దాసరి, పూరీలకే నో.. మరి 'హుషారు'కి ఎలా?
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడానికి సీనియర్ హీరోలు క్యూ కడుతున్న రోజులివి.
By: M Prashanth | 27 Oct 2026 6:57 PM ISTటాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడానికి సీనియర్ హీరోలు క్యూ కడుతున్న రోజులివి. కానీ దశాబ్దాలుగా తన పంథా మార్చుకోకుండా సింగిల్ లైన్ లో నడిచిన ఏకైక హీరో ఆర్ నారాయణమూర్తి. అలాంటి 'పీపుల్స్ స్టార్' హఠాత్తుగా 'హుషారు 2' లాంటి లేటెస్ట్ ట్రెండ్ యూత్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
నారాయణమూర్తి కమర్షియల్ సినిమాలకు ఆమడ దూరంలో ఉంటారనేది అందరికీ తెలిసిందే. తను నమ్మిన సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే కథల్లో, అది కూడా హీరోగానే నటిస్తానని ఆయనొక గిరి గీసుకున్నారు. ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఎర్రన్న సినిమాలు ఈమధ్య కాలంలో పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ ఆయనంటే మెగాస్టార్ చిరంజీవి నుంచి బ్రహ్మానందం వరకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఎనలేని గౌరవం ఉంది.
ఆయన ఓకే చెబితే అద్భుతమైన పాత్రలు రాయడానికి స్టార్ దర్శకులు ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. కానీ తన సిద్ధాంతాలకు ఆయన ఎంతలా కట్టుబడి ఉంటారంటే.. తనకు మొదటి అవకాశం ఇచ్చిన గురువు దాసరి నారాయణరావు అడిగినా సరే 'ఒసేయ్ రాములమ్మ'లో నటించలేదు. అలాగే బ్లాక్ బస్టర్ 'టెంపర్' లో పోసాని చేసిన సిన్సియర్ మూర్తి క్యారెక్టర్ కు పూరి జగన్నాథ్ ఫస్ట్ ఛాయిస్ నారాయణమూర్తే. కానీ దానికి కూడా నిర్మొహమాటంగా నో చెప్పేశారు.
ఎవరు ఎంత బతిమాలినా, ఎన్ని ఆఫర్లు ఇచ్చినా వేరే వారి సినిమాల్లో చేయడానికి ససేమిరా అన్న ఆయన.. ఇప్పుడు 'హుషారు 2'కి ఎలా ఓకే చెప్పారనేది ఆసక్తికరం. ఇది పక్కా లేటెస్ట్ జనరేషన్ సినిమా. అయితే ఇందులో ఆయన క్యారెక్టర్ చూస్తే మాత్రం తన సిద్ధాంతాలకు పక్కాగా సరిపోయేలాగే కనిపిస్తోంది. చేతిలో తుపాకీ, మెడలో ఎర్ర కండువాతో వ్యవస్థ మీద పోరాడే విప్లవకారుడిగానే ఆయన ఎంట్రీ ఇచ్చారు.
ఒక రకంగా ఎర్రన్న ఇలాంటి సినిమాలకు ఓకే చెప్పడం టాలీవుడ్ కు చాలా మంచి పరిణామం. ఇండస్ట్రీలో రెగ్యులర్ పాత్రలు వేసేవాళ్లు చాలామంది ఉన్నారు. కానీ వ్యవస్థను ప్రశ్నించే ఇంటెన్స్ రోల్స్, ఒక ఐడియాలజీని బలంగా నమ్మే క్యారెక్టర్లు పండిచే నటుల కొరత బాగా ఉంది. ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలకు ఆర్ నారాయణమూర్తి లాంటి పర్ఫార్మర్ దొరికితే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తరం మారినా ఆయనలోని ఫైర్ ఇంకా తగ్గలేదని టీజర్ చూస్తే అర్థమవుతోంది. కేవలం తన సొంత సినిమాలకే పరిమితం కాకుండా, కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటూనే తన ఇమేజ్ కు సరిపోయే ఇలాంటి స్పెషల్ రోల్స్ చేస్తే ప్రేక్షకులకు కూడా ఫ్రెష్ ఫీల్ దొరుకుతుంది. ఇక ఎర్రన్న కేవలం ఈ సినిమా వరకే ఓకే చెప్పారా లేదంటే మిగతా దర్శకులకు కూడా పత్రాలను బట్టి ఓకే చెబుతారా అన్నది చూడాలి.
