గోల్ఫ్ ఆడితే ఇన్ని లాభాలున్నాయా? CEOల సీక్రెట్ లీక్ చేసిన మ్యాడీ!
సాధారణంగా గోల్ఫ్ అనగానే అది కేవలం సంపన్నుల క్రీడ అని.. కాలక్షేపానికి ఆడే ఆట అని చాలా మంది భావిస్తుంటారు.
By: Sivaji Kontham | 30 April 2026 9:35 AM ISTసాధారణంగా గోల్ఫ్ అనగానే అది కేవలం సంపన్నుల క్రీడ అని.. కాలక్షేపానికి ఆడే ఆట అని చాలా మంది భావిస్తుంటారు. ఇటీవల లండన్‌లో పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ గోల్ఫ్ ఆడుతూనే హఠాన్మరణం చెందడం పెద్ద చర్చకు దారితీసింది. వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏలే సంజయ్ కపూర్ వంటి బిజినెస్ దిగ్గజాలు గోల్ఫ్ ఆటకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అనే విషయాలపై వెండితెర `మ్యాడీ` ఆర్. మాధవన్ ఆసక్తికరమైన విశ్లేషణ ఇచ్చారు. గోల్ఫ్ కేవలం వినోదం మాత్రమే కాదని.. అది ఒక వ్యక్తి క్యారెక్టర్‌ను మలిచే అద్భుతమైన సాధనమని ఆయన వివరించారు.
మాధవన్ అభిప్రాయం ప్రకారం.. గోల్ఫ్ అనేది ప్రపంచంలో వేరొకరితో కాకుండా తనతో తాను పోటీ పడే ఏకైక క్రీడ. ఇది మనిషిలో అసాధారణమైన ఏకాగ్రతను- క్రమశిక్షణను పెంచుతుంది. ఒక గోల్ఫ్ క్రీడాకారుడు బంతిని కొట్టే ముందు బాహ్య విషయాల కారణంగా పరధ్యానాలను పక్కన పెట్టి ఎలాగైతే ఏకాగ్రత వహిస్తారో.. నటుడు కూడా కెమెరా ముందు అలాగే ఉండాలని మాధవన్ పేర్కొన్నారు. కెరీర్ ప్రారంభంలో జనం మధ్య షూటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డ తనకు.. గోల్ఫ్ నేర్పిన ఏకాగ్రతే ఇప్పుడు వేల మంది మధ్యలో కూడా ప్రశాంతంగా నటించే శక్తిని ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు, సీఈఓలు ఈ క్రీడను ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉందని మాధవన్ విశ్లేషించారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడు? ఆ సమయంలో నిజాయితీగా ఉంటాడా లేక ఇతరులపై నిందలు వేస్తాడా? అన్నది ఈ ఆట బయటపెడుతుంది. గోల్ఫ్ ఆడేటప్పుడు ఉండే `నో నాయిస్.. నో రష్` వాతావరణం మనిషిని నిదానంగా ఉండేలా చేస్తుంది. ఇది భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం.. క్లిష్ట పరిస్థితుల్లోనూ నిలకడగా ఉండటం నేర్పుతుంది. విజయవంతమైన నాయకులకు కావాల్సిన ఓపిక.. దీర్ఘకాలిక ఆలోచన ఈ క్రీడ ద్వారా అలవడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
గోల్ఫ్ కేవలం వ్యక్తిత్వ వికాసానికే కాదు... వృత్తిపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కూడా ఒక గొప్ప వేదిక. మైదానంలో ప్రత్యర్థులతో కలిసి ఆడుతూనే వారిలో పరస్పర విశ్వాసాన్ని నిర్మించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. అందుకే కార్పొరేట్ దిగ్గజాలు పెద్ద పెద్ద డీల్స్ మాట్లాడటానికి లేదా నమ్మకమైన భాగస్వాములను గుర్తించడానికి గోల్ఫ్ కోర్ట్‌ను ఎంచుకుంటారు. క్యారెక్టర్‌ను పరీక్షించాలన్నా.. నిలకడను పెంచుకోవాలన్నా గోల్ఫ్ మించిన ఆట లేదనేది మాధవన్ చెబుతున్న మాట.
గోల్ఫ్ వల్ల లభించిన మానసిక పరిపక్వత తన వృత్తిగత జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతోందని మ్యాడీ తెలిపారు. శూన్యం నుంచి ఏకాగ్రతను ఒడిసిపట్టడం.. ప్రతి షాట్‌ను పరిపూర్ణంగా కొట్టడం వంటి పాఠాలు గోల్ఫ్ ద్వారా నేర్చుకున్నానని.. అవి తన నటనను మరింత మెరుగుపరిచాయని అతడు చెప్పుకొచ్చారు. మొత్తానికి మ్యాడీ మాటలను బట్టి చూస్తుంటే.. గోల్ఫ్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదు..అది ఒక సంపూర్ణ జీవన పాఠశాల అని అర్థమవుతోంది. ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించిన దురంధర్ 2లో మాధవన్ రా వింగ్ ని నడిపించే అజిత్ దోవల్ పాత్రలో అద్భుతంగా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు విజయాన్ని ఆస్వాధిస్తున్నాడు.
