‘రాకా’పై పజిల్ పోస్టర్.. ‘37’ అంటే ఏంటి?
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ నుంచి మేకర్స్ ‘37’ అనే నెంబర్‌తో పోస్టర్ వదిలారు.
By: M Prashanth | 17 Sept 2026 4:06 PM ISTఅల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ నుంచి మేకర్స్ ‘37’ అనే నెంబర్‌తో పోస్టర్ వదిలారు. పోస్టర్‌లో సినిమా పేరు తప్ప ఇంకే హింట్ ఇవ్వలేదు. దీంతో ఈ నెంబర్ వెనుక ఏముందనే డిస్కషన్ సోషల్ మీడియాలో మొదలైంది. రెగ్యులర్‌గా ఫస్ట్ లుక్, గ్లింప్స్ లేదా సాంగ్ డేట్ చెప్పకుండా ముందుగా ఒక నెంబర్‌ను వదలడంతో అసలు అప్డేట్ ఏంటన్నది కూడా సస్పెన్స్‌లో పెట్టేశారు. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ఎక్కువగా తిరుగుతోంది.
మొదటిగా వినిపిస్తున్న థియరీ అల్లు అర్జున్ పాత్రల గురించే. సినిమాలో ఆయన మూడు పాత్రల్లో కనిపిస్తారని కొంతకాలంగా ప్రచారం ఉంది. అలాగే ఏడుగురు హీరోయిన్లు ఉంటారనే మరో టాక్ కూడా నడుస్తోంది. ఆ రెండింటినీ కలిపేలా ‘37’ పెట్టారా అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అయితే పాత్రల సంఖ్య, హీరోయిన్ల సంఖ్యపై ఇప్పటివరకు టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఈ ప్రచారమే ఇప్పుడు ‘37’తో మళ్లీ బయటకు వచ్చింది.
మరో థియరీ మాత్రం డైరెక్ట్ గా అట్లీ పుట్టినరోజుకు వెళ్తోంది. సెప్టెంబర్ 21న ఆయన బర్త్‌డే. 3×7 చేస్తే 21 వస్తుండటంతో ఆ రోజున ‘రాకా’ నుంచి కొత్త అప్డేట్ ఉండొచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ 17 కావడంతో ఆ డేట్‌కు నాలుగు రోజులే ఉంది. మేకర్స్ ముందుగానే పజిల్ మొదలుపెట్టడానికి ఇదే కారణమా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
‘రాకా’ గురించి ఇప్పటివరకు బయటకు వచ్చిన కంటెంట్ కూడా చాలా తక్కువే. టైటిల్‌తో పాటు అల్లు అర్జున్ లుక్‌ను చూపించారు కానీ కథ ఏ జోన్‌లో నడుస్తుంది, ఆయన పాత్ర ఎలా ఉంటుంది అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. సినిమా గురించి మధ్య మధ్యలో కాస్టింగ్ వార్తలు వస్తున్నా టీమ్ నుంచి అప్డేట్స్ తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ‘37’తో మళ్లీ ప్రమోషన్స్ వైపు కదిలారు. అందుకే చిన్న పోస్టర్‌కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది.
అయితే మూడు పాత్రలు, ఏడుగురు హీరోయిన్లు అనే థియరీ నిజమైతే ఈ పోస్టర్ కథలోని పెద్ద పాయింట్‌కే హింట్ ఇచ్చినట్టవుతుంది. సెప్టెంబర్ 21 థియరీ నిజమైతే మాత్రం ‘37’ అసలు అప్డేట్‌కు ముందు వేసిన చిన్న పజిల్‌గా మిగులుతుంది. రెండింటిలో ఏది అయినా మేకర్స్ అనుకున్న పని మాత్రం జరిగింది. ఒక్క నెంబర్‌తోనే సినిమా నుంచి ఏం రాబోతోందనే డిస్కషన్ మొదలైంది.
ఇప్పుడు అందరి చూపు సెప్టెంబర్ 21పైనే ఉంటుంది. ఆ రోజు అట్లీ బర్త్‌డే కావడంతో కొత్త పోస్టర్ వస్తుందా, అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన హింట్ ఇస్తారా, లేక మరో పెద్ద అప్డేట్ ప్లాన్ చేశారా అనేది చూడాలి. ఒకవేళ ఆ రోజుకీ ‘37’కు సమాధానం రాకపోతే మాత్రం ఈ నెంబర్‌కు సినిమాలోనే మరో కనెక్షన్ ఉందనే థియరీ ఇంకా బలపడుతుంది. ఇక మేకర్స్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి.
