింట్స్ ఇచ్చారు. ఈ సినిమా సాధారణంగా మనం చూసే ఐదు రూపాయల డాక్టర్ కథ ఎంతమాత్రం కాదు. ఇది అత్యంత స్టైలిష్‌గా, డెడ్లీగా ఉండే ఒక పవర్‌ఫుల్ డాక్టర్ కథ. ఈ సినిమా రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ హిట్ `పడయప్ప` (తెలుగులో నరసింహా), కమల్ హాసన్ క్లాసిక్ హిట్ `వేట్టైయాడు విలైయాడు` (తెలుగులో రాఘవన్) చిత్రాల మిశ్రమంగా ఉండబోతోందని ఆయన ప్రకటించారు. కుటుంబ ప్రేక్షకులందరూ అమితంగా ఇష్టపడే ఒక ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని మలుస్తున్నట్లు దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు.
దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఇచ్చిన హింట్స్‌తో అభిమానులు ఈ కథను తమదైన శైలిలో డీకోడ్ చేస్తున్నారు. సినిమా `నరసింహా` తరహాలో ఉంటుందనగానే ఇందులో హీరో వర్సెస్ విలన్ మధ్య సాగే పవర్‌ఫుల్ రివెంజ్ డ్రామా - మాస్ ఎలిమెంట్స్ రక్తి కట్టిస్తాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో `రాఘవన్` తరహాలో ఉంటుందనడంతో మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఒక క్రైమ్ బ్యాక్‌డ్రాప్ కూడా ఇందులో ఉండబోతోందని స్పష్టమవుతోంది. రజనీకాంత్ లాంటి సీనియర్ నటుడికి ఇలాంటి విలక్షణమైన పాత్ర ఇస్తే ఏ రేంజ్‌లో చెలరేగిపోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో `జైలర్` చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టిన రజనీ ఇప్పుడు డాక్టర్‌గా ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారోననే ఉత్కంఠ నెలకొంది.
ఈ చిత్రంలో నటిస్తున్న గ్లామరస్ బ్యూటీ రాశీఖన్నా పాత్ర ఎలా ఉండబోతోందనే దానిపై కూడా ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గతంలో రజనీకాంత్ నటించిన `నరసింహా` చిత్రంలో ఆయన కూతుళ్ల పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో పెద్ద కూతురిగా ప్రీతి విజయకుమార్ నటించగా, చిన్న కూతురిగా అనిత వెంకట్రామన్ నటించి మెప్పించారు. ఆ సెంటిమెంట్‌ను బట్టి చూస్తే ఈ సరికొత్త `ధర్మన్` చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా రాశీఖన్నా నటిస్తోందా? అనే సందేహాలున్నాయి.
అయితే రాశీఖన్నా పాత్రకు సంబంధించి మరో కోణం కూడా వినిపిస్తోంది. రజనీకాంత్ డాక్టర్ పాత్ర పోషిస్తుండటంతోరాశీఖన్నా ఇందులో ఆయన కుమార్తెగా కాకుండా.. ఆయన దగ్గరే ప్రాక్టీస్ చేసే లేదా ఆయనకు సహాయకురాలిగా ఉండే మరో డాక్టర్ పాత్రలో (శిష్యురాలిగా) కనిపించే అవకాశం ఉందా? అనే సస్పెన్స్ కూడా నడుస్తోంది. ఏదేమైనా `నరసింహా`, `రాఘవన్` లాంటి రెండు వైవిధ్యమైన చిత్రాల కథాంశాలను మిక్స్ చేసి రజనీకాంత్ ఇమేజ్‌కు తగ్గట్టుగా అశ్వత్ మారిముత్తు తెరకెక్కిస్తున్న ఈ `ధర్మన్` చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
