పూరికి సాధ్యం కానిది యువ దర్శకుడికి ఎలా అంటే?
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తన విలక్షణమైన శైలితో సిద్ధాంతాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు.
By: Srikanth Kontham | 16 March 2026 11:28 AM ISTపీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి తన విలక్షణమైన శైలితో సిద్ధాంతాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. కేవలం తనకు నచ్చిన, తన భావజాలానికి దగ్గరగా ఉన్న పాత్రలను మాత్రమే చేస్తూ నిబద్ధత కలిగిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు హర్ష కోనుగంటి తెరకెక్కిస్తున్న `హుషారు 2` చిత్రంలో మూర్తి గారు ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని వార్తలొస్తున్నాయి. వాస్తవానికి ఆర్. నారాయణమూర్తిని కమర్షియల్ సినిమాల్లో నటింపజేయాలని చాలామంది దర్శకులు ప్రయత్నించారు.
అందులో ముఖ్యంగా ప్రస్తావించాల్సింది `టెంపర్` గురించే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి పోషించిన నారాయణమూర్తి అనే నిజాయితీ గల కానిస్టేబుల్ పాత్రను తొలుత ఆర్. నారాయణమూర్తి నే అనుకున్నారు. ఆ పాత్రకు ఆయన మాత్రమే న్యాయం చేయగలరని పూరి చాలా బలంగా నమ్మారు. ఆ కారణంగానే ఆ పాత్రకు ఆయన పేరును పెట్టడమే పెట్టారు. అయితే ఆ అవకాశాన్ని మూర్తి గారు చాలా సున్నితంగా తిరస్కరించారు. కమర్షియల్ హంగులున్న పాత్రల కంటే, తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పాత్రలకే ఆయన ప్రాధాన్యత ఇస్తారని ఆ ఘటనతో మరోసారి రుజువైంది.
తాజాగా `హుషారు 2` సినిమాలో నటించడానికి మూర్తిగారు అంగీకరించడం వెనుక ఒక బలమైన కారణం కనిపిస్తోంది. ఇందులో ఆయన పోషిస్తున్నది నక్సలైట్ పాత్ర. దశాబ్దాలుగా వెండితెరపై విప్లవ వీరుడిగా, ప్రజా పక్షపాతిగా పోరాడే పాత్రల్లోనే మెప్పించారు. నక్సలిజం నేపథ్యం, సామాజిక సమస్యలపై పోరాటం అనేవి ఆయన రక్తంలోనే ఉన్నాయి. హర్ష కోనుగంటి ఈ సినిమాలో నక్సలైట్ పాత్రను ఎంతో హుందాగా, ఆయన భావజాలానికి అద్దం పట్టేలా తీర్చిదిద్దడంతో మూర్తి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. `హుషారు` వంటి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌తో సక్సెస్ అందుకున్న హర్ష కోనుగంటి సీక్వెల్‌లో ఇలాంటి ఒక సీరియస్, పవర్‌ఫుల్ పాత్రను ప్రవేశపెట్టడం సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.
యువతరం ఆలోచనలకు పీపుల్స్ స్టార్ పవర్‌ఫుల్ సిద్ధాంతాలకు మధ్య జరిగే చర్చ లేదా సంఘర్షణ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవబోతోందని సమాచారం. తన ఇమేజ్‌కు భంగం కలగకుండా, తన గొంతుకను వినిపించే అవకాశం ఉండటంతోనే మూర్తి గారు ఇన్నేళ్ల తర్వాత మరో దర్శకుడి సినిమాలో నటించడానికి మొగ్గు చూపారని తెలుస్తోంది. మొత్తానికి కానిస్టేబుల్ పాత్రను కాదన్న మూర్తి గారు నక్సలైట్ పాత్రతో మళ్ళీ కెమెరా ముందుకు రావడం విశేషం. పీపుల్స్ స్టార్‌ను మళ్ళీ వెండితెరపై ఆ గంభీరమైన పాత్రలో చూడాలని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. `హుషారు 2` చిత్రానికి ఈ పాత్ర ఒక పెద్ద అసెట్ కానుంది. కమర్షియల్ సినిమా చట్రంలో ఉంటూనే, ఒక సామాజిక సందేశాన్ని బలంగా వినిపించేందుకు ఆర్. నారాయణమూర్తి సిద్దమవుతున్నట్లు చెప్పొచ్చు.
