Begin typing your search above and press return to search.

సెన్సార్ బోర్డ్ ఆంక్షలతో వాస్తవిక కథలు తెర‌మ‌రుగవుతాయా? రెడ్ స్టార్ నారాయ‌ణ‌మూర్తి ఆవేద‌న వెన‌క గ‌తం!

ఆర్. నారాయణమూర్తి సినిమాలకు సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో సెన్సార్ బోర్డ్ అధికారులు ఎన్నో ఆంక్షలు విధిస్తుంటారు.

By:  Sivaji Kontham   |   17 Oct 2026 10:00 AM IST
సెన్సార్ బోర్డ్ ఆంక్షలతో వాస్తవిక కథలు తెర‌మ‌రుగవుతాయా? రెడ్ స్టార్ నారాయ‌ణ‌మూర్తి ఆవేద‌న వెన‌క గ‌తం!
X

తెలుగు చిత్రపరిశ్రమలో విప్లవాత్మక భావాలు, సామాజిక స్పృహ కలిగిన కథలతో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి. నాలుగు పదుల సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో పీడిత వర్గాల గొంతుకగా నిలిచారు. రైతుల కష్టాలు, కార్మికుల సమస్యలు, భూపోరాటాలు, సామాజిక అసమానతలను అద్దం పట్టే కథలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. అయితే సమాజంలోని వాస్తవాలను నిష్పాక్షికంగా చూపే క్రమంలో ఆయన నిర్మించిన ప‌లు చిత్రాలు సెన్సార్ బోర్డు నుంచి తీవ్రమైన అడ్డంకులను ఎదుర్కొన్నాయి.

ఆర్. నారాయణమూర్తి సినిమాలకు సర్టిఫికెట్ ఇచ్చే సమయంలో సెన్సార్ బోర్డ్ అధికారులు ఎన్నో ఆంక్షలు విధిస్తుంటారు. ముఖ్యంగా సినిమాల శీర్షికలలో కామ్రేడ్, ఎర్రజెండా వంటి పదాలు ఉన్నప్పుడు లేదా కథలో ఎస్టాబ్లిష్‌మెంట్‌ను ప్రశ్నించే సన్నివేశాలు ఉన్నప్పుడు బోర్డు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఆర్టికల్ 19 కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ ప్రకారం కళాకారులకు సమాజంలో జరిగే సంఘటనలను ప్రతిబింబించే హక్కు ఉన్నప్పటికీ నిబంధనల పేరుతో సినిమాలను నిలిపివేయడం లేదా ప్రధాన సన్నివేశాలకు కత్తెర వేయడం వల్ల నిర్మాతలు తీవ్ర ఆర్థిక, మానసిక క్షోభకు గురవుతుంటారని ఆయన వాపోతుంటారు.

నక్సలిజం- విప్లవాత్మక నేపథ్యంతో సినిమాలు తీయడం వల్లే ఆయన ప్రతిసారీ ఇబ్బందులకు గురయ్యారా అంటే... అది ప్రధాన కారణాలలో ఒకటిగా కనిపిస్తుంది. ఆర్. నారాయణమూర్తి చిత్రాలలో ఎక్కువగా నక్సల్బరీ ఉద్యమం, అడవి, గిరిజనుల హక్కులు, విప్లవ పోరాటాలు నేపథ్యంగా ఉంటాయి. ఇలాంటి కథలలో ఆలివ్ గ్రీన్ (మిలటరీ-నక్సల్స్ గెటప్) దుస్తులు ధరించడం లేదా పోలీసు, ప్రభుత్వ వ్యవస్థల లోపాలను ఎత్తిచూపడం సహజం. అధికారులు వీటిని `ప్రభుత్వ వ్యతిరేక` లేదా `లా అండ్ ఆర్డర్` సమస్యగా పరిగణించి అతిగా స్పందించడం వల్ల సర్టిఫికేషన్ ప్రక్రియ జాప్యమ‌య్యేది.

అయితే తానెప్పుడూ చట్ట వ్యతిరేక చర్యలను లేదా హింసను ప్రోత్సహించలేదని నారాయణమూర్తి స్పష్టం చేస్తుంటారు. ఇప్పుడు శ్రీ‌విష్ణు- కోన వెంకట్ ల కామ్రేడ్ క‌ళ్యాణ్ సెన్సార్ విష‌యంలో జ‌రిగిన విష‌యాల‌పైనా ఆయ‌న ఫైర‌య్యారు. తాజాగా సినిమా స‌క్సెస్ వేడుక‌లో నారాయ‌ణ మూర్తి త‌న‌దైన శైలిలో నిప్పులు చెరిగారు. ``మేము నక్సలైట్లం కాదు, సినిమా తల్లి బిడ్డలం. సమాజంలో జరుగుతున్న విషయాలను చెప్పే కళాకారులం`` అని ఆయన గట్టిగా వాదించారు. కేవలం నక్సలిజం చిత్రాలే కాకుండా సమాజంలో నెలకొన్న అవినీతి.. విద్యా వ్యవస్థలో వ్యాపారీకరణ.. రైతుల ఆత్మహత్యలు వంటి అనేక అంశాలపైనా సినిమాలు తీసిన అనుభ‌వ‌జ్ఞుడు నారాయ‌ణ‌మూర్తి. అయితే వ్యవస్థను నేరుగా ప్రశ్నించే తత్వమే ఆయన చిత్రాలకు అధికార వర్గాల నుండి ప్రధాన అడ్డంకిగా మారుతుంది.

ఇప్ప‌టికైనా సెన్సార్ బోర్డు మారాల‌నేది నారాయ‌ణ మూర్తి ఆకాంక్ష‌. పక్షపాత వైఖరి వీడి, సామాజిక అంశాలను స్పృశించే చిత్రాల విష‌యంలో విస్తృత దృక్పథంతో వ్యవహరించాలని నారాయణమూర్తి అభిప్రాయపడతారు. ప్రభుత్వ అనుకూల చిత్రాలకు సడలింపులు ఇస్తూ.. పేదల పక్షాన నిలిచే చిత్రాలకు కఠిన నిబంధనలు అమలు చేయడం సరికాదని ఆయన నమ్ముతారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా..సెన్సార్ బోర్డ్ ఆంక్షలను తట్టుకుంటూ, ప్రజాదరణే ప్రధాన బలంగా భావించి ఆర్. నారాయణమూర్తి తన శైలి వాస్తవిక సినిమాలను నిర్మించడం విశేషం. ఇప్పుడు కోన వెంక‌ట్ బృందానికి రెడ్ స్టార్ నారాయ‌ణ మూర్తి మ‌ద్ధ‌తు ల‌భించ‌డం.. వేదిక‌పై చిత్ర‌బృందానికి కితాబివ్వ‌డం ఆస‌క్తిక‌రం.