రెహమాన్ మ్యాజిక్ తగ్గిందా? లేక ఆడియన్స్ అంచనాలే మారాయా?
ఒకప్పుడు రెహమాన్ మ్యూజిక్ అందించిన మూవీ వస్తుందంటేనే ఆ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడేది.
By: Sravani Lakshmi Srungarapu | 18 Aug 2026 11:51 AM ISTసినిమా మ్యూజిక్ అంటే కథలో భాగమే కాదు.. సినిమాకు అదనపు బలంగా నిలిచే ఆయుధం. ముఖ్యంగా కథలో స్ట్రాంగ్ ఎమోషన్స్, హిస్టారిక్ బ్యాక్‌గ్రౌండ్, దేశభక్తి వంటి అంశాలు ఉన్నప్పుడు పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ పై గట్టి ప్రభావం చూపుతాయి. అయితే ప్రస్తుతం మంచి పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వచ్చే మ్యూజిక్ కూడా ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలమైతే, ఆ సినిమాపైనే కాకుండా ఆ మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్షన్‌పైనా డిస్కషన్ మొదలవుతోంది. ఇదే పరిస్థితి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ విషయంలో కనిపిస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు రెహమాన్ మ్యూజిక్ అందించిన మూవీ వస్తుందంటేనే ఆ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడేది. సాంగ్స్ రిలీజ్ కు ముందే సినిమాకు హైప్ తీసుకురావడం, థియేటర్లలో కీలక సన్నివేశాలకు నేపథ్య సంగీతం మరింత బలాన్ని చేకూర్చడం ఆయన ప్రత్యేకతగా ఉండేది. అయితే గత కొంతకాలంగా ఆయన మ్యూజిక్ పై ఆడియన్స్ రెస్పాన్స్ గతంతో పోలిస్తే మిశ్రమంగా కనిపిస్తోంది. దీన్ని రెహమాన్ సామర్థ్యం తగ్గిందనేలా చూడటం కంటే.. ప్రేక్షకుల అంచనాలు భారీగా పెరిగిపోయాయా? అనేది పరిశీలించాల్సిన అంశంగా మారింది.
ఇప్పటి ప్రేక్షకులు కేవలం మంచి పాటలను మాత్రమే కోరుకోవడం లేదు. సినిమా నేపథ్యానికి తగ్గ మ్యూజిక్, వెంటనే గుర్తుండిపోయే ట్యూన్, కీ సీన్స్ లో ఎమోషన్ ను మరింత పెంచే బీజీఎం.. ఇవన్నీ ఒకేసారి ఆశిస్తున్నారు. అందుకే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఉన్నంత మాత్రాన సినిమా మ్యూజిక్ సక్సెస్ అవుతుందనే పరిస్థితి లేదు. కథకు సరిపోయే మ్యూజిక్ లాంగ్వేజ్ ను ఎంచుకోవడం మరింత కీలకంగా మారింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాజ్‌కుమార్ సంతోషి సినిమాల మ్యూజికల్ ట్రాక్ కూడా డిస్కషన్‌కు వస్తోంది. ఆయన గత సినిమాల్లో స్టోరీ, క్యారెక్టర్లు, ఎమోషన్స్ తో పాటూ సాంగ్స్ సహజంగానే కలిసిపోయేవి. కొన్ని సందర్భాల్లో పాటలే సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన్నుంచి బట్వారా 1947 సినిమాకు ఆడియన్స్ ఆశించే మ్యూజికల్ ఇంపాక్ట్ కనిపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక భట్వారా 1947 విషయంలో సాంగ్స్ తో పాటు బీజీఎం పైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి కథలో మ్యూజిక్ కేవలం వినిపించడానికి కాకుండా.. టైమ్, సిట్యుయేషన్స్, బాధ, దేశభక్తి లాంటి అంశాలను ప్రేక్షకుడికి అనుభూతి చెందించేలా ఉండాల్సి ఉంటుంది. ఆ రేంజ్ లో మ్యూజిక్ స్టోరీని ఎలివేట్ చేయలేకపోతే, దాని ఎఫెక్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ పైనా పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న రెహమాన్ మ్యాజిక్ తగ్గిందా? అనేది మాత్రమే కాదు. రెహమాన్ నుంచి ఆడియన్స్ మ్యూజిక్ ను కోరుకునే స్థాయి మరింత పెరిగిందా? అలాగే కథకు తగ్గ సంగీతాన్ని ఎంచుకోవడంలో దర్శకనిర్మాతలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
