Begin typing your search above and press return to search.

హుషారు 2 : శ్రీకృష్ణుడి వంటి పాత్రలో ఆర్‌ నారాయణమూర్తి

2018లో వచ్చిన హుషారు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   27 Oct 2026 8:46 PM IST
హుషారు 2 : శ్రీకృష్ణుడి వంటి పాత్రలో ఆర్‌ నారాయణమూర్తి
X

2018లో వచ్చిన హుషారు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా మ్యూజికల్‌గానూ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సీక్వెల్‌ అనగానే అంచనాలు పెరిగాయి. పైగా సీక్వెల్‌కు మరింత హైప్‌ తీసుకు వచ్చే విధంగా భారీ బడ్జెట్‌తో రూపొందించడంతో పాటు, అశోక్‌ గల్లాను తీసుకోవడం వల్ల స్థాయి పెరిగింది. మొదటి పార్ట్‌లో రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలో కనిపించినట్లుగానే ఈ సినిమాలో కూడా ఆయన కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా హుషారు 2 సినిమా టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. టీజర్ విడుదల కార్యక్రమంలో ఆర్‌ నారాయణ మూర్తి పాల్గొనడంతో అంతా గెస్ట్‌గా పాల్గొని ఉంటాడని అంతా భావించారు. కానీ టీజర్ విడుదల తర్వాత సినిమాలో ఆయన నటించాడని క్లారిటీ వచ్చింది. ఆర్‌ నారాయణ మూర్తిని ఈ సినిమాలో ఒక నక్సలైట్‌ పాత్రలో చూపించబోతున్నట్లు టీజర్‌లో చూపించారు.

హుషారు 2 సినిమా టీజర్‌...

టీజర్‌ లాంచ్ కార్యక్రమంలో ఆర్‌ నారాయణ మూర్తి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హీరోలు పంచ పాండవులు అయితే, ఆ పాండవులను కాపాడే శ్రీకృష్ణుడి పాత్రను నాకు దర్శకుడు శ్రీహర్ష ఇచ్చాడు అంటూ నారాయణ మూర్తి చెప్పుకొచ్చాడు. విలన్‌ బారి నుంచి హీరోలను కాపాడే పాత్రను ఇవ్వడం ద్వారా తనకు గౌరవం ఇచ్చారని ఈ సందర్భంగా నారాయణ మూర్తి చెప్పుకొచ్చాడు. ఇంకా ఆర్‌ నారాయణమూర్తి మాట్లాడుతూ... భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాలరాస్తూ, యువతను నిరుద్యోగంలోకి నెట్టివేస్తూ, రిజర్వేషన్‌లను కోల్పేయేలా చేస్తున్నారు. అన్ని గర్నమెంట్‌ సెక్టార్స్‌ మూత పడుతున్నాయి. దాంతో యువత నిరుద్యోగులుగా మారుతున్నారు. కార్పోరేట్‌ కంపెనీలు యువత నుంచి శ్రమ దోపిడికి పాల్పడుతున్నాయి. విదేశీ కంపెనీలు ఇండియాలో రూల్‌ చేస్తున్నాయని అన్నాడు.

కీలక పాత్రలో ఆర్‌ నారాయణ మూర్తి...

ఇలాంటి దశలో చాలా మంది యువత నలిగి పోతున్నారు. ఆ యువత స్వేచ్చను కోరుకుంటూ, ఇది జీవితం కాదు, స్వేచ్చగా బతకాలి అనుకున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు, వారికి విలన్ నుంచి ఎదురు అయ్యే సమస్యల వల్ల ఫారెస్ట్‌కు రావడంతో విలన్స్‌ తమ వ్యాపారం చెడిపోతుందనే ఉద్దేశంతో వారిని అంతం చేసేందుకు ప్రయత్నించడం, వారిని నేను భారతంలో పాండవులను శ్రీకృష్ణుడు ఎలా అయితే కాపాడుతాడో అలా నా పాత్ర ద్వారా కాపాడేలా చేయడం జరుగుతుంది. దర్శకుడు శ్రీహర్ష ఈ సినిమాలో భారతం నేపథ్యంను తీసుకోవడం బాగుందని మూర్తి అన్నాడు. నా పాత్రతో వారికి సపోర్ట్‌ చేయించడం అనేది బాగా నచ్చిందని కూడా చెప్పుకొచ్చాడు. పీపుల్స్ స్టార్‌ ఆర్‌ నారాయణ మూర్తి మొదటి సారి ఇలాంటి పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు.

దర్శకుడు శ్రీ హర్ష ఏం చెప్పాడు...

గతంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి, దర్శకత్వం వహించి, సినిమాలను నిర్మించి, సంగీతం అందించిన ఆర్‌ నారాయణ మూర్తి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాలను ఈ జెనరేషన్‌ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. దాంతో తన రూటు మార్చుకుని క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేసేందుకు మూర్తి రెడీ అయ్యాడు. గతంలో కోట్ల పారితోషికం కాదని సినిమాలకు నో చెప్పిన ఆర్‌ నారాయణ మూర్తి ఇప్పుడు ఒక చిన్న మూవీకి ఓకే చెప్పడం ఏంటని చాలా మంది షాక్ అవుతున్నారు. దర్శకుడు శ్రీ హర్ష ఏం చెప్పి ఒప్పించి ఉంటాడు అనే చర్చ జరుగుతోంది. ఈ విషయమై దర్శకుడు శ్రీ హర్ష ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో, ఆర్‌ నారాయణ మూర్తి పాత్ర కోసం అయినా ఈ సినిమాకు వెళ్లాలని ఇప్పటి నుంచే చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా హిట్‌ అయ్యి, మూర్తి అన్న పాత్రకు మంచి పేరు వస్తే ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఆయనను చూడవచ్చు.