రాకా రెండు భాగాలు డిసెంబర్ లోనే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ పాన్-ఇండియా చిత్రం `రాకా`.
By: Srikanth Kontham | 5 Oct 2026 12:29 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ -అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ పాన్-ఇండియా చిత్రం `రాకా`. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి రోజూ ఏదో ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఊహించని ప్రచారం చర్చనీయాంశంగా మారింది. `రాకా` చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి చిత్రబృందం పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం.
సాధారణంగా భారీ ప్రాజెక్టుల విషయంలో షూటింగ్ లీక్స్ లేదా కథానాయకుడి లుక్స్ బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ లీకేజీలకు చెక్ పెడుతూ ఎలాంటి సమాచారం బయటకు రాకుండా అట్లీ రెండు భాగాల చిత్రీకరణను ఒకేసారి వేగవంతంగా పూర్తి చేయడానికి ప్లాన్ చేశారుట. కథలోని సస్పెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ , యాక్షన్ సీక్వెన్సెస్ స్థాయి తగ్గకుండా చూసేందుకు ఈ విధమైన షూటింగ్ షెడ్యూల్స్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా రెండు భాగాల షూటింగ్ పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రోడక్షన్ పనులపై దృష్టి సారించాలని భావిస్తున్నారుట.
విడుదల తేదీల విషయంలో కూడా మేకర్స్ స్పష్టమైన వ్యూహాన్ని అమలు చేయబోతున్నారుట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం `రాకా` మొదటి భాగాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ లో థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. పెద్ద పండుగలు - డిసెంబర్ హాలిడే సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి డిసెంబర్ విండో ఎంతో అనుకూలంగా ఉంటుందని భావించి వచ్చే ఏడాది ఆఖరున తొలి భాగంతో రానున్నారని తెలుస్తోంది.
మొదటి భాగం ముగింపుతో ప్రేక్షకుల్లో పెరిగిన ఉత్కంఠ తగ్గకుండా నిలబెట్టడానికి రెండవ భాగాన్ని కూడా ఎక్కువ గ్యాప్ లేకుండా సరిగ్గా ఆ మరుసటి ఏడాది 2028 డిసెంబర్ లోనే విడుదల చేయాలనేది ప్లాన్ గా తెలిసింది. సాధా రణంగా సీక్వెల్స్ మధ్య రెండేళ్లకు పైగా సమయం పడుతుంది. కానీ అట్లీ లీక్స్ లేకుండా ఒకేసారి రెండింటినీ షూట్ చేస్తుండటం వల్ల డిసెంబర్ టూ డిసెంబర్ స్ట్రాటజీ సాధ్యమవుతోందని చెబుతున్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ ఇప్పటి వరకు కనిపించని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు మైండ్ బ్లోయింగ్ కమర్షియల్ ప్రెజెంటేషన్ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న బిగ్గెస్ట్ విజువల్ స్పెక్టకిల్‌కు సంబంధించిన క్యాస్టింగ్ , ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ రహస్యంగా ఉంచుతున్నారు.
