Begin typing your search above and press return to search.

ఆసియా క్రీడ‌ల్లో కుమారుడి ఓట‌మి.. తండ్రిగా మ్యాడీ ఏం చేసారో తెలుసా?

తాజాగా ఆసియా క్రీడల్లో పాల్గొన్న వేదాంత్ మాధవన్ పురుషుల 4x200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్‌లో పోటీ పడ్డారు.

By:  Sivaji Kontham   |   23 Sept 2026 9:11 AM IST
ఆసియా క్రీడ‌ల్లో కుమారుడి ఓట‌మి.. తండ్రిగా మ్యాడీ ఏం చేసారో తెలుసా?
X

ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ (మ్యాడీ) కేవలం వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఒక ఆదర్శవంతమైన తండ్రిగా గుర్తింపు పొందుతున్నారు. తన కుమారుడు వేదాంత్ మాధవ్‌ను చదువులకే పరిమితం చేయకుండా.. అతడికి ఇష్టమైన క్రీడా రంగంలో ఒక ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా ఎదగడానికి పూర్తి స్వేచ్ఛను, మద్దతును ఇస్తున్నారు. చిన్న వయసు నుంచే తన కొడుకు లక్ష్యాలను గుర్తించి.. వాటిని సాధించే మార్గంలో వెన్నుదన్నుగా నిలుస్తున్న మాధవన్ తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

తాజాగా ఆసియా క్రీడల్లో పాల్గొన్న వేదాంత్ మాధవన్ పురుషుల 4x200 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్‌లో పోటీ పడ్డారు. అయితే కేవలం 0.2 సెకన్ల తేడాతో భారత జట్టు ఫైనల్స్ అవకాశాన్ని చేజార్చుకోవడం కొద్దిగా నిరాశపరిచినా.. అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుతూ మ్యాడీ కుమారుడు వేదాంత్ ముందుకు సాగుతుండ‌టాన్ని ప్ర‌పంచం హ‌ర్షిస్తోంది. చిన్నచోటు స్వల్ప తేడాతో అవ‌కాశం చేజారినా తన కొడుకు పడుతున్న కష్టాన్ని, అంకితభావాన్ని గమనిస్తున్న మాధవన్ తండ్రిగా ఎప్పుడూ వెంటే ఉంటూ ధైర్యాన్ని నింపుతున్నారు.

త‌మ సంతానం కోరుకున్న రంగంలో రాణించాలంటే కేవలం వారిని ఇష్టానికి వదిలేయడమే కాకుండా.. వారి దైనందిన జీవితంలో క్రమశిక్షణను అలవరచడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని మాధవన్ నిరూపిస్తున్నారు. వేదాంత్ తన క్రీడా కెరీర్ విష‌యంలో ఎంతటి నిబద్ధతతో ఉంటాడో చెబుతూ.. ఆహారపు అలవాట్ల నుంచి ప్రాక్టీస్ వరకు తాను ఎంత కష్టపడతాడో మాధవన్ ఎంతో గర్వంగా షేర్ చేసుకున్నాడు. ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే పిల్లలపై బలవంతంగా ఇష్టాలను రుద్దకుండా... వారి స్వశక్తిని గుర్తించి ప్రోత్సహించే పేరెంట్స్ అవసరం ఎంతైనా ఉందని మ్యాడీ చర్యలు తెలియజేస్తున్నాయి.

ప్రస్తుత సమాజంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం మార్కుల పేరుతో ఒత్తిడి చేస్తున్నారు త‌ప్ప వారి అభిరుచుల్ని గౌర‌వించ‌డం లేదు. కానీ ఇందుకు భిన్నంగా పిల్లల అభిరుచిని గౌరవిస్తూ.. క్రీడల వైపు అడుగులు వేయిస్తున్న మాధవన్ లాంటి సెలబ్రిటీ పేరెంట్స్ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటూ దేశం తరఫున పతకాలు సాధిస్తున్న వేదాంత్ ప్రయాణం వెనుక తండ్రిగా మాధవన్ ఇస్తున్న మానసిక స్థైర్యం, అండదండలు ఎంతో గొప్పవి. ఇది ఇత‌ర పేరెంట్ కి కూడా ఆద‌ర్శం.

తమ పిల్లల కలలకు తల్లిదండ్రులు రెక్కలైతే.. ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చని మాధవన్ - వేదాంత్ ల బంధం నిరూపిస్తోంది. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా తదుపరి వ్యక్తిగత ఈవెంట్లకు (200 మీటర్ల ఫ్రీస్టైల్, బ్యాక్‌స్ట్రోక్) సిద్ధమవుతున్న వేదాంత్‌కు తండ్రిగా మాధవన్ అందిస్తున్న మద్దతు ఎనలేనిది. పిల్లలను క్రీడాకారులుగా లేదా తమకు నచ్చిన రంగంలో నంబర్ వన్‌గా చూడాలనుకునే ప్రతీ ఒక్క తల్లిదండ్రులకు మాధవన్ అనుసరిస్తున్న ఈ పేరెంటింగ్ విధానం ఒక చక్కటి మార్గదర్శకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.