Begin typing your search above and press return to search.

ఎడిసన్ ఆఫ్ ఇండియా: R మాధవన్ మ‌రో ప్ర‌యోగం

`రాకెట్రి : నంబి ఎఫెక్ట్` క‌మ‌ర్షియ‌ల్ విజయం త‌ర్వాత‌, ఆర్.మాధ‌వ‌న్ మ‌రోసారి సైంటిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

By:  Sivaji Kontham   |   28 Oct 2025 5:00 PM IST
ఎడిసన్ ఆఫ్ ఇండియా: R మాధవన్ మ‌రో ప్ర‌యోగం
X

`రాకెట్రి : నంబి ఎఫెక్ట్` క‌మ‌ర్షియ‌ల్ విజయం త‌ర్వాత‌, ఆర్.మాధ‌వ‌న్ మ‌రోసారి సైంటిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. రాకెట్ సైన్స్ పితామ‌హుడిగా పేరున్న ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ‌న్ (త‌మిళియ‌న్) పాత్ర‌లో అత‌డి న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి. 2022లో విడుద‌లైన ఈ చిత్రం ఉత్త‌మ ఫీచ‌ర్ ఫిలిం కేట‌గిరీలో జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఈ చిత్రాన్ని స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన మాధ‌వ‌న్ టైటిల్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించి మెప్పించాడు.

ఇప్పుడు మాధవన్ మ‌రో సైంటిస్ట్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. భారతీయ సైంటిస్ట్ -ఇంజనీర్ జిడి నాయుడుగా అత‌డు త‌న‌ను తాను తెర‌పై ఆవిష్క‌రించుకుంటున్నారు. పారిశ్రామిక మార్గదర్శకుడు నాయుడు పాత్ర‌లో మాధవన్ ఫస్ట్ లుక్‌ను మేక‌ర్స్ తాజాగా ఆవిష్కరించారు. ఈ పోస్ట‌ర్ చూడ‌గానే.. సైంటిస్ట్ నాయుడు ఒరిజిన‌ల్ గెట‌ప్‌లోకి మ్యాడీ ఒదిగిపోయిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. బట్టతల.. సోడాబుడ్డి క‌ళ్ల‌ద్దంతో వృద్ధ ఇంజనీర్‌గా క‌నిపిస్తున్న మాధ‌వ‌న్ ని గుర్తు ప‌ట్ట‌డం ఎవ‌రికైనా చాలా క‌ష్టం. వర్క్‌షాప్‌లో లోహానికి టంకం వేస్తూ అత‌డు నిజ‌మైన ప్ర‌యోగ‌శీలిగా క‌నిపిస్తున్నాడు. జి.డి. నాయుడు ఎవ‌రి పాఠాలు విన‌లేదు. అత‌డు సెల్ఫీ టీచింగ్ ఇంజనీర్.. పారిశ్రామికవేత్త‌గా త‌న‌ను తాను ఆవిష్క‌రించుకున్నాడు. ఎంద‌రికో మార్గదర్శకుడుగా మారారు. ఆయనను `ఎడిసన్ ఆఫ్ ఇండియా` అని పిలుస్తూ ఈ ప్ర‌పంచం అత‌డి గొప్ప‌త‌నాన్ని కీర్తించింది.

మ్యాడీ తాజా లుక్ చూడ‌గానే అత‌డు మ‌రో సైంటిస్ట్ పాత్ర‌కు ప్రాణం పోస్తున్నాడ‌ని నెటిజ‌నులు కీర్తిస్తున్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క బ‌యోపిక్ కి గోవింద్ వసంత సంగీతం అందిస్తుండ‌గా, అరవింద్ కమలనాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

వర్గీస్ మూలన్ పిక్చర్స్ అధినేత‌లు వర్గీస్ మూలన్, విజయ్ మూలన్ .. ట్రైకలర్ ఫిల్మ్స్ అధినేత‌లు ఆర్. మాధవన్ - సరితా మాధవన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్లు గతంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్ అయిన రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌ను నిర్మించిన సంగ‌తి తెలిసిందే.

ఈ బయోపిక్ చిత్రానికి కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషార విజయన్, తంబి రామయ్య, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నటుడు యోగి బాబు కూడా ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారని క‌థ‌నాలు వ‌చ్చినా, దీనిని మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.